సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మహానగర తాగునీటి ఇక్కట్లకు ఫుల్‌స్టాప్ పెట్టేలా కార్యాచరణ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా కాళేశ్వరం ద్వారా తరలిస్తున్న గోదావరి నీటిని శామీర్‌పేట మండలం కేశవపురం రిజర్వాయర్‌కు తరలించాలని ఇప్పటికే నిర్ణయం జరిగి, అందుకు అనుగుణంగా పనులు సాగుతున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా కొత్తగా మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. హైదరాబాద్ తాగునీటికి ఎలాంటి కొరత ఏర్పడకుండా చూసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్‌కు, అటు నుంచి హిమాయత్‌సాగర్ రిజర్వాయర్‌కు తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి వెళ్లే సంగారెడ్డి కెనాల్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్ అవసరాలకు భరోసా..
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లు తొలి నుంచి కీలక ఆధారంగా ఉన్నాయి. 3.90 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ఉస్మాన్‌సాగర్ నుంచి 25 మిలియన్ గ్యాలన్లు, 2.96 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న హిమాయాత్ సాగర్ నుంచి 15 మిలియన్ గ్యాలన్ల మేర తాగునీరు నగరానికి సరఫరా అవుతున్నాయి. అయితే, ఈ కృష్ణా బేసిన్‌లో నెలకొంటున్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు రిర్వాయర్లు నిండటం గగనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తాగు అవసరాల కోసం అక్కంపల్లి, సింగూరు, మంజీరా, ఎల్లంపల్లి రిజర్వాయర్ల ద్వారా తరలిస్తున్న నీటిపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, నగర జనాభా రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో తాగునీటి అవసరాలు కూడా పెరుగుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో ఏమాత్రం ప్రవాహాలు తగ్గినా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ సహా సింగూరు, మంజీరా, అక్కంపల్లి రిజర్వాయర్ల ద్వారా నీళ్లందించడం కష్టంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని తాగునీటి అవసరాలకు అనుగుణంగా ఇప్పటికే కేశవపురం రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. రూ.7,219 కోట్ల వ్యయంతో కేశవపురంలో 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మించేందుకు జలమండలి అధికారులు పనులు మొదలు పెట్టారు. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు వచ్చే గోదావరి నీటిని 18 కి.మీ దూరంలో ఉన్న కేశవపురం రిజర్వాయర్‌కు గ్రావిటి ద్వారా తరలించాలని ప్రణాళిక రూపొందించారు. 3 వరుసల్లో 3,600 ఎంఎం డయా పైపులైన్ ద్వారా నీటిని తరలించాలని యోచిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌కు ఇన్‌లెట్, అవుట్ లెట్, స్పిల్‌వే అమర్చుతారు. ఈ పనులన్నింటినీ జలమండలి చేయనుంది. అయితే, కేశవపురంకు నీటిని తరలించేందుకు వీలుగా కొండపోచమ్మ సాగర్ వద్ద స్లూయిస్‌ను మాత్రం నీటిపారుదల శాఖ సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా కొండపోచమ్మ సాగర్ నుంచి సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ స్లూయిస్ నిర్మాణం చేసి, అటు నుంచి ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి 50 కిలోమీటర్ల దూరాన ఉండే ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించేలా చూడాలని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే, పైప్‌లైన్ వ్యవస్థను పూర్తిగా జలమండలి నిర్మించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిన ఉస్మాన్‌సాగర్‌కు తరలించే నీళ్లు సర్‌ప్లస్ అయినప్పుడు హిమాయత్‌సాగర్‌కు వెళ్తాయని, దీనిద్వారా రెండు రిజర్వాయర్లు నిత్యం నీటితో కళకళలాడుతాయన్నది ముఖ్యమంత్రి ప్రణాళికగా ఉంది.
మూడ్రోజుల్లో వెట్‌రన్
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి దిగువన ఉన్న ప్యాకేజీ–6 పంప్‌హౌస్‌ల వెట్ రన్‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్లంపల్లిలో సమృద్ధిగా నీరు ఉన్న దృష్ట్యా ప్యాకేజీ–6లో సిద్ధంగా ఉన్న 124 మెగావాట్ల సామర్థ్యం గల 4 మోటార్లకు వెట్‌రన్ చేయాలని సూచించారు. ఈ నీటిని మేడారం రిజర్వాయర్‌కు తరలించాలన్నారు. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో వెట్‌రన్ జరిగే అవకాశాలున్నాయి. ఇక ప్యాకేజీ–7 పరిధిలో 11.24 కిలోమీటర్ల జంట టన్నెళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 3.2 కి.మీ. లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులను రెండు నెలల్లో పూర్తి చేసి జూన్ నాటికి మిడ్‌మానేరుకు కనిష్టంగా 90 నుంచి 100 టీఎంసీల నీటిని తరలించేలా చూడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment