కాళోజీ సేవలు ఎనలేనివి
రాంనగర్ : తెలుగు సాహిత్య రంగంలో కాళోజీ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ టి.చిరంజీవు పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఉత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచనల ద్వారా సమాజానికి మేలు జరగాలని, సాహిత్యం సమాజ గమనాన్ని మార్చి మేలుకొల్పేలా ఉండాలని చాటి చెప్పిన వ్యక్తి కాళోజీ అన్నారు. తెలుగు సాహిత్యానికి కాళోజీ చేసిన సేవకు ప్రశంసగా భారత ప్రభుత్వం పద్మవిభూషన్‌తో సత్కరించడం అభినందనీయమన్నారు. మరణాంతరం తన భౌతికకాయాన్ని కాకతీయ వైద్య కళాశాలకు దానం చేసిన గొప్ప సంకల్పం గల వ్యక్తి అన్నారు. తాను వరంగల్‌లో పనిచేసిన కాలంలో కాళోజీని కలిసిన రోజులను కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. కాళోజీ చూపిన బాటలో సమసమాజ తెలంగాణను నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. ఏజేసీ వెంకట్రావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ శ్రీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.విశ్వనాథరావు మాట్లాడుతూ ‘నా గొడవ’ ద్వారా ప్రభుత్వ ధమన నీతిపై, ప్రతి సంఘటనపై కాళోజీ స్పం దించారని పేర్కొన్నారు. రాజకీయ సామాజిక పరిస్థితులకు కాళోజీ రచనలు అద్దంపట్టాయన్నారు. అంతకు ముందు అధికారులు కాళోజీ చిత్ర పటం ఎదుట నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీ ప్రీతి మీనా, సీపీఓ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.