kantanapalli project
-
ప్రభుత్వంపైనే మా పోరాటం
- ఆదివాసీలకు వ్యతిరేకం కాదు - ప్రత్యేక ప్యాకేజీతోనైనా కంతనపల్లి నిర్మించాలి - బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి హన్మకొండ: నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అయినా కంతనపల్లి ప్రాజెక్టును నిర్మించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హన్మకొండ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరేళ్లయినా కంతనపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. కంతనపల్లి నిర్మాణం పూర్తయితేనే దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తిగా వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సాయం తీసుకోవాలన్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టు సాగులోకి రావాలంటే ఈ ప్రాజెక్టు పూర్తిచేయడం ఒక్కటే మార్గమని వివరించారు. తమ పోరాటం ప్రభుత్వంపైనేనని, ఆదివాసీలకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. ఆదివాసీలతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వం ఆదివాసీలకు నష్టం జరుగకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 2న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సానీ మురళీధర్ రావు పరకాలతో పాటు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రాంతాల్లో పర్యటించి అమరులకు నివాళులర్పించనున్నారన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్ ప్రాజెక్టులు నిర్మించాలంటూ ఈ నెల 3న రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి జిల్లాలోని కంతనపల్లి నుంచి దేవాదుల వరకు మహాపాదయాత్ర నిర్వహించనున్నార ని తెలిపారు. బీజేపీ వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, శ్రీరాముల మురళీమనోహర్, జన్నె మొగిళి, గాదె రాంబాబు, మల్లాడి తిరుపతిరెడ్డి, కూచన రవళి పాల్గొన్నారు. -
‘కంతనపల్లి’ని కట్టొద్దు..
చెల్లప్ప కమిషన్‌ను రద్దు చేయూలి ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొమురం నర్సయ్య ములుగు : 23 ఆదివాసీ గ్రామాలను జలసమాధి చేసే కంతనపల్లి ప్రాజెక్టును కట్టొద్దని ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ కొమురం నర్సయ్య డిమాండ్ చేశారు. ప్రాజెక్టును కట్టడం ద్వారా ఆదివాసీలకు వచ్చే ప్రయోజనాలు ఏమీ లేవని... ఈ ప్రాజెక్టుతో వారి జీవితాలు అగాధంలోకి నెట్టివేయబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు మండల కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన ఆదివాసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పీసా చట్టం-2011 ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మించదలుచుకుంటే ప్రభుత్వం ముందుగా ఆదివాసీ సంఘాలతో చర్చలు జరపాలన్నారు. అవేమి చేయకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగడం ఆదివాసీ చట్టాలను అవమాన పరచడమేనన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముంపు గ్రామాల ప్రజలతో సత్వరమే చర్చలు జరపాలన్నారు. బంగారు తెలంగాణ అంటే ఆదివాసీలను జలసమాధి చేయడమేనా అని ప్రశ్నించారు. షెడ్యూల్డ్ ప్రాంతమైన ఏటూరునాగారం ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటే ముందుగా సమ్మక్క-సారలమ్మ తల్లుల పేరుమీద అటానమస్ జిల్లా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్టీ జాబితాలో కైత లంబాడ, వాల్మీకి బోయలను కలపడానికి ప్రభుత్వం నియమించిన చెల్లప్ప కమిషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ సంఘాల నాయకులు పొడెం బాబు, పులిశె బాలక్రిష్ణ, ఆగబోయిన రవి, పడిగ నాగేశ్వర్రావు, చంద మహేష్, కొర్నిబెల్లి గణేష్, నల్లెబోయిన లక్ష్మణ్‌రావు, అర్రెం అచ్చుపటేల్, చంద రఘుపతిరావు, కాక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం ఇచ్చాకే పనులు
► కంతనపల్లి ప్రాజెక్టు పనులపై నిర్వాసితులకు సీఎం కేసీఆర్ హామీ ► నష్ట నివారణకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తాం ► ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు 5 రెట్లు పరిహారం ► ఏప్రిల్ 15లోగా నిర్వాసితులను గుర్తించాలని అధికారులకు ఆదేశం ►గోదావరిపై వరుసగా బ్యారేజీల నిర్మాణానికి నిర్ణయం.. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులపై ► కేసీఆర్ ఏరియల్ సర్వే.. అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష.. ఆదివాసీ నాయకులతో భేటీ సాక్షి, హన్మకొండ: కంతనపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్ట పరిహారం అందజేశాకే.. ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఐదు రెట్లు ఎక్కువగా నష్టపరిహారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కంతనపల్లితో పాటు దేవాదుల ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా కాళేశ్వరం, ఇచ్ఛంపల్లి, దేవాదుల ప్రాంతాల్లో గోదావరి నదిపై పలు చోట్ల వరుసగా బ్యారేజీలను నిర్మించనున్నామని తెలిపారు. ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే మగ్గుతున్న దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు సీఎం ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఏరియల్ సర్వే ద్వారా ఈ రెండు ప్రాజెక్టులను పరిశీలించి అనంతరం దేవాదుల ప్రాజెక్టు అతిథి గృహంలో అధికారులతో సమావేశమయ్యారు. తర్వాత అక్కడి ఆదివాసీ సంఘాలతో భేటీ అయ్యారు. గోదావరిపై వరుసగా బ్యారేజీలు.. గోదావరిపై బ్యారేజీలు నిర్మించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, ఇచ్చంపల్లి, వరంగల్ జిల్లా దేవాదుల ఇన్‌టేక్ వెల్ సమీపంలో కొత్తగా బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు. వీటన్నింటినీ ఒకటిన్నర మీటర్ల ఎత్తుతో నిర్మిస్తామని, దీనివల్ల ముంపు సమస్య ఉండదని అధికారులకు సీఎం వివరించారు. ఈ పనులకు సంబంధించి సర్వేలను వెంటనే చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు భూసేకరణలో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు ఐదురెట్లు.. కంతనపల్లి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ఆదివాసీ సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ అరగంట పాటు చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏజెన్సీ ప్రజలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. నిర్వాసితుల లెక్క తేల్చి, ప్రతి ఒక్కరికి పరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల జాబితాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఐదురెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఆదివాసీ సంఘాల నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ వచ్చే నెల 15వ తేదీలోగా కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టుల నిర్వాసితుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ నిర్వాసితుల జాబితాను రూపొందించిన తర్వాత హైదరాబాద్‌లో జిల్లా అధికారులు, ఆదివాసీ సంఘాలతో మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా కేతి లంబాడీ, వాల్మీకీ, బోయ కులాలను ఎస్టీల జాబితాలో చేర్చవద్దంటూ ఆదివాసీ సంఘాల నాయకులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్... జనాభా ఆధారంగా ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించామని, కొత్తగా కొన్ని కులాలను ఎస్టీల్లో చేర్చడం వల్ల అప్పటికే ఉన్న కులాలపై ఎటువంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. పీసా చట్టం కింద గిరిజనులకు కేటాయించిన ఇసుక క్వారీల్లో క్యూబిక్ మీటర్‌కు రూ. 150ను మాత్రమే చెల్లిస్తున్నారని.. ఈ మొత్తాన్ని రూ. 350కు పెంచాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరగా... వచ్చేనెల హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఆరు గంటలపాటు.. శనివారం సాయంత్రమే వరంగల్‌కు చేరుకున్న సీఎం .. రాత్రి మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బసచేశారు. ఆదివారం ఉదయం అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏటూరు నాగారం ఏజెన్సీకి బయల్దేరి వెళ్లారు. దాదాపు 10.45 సమయంలో కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని, ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఆ ప్రాంతంలోనే కిందకు దిగి.. కంతనపల్లి ప్రాజెక్టు స్వరూపం, పూర్తి వివరాలతో కూడిన మ్యాపులను, నీటి లభ్యత వివరాలను పరిశీలించారు. తర్వాత ఏటూరు గ్రామ ప్రజల ఇసుక క్వారీ లేబర్ సహకార సంఘానికి రూ 1.05 కోట్ల చెక్కును అందించారు. అనంతరం కంతనపల్లి నుంచి హెలికాప్టర్లో బయల్దేరి.. ఉదయం 11:55 సమయంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్దకు సీఎం చేరుకున్నారు. అక్కడ పంప్‌హౌస్ వద్దకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు. తర్వాత దేవాదుల అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆదివాసీ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాలు ముగిసేసరికి సాయంత్రం 4:30 గంటలు అయింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కంతనపల్లి, దేవాదులతోపాటు కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద కూడా కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టాల్సి ఉంది. కానీ దేవాదుల వద్ద సమీక్ష, చర్చల కారణంగా సమయం మించిపోవడంతో.. సీఎం కాళేశ్వరం ఏరియల్ సర్వేను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. పర్యటనలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావుతో పాటు అధికారులు పాల్గొన్నారు. హెలికాప్టర్లో ఇంధనం ఖాళీ.. సీఎం కేసీఆర్ పర్యటనకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్లో ఇంధనం తగ్గిపోయింది. దీంతో హెలికాప్టర్‌కు వాడే ఇంధనాన్ని రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ జిల్లా మహదేవపూర్ వరకు తీసుకువచ్చారు. హెలికాప్టర్ దేవాదుల నుంచి మహదేవపూర్‌కు వె ళ్లి ఇంధనం నింపుకొని వచ్చింది. -
పరిహారం ఇప్పిస్తేనే పనులు సాగనిస్తాం
తేల్చిచెప్పిన కంతనపల్లి బ్యారేజీ ముంపు బాధితులు నిర్వాసితులతో సమావేశమైన భూసేకరణ కలెక్టర్ సుందర్‌అబ్నార్ ఏటూరునాగారం : కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ పనుల్లో కోల్పోతున్న భూములు, ఇళ్లకు ముందుగా నష్టపరి హారం ఇప్పిస్తేనే పనులు సాగనిస్తామని నిర్వాసితులు తేల్చిచెప్పారు. గురువారం మండలంలోని కంతనపల్లి గ్రామాన్ని భూసేకరణ కలెక్టర్ సుందర్‌అబ్నార్ సందర్శించారు. అనంతరం గ్రామస్తులు, రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పనుల కోసం యంత్రాలను ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం 50 ఎకరాల భూమిని నిర్మాణ సంస్థకు అప్పగించాలని, కావలసిన నష్టపరిహారం ఇప్పిస్తామని పనులను అడ్డుకోవద్దని కోరారు. దీనికి స్పందించిన గ్రామస్తులు ‘పనులు మొదలైన తర్వాత అధికారులు వస్తూ పోతూంటారు.. మా బాధలు ఎవరూ పట్టించుకోరు.. పనులు ప్రారంభించకముందే పరిహారం చెల్లిం చాలని’ స్పష్టం చేశారు. పెట్టుబడులకు అప్పులు తెచ్చి పంటలు వేశామని, వాటిలో యంత్రాలు ఏర్పాటు చేస్తే పూర్తిగా నష్టపోతామని చెప్పారు. 