విద్యుత్ ప్రాజెక్టులో ఉద్యోగాల పేరిట టోకరా
⇒ దళారుల చేతుల్లో మోసపోతున్న యువకులు
⇒ రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు
⇒ కరీంనగర్ జిల్లా యువకుడి ఆత్మహత్య
⇒ సూసైడ్ నోట్
జైపూర్ : మండల కేంద్ర సమీపంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టులో దళారుల దందా జోరుగా కొనసాగుతోంది. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరిట దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నెల 20న దళారుల చేతిలో మోసపోయిన కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన గడ్డం అనిల్ ఆత్మహత్య చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. అనిల్ ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన సూసైడ్ నోటే ఇందుకు సాక్ష్యం.
సింగిరేణి సంస్థ జైపూర్ పరిధిలో 1200 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీని నిర్మాణ పనులను బీహెచ్‌ఈఎల్ కంపెనీకి అప్పగించింది. బీహెచ్‌ఈఎల్ సబ్ కాంట్రాక్టర్లుగా పవర్ మేక్, ప్రసాద్, సునిల్ హైటెక్, ఇండివెల్లి, మెక్‌నల్లి భారత్‌తోపాటు వివిధ ప్రైవేటు కంపెనీలు ఉన్నాయి. అయితే.. నిర్మాణ పనుల్లో ప్రధానంగా వాచ్‌మన్, సెక్యూరిటీ గా ర్డు, సూపర్‌వైజర్, ఎలక్ట్రీషియన్ హెల్పర్, ఫిట్లర్‌లాంటి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంత మంది దళారులు రంగంలోకి దిగుతున్నారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రూ.లక్షలు సొమ్ముచేసుకుంటున్నారు. ప్రధానంగా సింగరేణి సంస్థ ఈ విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తుండడంతో తదుపరి సింగరేణిలో ఉద్యోగం సాధించవచ్చనే ఆలోచనతో నిరుద్యోగులు వారిని నమ్మి మోసపోతున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇచ్చి దగాపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాతోపాటే కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని నిరుద్యోగులు వారికి డబ్బులు ముట్టజెప్పుతున్నారు.
సింగరేణి అధికారుల నిర్లక్ష్యం..
విద్యుత్ ప్రాజెక్టును ఆసరాగా చేసుకుని దళారులు జోరుగా దందా కొనసాగిస్తున్నా సింగరేణి అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. ఆదిలోనే వారిపై చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదని.. సింగరేణి అధికారులు ప్రోత్సాహంతోనే కొంత మంది దళారులు తమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సింగరేణి అధికారులు భూ నిర్వాసిత గ్రామాలైన జైపూర్, పెగడపల్లి, గంగిపల్లి, ఎల్కంటి, టేకుమట్లతోపాటు తదితర గ్రామాల నిరుద్యోగులకు కాకుండా తమ బంధువులైన ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అవకాశాలు కల్పిస్తుండడంతో దళారీ దందా తెరపైకి వచ్చింది. ఈ విషయమై విద్యుత్ ప్రాజెక్టు జీఎం సుధాకర్‌రెడ్డి వివరణ ఇస్తూ.. దళారులను నమ్మి మోసపోవద్దని, ఇందులో శాశ్వత పనులు ఏమీ లేవని పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వొద్దు.. ఎలాంటి ఉద్యోగాలు లేవు.. ప్రాజెక్టు పూర్తయ్యాక నోటీసు ద్వారా ఉద్యోగాల కోసం ప్రకటన ఇస్తామని స్పష్టం చేశారు.
దళారీ దందా..
Published Tue, Dec 2 2014 2:06 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement