kolbelt
-
గోదారి ఎడారి
► కోల్‌బెల్ట్‌లో ఇక నీటి కటకటే ► గోదావరి నదిలో నిలిచిన ప్రవాహం ► ఎల్లంపల్లి నుంచి దిగువకు నీరు బంద్ ► విద్యుత్ కేంద్రాలకూ తప్పని తిప్పలు గోదావరిఖని : గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఎండలు పూర్తిగా ముదరకముందే నదిలో నీటిఛాయలు కనిపించకుండా పోతున్నాయి. హైదరాబాద్‌కు నీటిని తరలించే ఉద్దేశంతో ఎల్లంపల్లి నుంచి దిగువకు నీటి విడుదల నిలిపివేయగా, ఇప్పుడు పాయ కూడా పారడం లేదు. గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీల ప్రజలకు, సింగరేణి, తెలంగాణ జెన్కో విద్యుత్ కర్మాగారాలకు నీటి తిప్పలు ఏర్పడనున్నాయి. సాధారణంగా గోదావరి నదిలో నీటి ప్రవాహంతో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన 26 ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా గోదావరిఖనిలోని 7,300 క్వార్టర్లు, యైటింక్లయిన్‌కాలనీలోని 4,500 క్వార్టర్లు, సెంటినరీకాలనీలోని 2,500 క్వార్టర్లకు నీటి సరఫరా జరుగుతుంది. పట్టణంలోని దాదాపు 25 వేల పైచిలుకు ప్రైవేటు గృహాలకు కూడా సింగరేణి నీరే అందుతుంది. ఈ మూడు ప్రాంతాల్లో తాగునీటికోసం నిత్యం 70 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. తాజాగా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మునిగిపోయింది. గతంలో 2010 నుంచి 2013 వరకు నదిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గి నది ఎడారిని తలపించింది. దీంతో యాజమాన్యం రోజు విడిచి రోజు నీరు అందించేందుకు నదిలో 40 బోర్లు వేసి ప్రతీ బోరు ద్వారా రోజుకు వచ్చిన లక్ష గ్యాలన్ల నీటిని మూడు ప్రాంతాలకు అందించారు. దీనికితోడు సింగరేణి భూగర్భగనుల్లో ఊటగా వచ్చిన నీటిని కూడా ఉపరితలానికి తరలించి ఫైవింక్లయిన్ వద్ద గల ఫిల్టర్‌బెడ్‌లో శుద్ధి చేసి కాలనీలకు సరఫరా చేశారు. ఈ ఏడాది కూడా నీటికి ఇబ్బంది ఏర్పడనుండడంతో ఇప్పటికే బోర్లను గోదావరి నది ఒడ్డున గల ఇంటెక్వెల్ వద్దకు అధికారులు చేర్చారు. రామగుండం కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లకు గాను 16 వేల నల్లా కనెక్షన్లుండగా రోజు విడిచి రోజు 10 మిలియన్ గ్యాలన్ల నీటిని అందిస్తున్నారు. నది ఒడ్డున గల కార్పొరేషన్ ఇంటెక్వెల్ వద్ద ఇప్పటికే నీటి కోసం కాలువ తీయగా... రాబోయే రోజుల్లో అవసరమైన చర్యలకోసం నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. హైదరాబాద్‌కు నీటిని తరలించాకే... ఎల్లంపల్లి బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 836.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ 835 మీటర్ల దిగువకు పడిపోతే హైదరాబాద్‌కు నీటిని తరలించే అవకాశం ఉండదు. అందువల్ల నీటి పారుదలశాఖ అధికారుల ఆదేశం మేరకు ఎల్లంపల్లి నుంచి దిగువకు నీటిని వదలకుండా బంద్ చేసి ప్రస్తుతం హైదరాబాద్‌కే తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో దిగువన నీటి ప్రవాహం లేకుండా పోయింది. విద్యుత్ పరిశ్రమలకు ఇబ్బందే తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో రామగుండం వద్ద 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నడుస్తుండగా ఇందుకు అవసరమైన నీటిని గోదావరి నది నుంచి తీసుకుంటున్నారు. ప్రస్తుతం నదిలో నీటిలభ్యత లేకపోవడంతో ప్లాంట్ నిర్వహణ కష్టసాధ్యమయ్యేలా ఉంది. సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నడుస్తున్న పవర్‌హౌస్‌కు నది నుంచి ‘రా వాటర్’ సరఫరా చేస్తారు. నదిలో నీరు లేకపోవడంతో ఇంటెక్వెల్ వద్ద 22 మీటర్ల లోతులో ఉన్న పంప్‌లకు కూడా నీరు అందక ఈ నెల 3 నుంచి పవర్‌హౌస్‌కు నీటి సరఫరా కావడం లేదు. దీంతో కాలనీల ప్రజలకు తాగునీటి కోసం సరఫరా చేసే నీటిలో నుంచి 3 లక్షల గ్యాలన్ల నీరు, జీడీకే 1వ గనిలో ఊటగా వచ్చిన మరో లక్ష గ్యాలన్ల నీటిని అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద ఇటీవల 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు సింక్రనైజేషన్ చేయగా... మరో మూడు నెలల వరకు ఇక్కడ మెయింటనెన్స్ పనులు చేస్తారు. ప్రాణహిత నుంచి ఇంకా లైన్ వేయకపోవడంతో ప్రస్తుతం సమీపంలో ఉన్న చెట్పల్లి-సుందిళ్ల సరిహద్దులోని గోదావరి నది నుంచి నీటిని వినియోగిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం లేని కారణంగా ఈ విద్యుత్ కేంద్రానికి కూడా ఇబ్బందులు త ప్పేలా లేవు. -
కార్మిక పక్షపాతి ‘కాకా’
* కోల్‌బెల్ట్‌లో ప్రతీ కార్యకర్తతో సత్సంబంధాలు * గని కార్మికులకు పెన్షన్ ఇప్పించిన మహానేత * 17 వేల మందికి ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణలో కీలక భూమిక * 1950 నుంచే రామగుండంతో సంబంధాలు.. హైదరాబాద్‌కు చెందిన గడ్డం నర్సింహస్వామి, గడ్డం వెంకటస్వామి, గడ్డం నారాయణస్వామి అన్నదమ్ములు. 1950లో నర్సింహాస్వామి రామగుండంలో నెలకొల్పిన 62.5 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌లో సబ్ కాంట్రాక్టర్‌గా పనిచేసేవారు. ఇదే సమయంలో వెంకటస్వామి, అంజయ్య, ఎంఎం.ఆసీమ్, సంజీవరెడ్డి తదితరులు హైదరాబాద్‌లోని నారాయణగూడ తాజ్‌మహల్ కేంద్రం అడ్డాగా కార్మిక రాజకీయాలు నడిపేవారు. హైదరాబాద్‌లోని కార్వాన్, బీహెచ్ఇఎల్, రిపబ్లికన్ పోర్ట్, శ్రీశైలం డ్యామ్ తదితర సంస్థల్లో కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి వారిహక్కుల కోసం పోరాడారు. ఈ నేపథ్యంలో సోదరుడు నర్సింహాస్వామి రామగుండంలో కాంట్రాక్టు పనులు నిర్వహించడంతో వెంకటస్వామి తరుచూ హైదరాబాద్‌లో ‘జనతా రైలు’ ఎక్కి రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్‌కు వచ్చి వెళ్లేవారు. 1953లో రామగుండం బి-పవర్‌హౌస్ వద్ద మూడు రంగుల జెండాను వెంకటస్వామి ఎగురవేశారు. తర్వాత సింగరేణి కాలరీస్, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో కూడా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసి పనిచేశారు. 1957లో జరిగిన ద్విశాసనసభ ఎన్నికల సమయంలో చెన్నూర్, సిర్పూర్ నుంచి వెంకటస్వామి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తర్వాత 1962లో మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ స్వతంత్ర అభ్యర్థి జి.సైదయ్య చేతిలో ఓడిపోయారు. అనంతరం 1967లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 1971లో తెలంగాణ ప్రజాసమితి, 1977లో కాంగ్రెస్ పార్టీ తరఫున మూడుసార్లు మెదక్ జిల్లా సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గం(ఎస్సీ రిజర్వు) నుంచి ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 1978లో రాష్ట్ర రాజకీయాలకు ఆకర్షితులై ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి ప్రభుత్వంలో కార్మిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలోనే ఆయన హైదరాబాద్‌లో చాలా మంది పేదలకు గుడిసెలు వేసుకునే అవకాశం కల్పించి ‘గుడిసెల వెంకటస్వామి’గా పేరు తెచ్చుకున్నారు. 1989 నుంచి పెద్దపల్లి లోక్‌సభపై దృష్టి.. 1989, 1991, 1996లో తిరిగి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్సీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వరుసగా ఎంపీగా ఎన్నికై రెండవసారి హ్యాట్రిక్ సాధించారు. 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చెలిమెల సుగుణకుమారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2004లో జరిగిన ఎన్నికల్లో ఆమెపైనే ఘన విజయం సాధించారు. 