తొలి అడుగు
- మొదలైన కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ పనులు
- ముందుగా గోదావరి నీటి మళ్లింపునకు మట్టి, ఇసుక కట్టల ఏర్పాటు
ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణ పనులు మొదలయ్యూయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కంతనపల్లి ప్రాజెక్టు పనులకు తొలి అడుగు పడింది. బ్యారేజీ నిర్మాణం మొదటి దశలో రూ.1800 కోట్లతో టెండర్ దక్కించుకున్న ఎస్‌ఈడబ్ల్యూ, రిత్విక్ కంపెనీలు సంయుక్తంగా పనులు ప్రారంభించాయి. గోదావరి నదిపై 172 గేట్లతో 3.5 కిలో మీటర్ల పొడువుతో బ్యారేజీని నిర్మించనున్నారు.
బ్యారేజీ నిర్మాణం ప్రదేశంలో నీటిని మూడు పాయలుగా విభజించేందుకు రెండు రోజులుగా మట్టికట్టలు, ఇసుక కట్టలను నిర్మిస్తున్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడం వల్ల పనులు చేసుకునే వీలు కలుగుతుంది. నీటిని మళ్లించిన తర్వాత బ్యారే జీ నిర్మాణ ప్రదేశంలో ఉన్న బండరాళ్లను తొలగించనున్నారు. వర్షాకాలం రానుండడంతో ముందస్తుగా కావాల్సిన ఇసుకను తరలిస్తున్నారు.
బ్యారేజీ నిర్మాణ పనులకు ఉపయోగించే యంత్రాలను అవతలి ఒడ్డుకు తరలించేందుకు కూడా మట్టితో రోడ్డు పనులు చేపట్టారు. అంతేకాకుండా యంత్రాలు, నిర్మాణ పనులు చేసే సిబ్బంది కోసం తాత్కాలిక షెడ్‌లు ఏర్పాటు చేశారు. పనులను సైట్ ఇన్‌చార్జ్ జయప్రకాశ్ పర్యవేక్షిస్తున్నారు.