ప్రభుత్వంపైనే మా పోరాటం
- ఆదివాసీలకు వ్యతిరేకం కాదు
- ప్రత్యేక ప్యాకేజీతోనైనా కంతనపల్లి నిర్మించాలి
- బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి
హన్మకొండ: నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అయినా కంతనపల్లి ప్రాజెక్టును నిర్మించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హన్మకొండ లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరేళ్లయినా కంతనపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. కంతనపల్లి నిర్మాణం పూర్తయితేనే దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తిగా వినియోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సాయం తీసుకోవాలన్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టు సాగులోకి రావాలంటే ఈ ప్రాజెక్టు పూర్తిచేయడం ఒక్కటే మార్గమని వివరించారు.
తమ పోరాటం ప్రభుత్వంపైనేనని, ఆదివాసీలకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. ఆదివాసీలతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రభుత్వం ఆదివాసీలకు నష్టం జరుగకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 2న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సానీ మురళీధర్ రావు పరకాలతో పాటు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రాంతాల్లో పర్యటించి అమరులకు నివాళులర్పించనున్నారన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్ ప్రాజెక్టులు నిర్మించాలంటూ ఈ నెల 3న రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి జిల్లాలోని కంతనపల్లి నుంచి దేవాదుల వరకు మహాపాదయాత్ర నిర్వహించనున్నార ని తెలిపారు. బీజేపీ వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు చింతాకుల సునీల్, రాష్ట్ర కార్యదర్శి రావు పద్మ, శ్రీరాముల మురళీమనోహర్, జన్నె మొగిళి, గాదె రాంబాబు, మల్లాడి తిరుపతిరెడ్డి, కూచన రవళి పాల్గొన్నారు.