చెల్లప్ప కమిషన్‌ను రద్దు చేయూలి
ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొమురం నర్సయ్య
ములుగు : 23 ఆదివాసీ గ్రామాలను జలసమాధి చేసే కంతనపల్లి ప్రాజెక్టును కట్టొద్దని ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొమురం నర్సయ్య డిమాండ్ చేశారు. ప్రాజెక్టును కట్టడం ద్వారా ఆదివాసీలకు వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవని... ఈ ప్రాజెక్టుతో వారి జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు మండల కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన ఆదివాసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పీసా చట్టం-2011 ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మించదలుచుకుంటే ప్రభుత్వం ముందుగా ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. అవేమి చేయకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగడం ఆదివాసీ చట్టాలను అవమాన పరచడమేనన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముంపు గ్రామాల ప్రజలతో సత్వరమే చర్చలు జరపాలన్నారు.
బంగారు తెలంగాణ అంటే ఆదివాసీలను జలసమాధి చేయడమేనా అని ప్రశ్నించారు. షెడ్యూల్డ్ ప్రాంతమైన ఏటూరునాగారం ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా సమ్మక్క-సారలమ్మ తల్లుల పేరుమీద అటానమస్ జిల్లా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీ జాబితాలో కైత లంబాడ, వాల్మీకి బోయలను కలపడానికి ప్రభుత్వం నియమించిన చెల్లప్ప కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ సంఘాల నాయకులు పొడెం బాబు, పులిశె బాలక్రిష్ణ, ఆగబోయిన రవి, పడిగ నాగేశ్వర్‌రావు, చంద మహేష్, కొర్నిబెల్లి గణేష్, నల్లెబోయిన లక్ష్మణ్‌రావు, అర్రెం అచ్చుపటేల్, చంద రఘుపతిరావు, కాక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
‘కంతనపల్లి’ని కట్టొద్దు..
Published Sun, Apr 5 2015 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement