ఆదివారం వరంగల్ జిల్లా కంతనపల్లిలో ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్.
► కంతనపల్లి ప్రాజెక్టు పనులపై నిర్వాసితులకు సీఎం కేసీఆర్ హామీ
► నష్ట నివారణకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తాం
► ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు 5 రెట్లు పరిహారం
► ఏప్రిల్ 15లోగా నిర్వాసితులను గుర్తించాలని అధికారులకు ఆదేశం
►గోదావరిపై వరుసగా బ్యారేజీల నిర్మాణానికి నిర్ణయం.. దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టులపై
► కేసీఆర్ ఏరియల్ సర్వే.. అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష.. ఆదివాసీ నాయకులతో భేటీ
సాక్షి, హన్మకొండ: కంతనపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్ట పరిహారం అందజేశాకే.. ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఐదు రెట్లు ఎక్కువగా నష్టపరిహారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కంతనపల్లితో పాటు దేవాదుల ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతేగాకుండా కాళేశ్వరం, ఇచ్ఛంపల్లి, దేవాదుల ప్రాంతాల్లో గోదావరి నదిపై పలు చోట్ల వరుసగా బ్యారేజీలను నిర్మించనున్నామని తెలిపారు. ఏళ్ల తరబడి నిర్మాణ దశలోనే మగ్గుతున్న దేవాదుల, కంతనపల్లి ప్రాజెక్టుల వాస్తవ స్థితిగతులను తెలుసుకునేందుకు సీఎం ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఏరియల్ సర్వే ద్వారా ఈ రెండు ప్రాజెక్టులను పరిశీలించి అనంతరం దేవాదుల ప్రాజెక్టు అతిథి గృహంలో అధికారులతో సమావేశమయ్యారు. తర్వాత అక్కడి ఆదివాసీ సంఘాలతో భేటీ అయ్యారు.
గోదావరిపై వరుసగా బ్యారేజీలు..
గోదావరిపై బ్యారేజీలు నిర్మించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం, ఇచ్చంపల్లి, వరంగల్ జిల్లా దేవాదుల ఇన్‌టేక్ వెల్ సమీపంలో కొత్తగా బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయించినట్లు కేసీఆర్ చెప్పారు. వీటన్నింటినీ ఒకటిన్నర మీటర్ల ఎత్తుతో నిర్మిస్తామని, దీనివల్ల ముంపు సమస్య ఉండదని అధికారులకు సీఎం వివరించారు. ఈ పనులకు సంబంధించి సర్వేలను వెంటనే చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు భూసేకరణలో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు ఐదురెట్లు..
కంతనపల్లి ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న ఆదివాసీ సంఘాల నాయకులతో సీఎం కేసీఆర్ అరగంట పాటు చర్చించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏజెన్సీ ప్రజలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. నిర్వాసితుల లెక్క తేల్చి, ప్రతి ఒక్కరికి పరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. నిర్వాసితుల జాబితాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఐదురెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఆదివాసీ సంఘాల నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ వచ్చే నెల 15వ తేదీలోగా కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టుల నిర్వాసితుల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ నిర్వాసితుల జాబితాను రూపొందించిన తర్వాత హైదరాబాద్‌లో జిల్లా అధికారులు, ఆదివాసీ సంఘాలతో మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా కేతి లంబాడీ, వాల్మీకీ, బోయ కులాలను ఎస్టీల జాబితాలో చేర్చవద్దంటూ ఆదివాసీ సంఘాల నాయకులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కేసీఆర్... జనాభా ఆధారంగా ఎస్టీల రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించామని, కొత్తగా కొన్ని కులాలను ఎస్టీల్లో చేర్చడం వల్ల అప్పటికే ఉన్న కులాలపై ఎటువంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. పీసా చట్టం కింద గిరిజనులకు కేటాయించిన ఇసుక క్వారీల్లో క్యూబిక్ మీటర్‌కు రూ. 150ను మాత్రమే చెల్లిస్తున్నారని.. ఈ మొత్తాన్ని రూ. 350కు పెంచాలని ఆదివాసీ సంఘాల నాయకులు కోరగా... వచ్చేనెల హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయిస్తామన్నారు.
ఆరు గంటలపాటు..
శనివారం సాయంత్రమే వరంగల్‌కు చేరుకున్న సీఎం .. రాత్రి మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బసచేశారు. ఆదివారం ఉదయం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఏటూరు నాగారం ఏజెన్సీకి బయల్దేరి వెళ్లారు. దాదాపు 10.45 సమయంలో కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకుని, ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఆ ప్రాంతంలోనే కిందకు దిగి.. కంతనపల్లి ప్రాజెక్టు స్వరూపం, పూర్తి వివరాలతో కూడిన మ్యాపులను, నీటి లభ్యత వివరాలను పరిశీలించారు. తర్వాత ఏటూరు గ్రామ ప్రజల ఇసుక క్వారీ లేబర్ సహకార సంఘానికి రూ 1.05 కోట్ల చెక్కును అందించారు. అనంతరం కంతనపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి.. ఉదయం 11:55 సమయంలో దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు వద్దకు సీఎం చేరుకున్నారు. అక్కడ పంప్‌హౌస్ వద్దకు చేరుకుని ప్రాజెక్టును పరిశీలించారు. తర్వాత దేవాదుల అతిథి గృహంలో నీటిపారుదల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆదివాసీ సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాలు ముగిసేసరికి సాయంత్రం 4:30 గంటలు అయింది. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కంతనపల్లి, దేవాదులతోపాటు కరీంనగర్ జిల్లా కాళేశ్వరం వద్ద కూడా కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టాల్సి ఉంది. కానీ దేవాదుల వద్ద సమీక్ష, చర్చల కారణంగా సమయం మించిపోవడంతో.. సీఎం కాళేశ్వరం ఏరియల్ సర్వేను రద్దు చేసుకుని హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. పర్యటనలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, హరీశ్‌రావుతో పాటు అధికారులు పాల్గొన్నారు.
హెలికాప్టర్‌లో ఇంధనం ఖాళీ..
సీఎం కేసీఆర్ పర్యటనకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌లో ఇంధనం తగ్గిపోయింది. దీంతో హెలికాప్టర్‌కు వాడే ఇంధనాన్ని రోడ్డు మార్గం ద్వారా కరీంనగర్ జిల్లా మహదేవపూర్ వరకు తీసుకువచ్చారు. హెలికాప్టర్ దేవాదుల నుంచి మహదేవపూర్‌కు వె ళ్లి ఇంధనం నింపుకొని వచ్చింది.