2014 జనవరి 01న భూసేకరణపై నూతన చట్టం వెలువడిందని, నియమ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలులోకి రాకపోవడం వల్ల నష్టపరిహారం విషయం తేల్చలేకపోతున్నామని అబ్నార్ పేర్కొన్నారు. రెండు మూడు నెలల్లో చట్టం రూపాంతరం జరిగిన తర్వాత పరిహారం చెల్లిస్తామని చెప్పారు. కొంత మంది నిర్వాసితులు దళారులను, అడ్వకేట్లను ఆశ్రయిస్తున్నారని, అలా చేయడం వల్ల నష్టపోయే ప్రమాదముందని తెలిపారు. ప్రభుత్వం నుంచి పరహారం వచ్చిన తర్వాత మీకు సమ్మతి కాకుంటే అడ్వకేట్లను ఆశ్రయించవచ్చని సూచిం చారు. ప్రాజెక్టు పనులు అడ్డుకోవడం వల్ల అభివృద్ధిలో తెలంగాణ వెనుకబడుతుందని, అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ముప్పనపల్లి, బుట్టాయిగూడెం, తూపాకులగూడెం, లక్ష్మీపురం, రాజన్నపేట గ్రామాలకు చెందిన ప్రజలు మాట్లాడుతూ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కోసం తమ భూముల్లో సర్వే చేసి హద్దురాళ్లు పాతారని, వాటి సంగతేమిటని ప్రశ్నించారు. మూడేళ్ల వరకు వ్యవసాయం చేసుకోవచ్చని, భూములకు ఎలాంటి నష్టం ఉండదని అబ్నార్ పేర్కొన్నారు. కేవలం మొదటి దశ కింద సర్వే చేసి హద్దురాళ్లు పాతారని, ప్రాజెక్టుకు అవసరమైనప్పుడు ముందస్తుగానే పరిహారం, సమాచారం ఇచ్చి భూములను స్వాధీనం చేసుకుంటామని వివరించారు. మరమ్మతులు చేపట్టకుండా నిలిపివేసిన పెద్ద చెరువు కింద ఉన్న 480 ఎకరాల ఆయకట్టు ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు చెరువుకు మరమ్మతులు చేపట్టి సాగునీరందించాలని రైతులు కోరారు. ఈ విషయంపై స్పందించిన అబ్నార్ చెరువుకు మరమ్మతులు చేపట్టి సాగునీరు అందేలా చూడాలని ఇరిగేషన్ ఈఈ గంగాధర్‌ను ఆదేశించారు. ఆయన వెంట డిప్యూటీ కలెక్టర్ డేవిడ్, సర్పంచ్ దబ్బకట్ల శ్రీనివాస్, గ్రామస్తులు పాపారావు, శ్రీనివాస్, కావిరి చిన్నకృష్ణ, మహిళలు ఉన్నారు. -
తొలి అడుగు
మొదలైన కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ పనులు ముందుగా గోదావరి నీటి మళ్లింపునకు మట్టి, ఇసుక కట్టల ఏర్పాటు ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణ పనులు మొదలయ్యూయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కంతనపల్లి ప్రాజెక్టు పనులకు తొలి అడుగు పడింది. బ్యారేజీ నిర్మాణం మొదటి దశలో రూ.1800 కోట్లతో టెండర్ దక్కించుకున్న ఎస్ఈడబ్ల్యూ, రిత్విక్ కంపెనీలు సంయుక్తంగా పనులు ప్రారంభించాయి. గోదావరి నదిపై 172 గేట్లతో 3.5 కిలో మీటర్ల పొడువుతో బ్యారేజీని నిర్మించనున్నారు. బ్యారేజీ నిర్మాణం ప్రదేశంలో నీటిని మూడు పాయలుగా విభజించేందుకు రెండు రోజులుగా మట్టికట్టలు, ఇసుక కట్టలను నిర్మిస్తున్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడం వల్ల పనులు చేసుకునే వీలు కలుగుతుంది. నీటిని మళ్లించిన తర్వాత బ్యారే జీ నిర్మాణ ప్రదేశంలో ఉన్న బండరాళ్లను తొలగించనున్నారు. వర్షాకాలం రానుండడంతో ముందస్తుగా కావాల్సిన ఇసుకను తరలిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణ పనులకు ఉపయోగించే యంత్రాలను అవతలి ఒడ్డుకు తరలించేందుకు కూడా మట్టితో రోడ్డు పనులు చేపట్టారు. అంతేకాకుండా యంత్రాలు, నిర్మాణ పనులు చేసే సిబ్బంది కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. పనులను సైట్ ఇన్చార్జ్ జయప్రకాశ్ పర్యవేక్షిస్తున్నారు.