* కోల్‌బెల్ట్‌లో ప్రతీ కార్యకర్తతో సత్సంబంధాలు
* గని కార్మికులకు పెన్షన్ ఇప్పించిన మహానేత
* 17 వేల మందికి ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణలో కీలక భూమిక
* 1950 నుంచే రామగుండంతో సంబంధాలు..
హైదరాబాద్‌కు చెందిన గడ్డం నర్సింహస్వామి, గడ్డం వెంకటస్వామి, గడ్డం నారాయణస్వామి అన్నదమ్ములు. 1950లో నర్సింహాస్వామి రామగుండంలో నెలకొల్పిన 62.5 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లో సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. ఇదే సమయంలో వెంకటస్వామి, అంజయ్య, ఎంఎం.ఆసీమ్, సంజీవరెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని నారాయణగూడ తాజ్‌మహల్ కేంద్రం అడ్డాగా కార్మిక రాజకీయాలు నడిపేవారు. హైదరాబాద్‌లోని కార్వాన్, బీహెచ్‌ఇఎల్, రిపబ్లికన్ పోర్ట్, శ్రీశైలం డ్యామ్ తదితర సంస్థల్లో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి వారిహక్కుల కోసం పోరాడారు.
ఈ నేపథ్యంలో సోదరుడు నర్సింహాస్వామి రామగుండంలో కాంట్రాక్టు పనులు నిర్వహించడంతో వెంకటస్వామి తరుచూ హైదరాబాద్‌లో ‘జనతా రైలు’ ఎక్కి రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్‌కు వచ్చి వెళ్లేవారు. 1953లో రామగుండం బి-పవర్‌హౌస్ వద్ద మూడు రంగుల జెండాను వెంకటస్వామి ఎగురవేశారు. తర్వాత సింగరేణి కాలరీస్, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కూడా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి పనిచేశారు. 1957లో జరిగిన ద్విశాసనసభ ఎన్నికల సమయంలో చెన్నూర్, సిర్పూర్ నుంచి వెంకటస్వామి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత 1962లో మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ స్వతంత్ర అభ్యర్థి జి.సైదయ్య చేతిలో ఓడిపోయారు.
అనంతరం 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 1971లో తెలంగాణ ప్రజాసమితి, 1977లో కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు మెదక్ జిల్లా సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గం(ఎస్సీ రిజర్వు) నుంచి ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1978లో రాష్ట్ర రాజకీయాలకు ఆకర్షితులై ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి ప్రభుత్వంలో కార్మిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన హైదరాబాద్‌లో చాలా మంది పేదలకు గుడిసెలు వేసుకునే అవకాశం కల్పించి ‘గుడిసెల వెంకటస్వామి’గా పేరు తెచ్చుకున్నారు.
1989 నుంచి పెద్దపల్లి లోక్‌సభపై దృష్టి..
1989, 1991, 1996లో తిరిగి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్సీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఎంపీగా ఎన్నికై రెండవసారి హ్యాట్రిక్ సాధించారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చెలిమెల సుగుణకుమారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఆమెపైనే ఘన విజయం సాధించారు. 1979లో ఇందిరాగాంధీ కేంద్ర క్యాబినెట్‌లో డెప్యూటీ లేబర్ మినిస్టర్‌గా, 1996లో పీవీ న ర్సింహారావు కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి, కార్మిక, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. 1985 నుంచి 1988 వరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, తర్వాత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, లోక్‌సభ డెప్యూటీ లీడర్‌గా వ్యవహరించారు. కాకా తన కుమారులు జి.వినో ద్, జి. వివేక్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.
గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం...
సింగరేణి సంస్థలో 1996 కన్నా ముందు గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు. ఆ సమయంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన కాకా కేంద్రంతో మాట్లాడి గని కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో కీలక భూమిక పోషించారు. 1998లో జరిగిన వేతన ఒప్పందం సమయంలో సింగరేణి వద్ద డబ్బులు లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి రూ.400 కోట్లు తీసుకుని కార్మికులకు వేతన చెల్లించేలా చూశారు.
కాజిపేట నుంచి సిర్పూర్‌కాగజ్‌నగర్ వరకు రామగిరి ప్యాసింజర్ రైలును వేయించారు. గోదావరిఖనిలో సింగరేణి స్థలాల్లో ప్రజలు ఇళ్లు నిర్మించుకోగా... ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సుమారు 17 వేల మందికి స్థలాల క్రమబద్ధీకరించి పట్టాలు ఇప్పించారు. గనులపైకి వచ్చినప్పుడు కార్మికులు ఆయనకు తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. సింగరేణిలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ యూనియన్ బలోపేతం కోసం కూడా చిరకాలం పనిచేశారు. కాకా కృషితో పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని మేడారం, పెద్దపల్లి నియోజకవర్గాలకు రాష్ట్రస్థాయిలో అధిక ప్రాధాన్యత లభించేది. తన తర్వాత తరమైన దళిత నేతలు గుమ్మడి నర్సయ్య, బడికెల రాజలింగం, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులకు అవకాశం కల్పించి రాజకీయంగా ఎదిగేలా చూశారు.
కార్మిక పక్షపాతి ‘కాకా’
Published Tue, Dec 23 2014 3:06 AM | Last Updated on Tue, Sep 18 2018 8:37 PM
Advertisement
Advertisement