1979లో ఇందిరాగాంధీ కేంద్ర క్యాబినెట్లో డెప్యూటీ లేబర్ మినిస్టర్‌గా, 1996లో పీవీ న ర్సింహారావు కేబినెట్లో గ్రామీణాభివృద్ధి, కార్మిక, జౌళి శాఖ మంత్రిగా పనిచేశారు. 1985 నుంచి 1988 వరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, తర్వాత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, లోక్‌సభ డెప్యూటీ లీడర్‌గా వ్యవహరించారు. కాకా తన కుమారులు జి.వినో ద్, జి. వివేక్‌ను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం... సింగరేణి సంస్థలో 1996 కన్నా ముందు గని కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు. ఆ సమయంలో పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన కాకా కేంద్రంతో మాట్లాడి గని కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో కీలక భూమిక పోషించారు. 1998లో జరిగిన వేతన ఒప్పందం సమయంలో సింగరేణి వద్ద డబ్బులు లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి రూ.400 కోట్లు తీసుకుని కార్మికులకు వేతన చెల్లించేలా చూశారు. కాజిపేట నుంచి సిర్పూర్కాగజ్నగర్ వరకు రామగిరి ప్యాసింజర్ రైలును వేయించారు. గోదావరిఖనిలో సింగరేణి స్థలాల్లో ప్రజలు ఇళ్లు నిర్మించుకోగా... ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లి సుమారు 17 వేల మందికి స్థలాల క్రమబద్ధీకరించి పట్టాలు ఇప్పించారు. గనులపైకి వచ్చినప్పుడు కార్మికులు ఆయనకు తమ కష్టసుఖాలు చెప్పుకునేవారు. సింగరేణిలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ యూనియన్ బలోపేతం కోసం కూడా చిరకాలం పనిచేశారు. కాకా కృషితో పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని మేడారం, పెద్దపల్లి నియోజకవర్గాలకు రాష్ట్రస్థాయిలో అధిక ప్రాధాన్యత లభించేది. తన తర్వాత తరమైన దళిత నేతలు గుమ్మడి నర్సయ్య, బడికెల రాజలింగం, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులకు అవకాశం కల్పించి రాజకీయంగా ఎదిగేలా చూశారు. -
కొత్త సర్కారుపై కోటి ఆశలు
సింగరేణిపై గులాబీ జెండా రెపరెప - నాలుగు జిల్లాల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు కైవసం - ఐదు ఎంపీ సీట్లలో నాలుగు చోట్ల ఘన విజయం - కార్మిక సమస్యల పరిష్కారమే టీఆర్ఎస్ ముందున్న అజెండా గోదావరిఖని,న్యూస్‌లైన్: సింగరేణి కార్మికులు కారుకు జైకొట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో కోల్‌బెల్ట్ వ్యాప్తంగా గులాబీకి పట్టం కట్టారు. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 11 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది, ఐదు లోక్‌సభ సెగ్మెంట్లలో నాలుగు చోట్ల టీఆర్ఎస్ను గెలిపించారు. ఉద్యమ ప్రస్థానంలో అడుగడుగునా అండగా నిలిచి.. ఇప్పుడు అధికారం అప్పగించడంలో ముందున్న సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఆ పార్టీ ప్రజాప్రతినిధులపైనే ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ తెలంగాణలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. సింగరేణి వ్యాప్తంగా 34 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్ట్ ప్రాజె క్టులు ఉండగా, 64వేల మంది కార్మికులు సంస్థలో పనిచేస్తున్నారు. భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికితీస్తూ అటు ఆర్థిక వ్యవస్థకు, విద్యుత్, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. అయినప్పటికీ గనికార్మికుల జీవితాలు దినదినగండానే గడుస్తున్నాయి. సింగరేణి ఆవిర్భావం నుంచి నేటి వరకు అనేక సమస్యలతో నల్లసూరీళ్లు సతమతమవుతున్నారు. కార్మికుల సమస్యలను ఎన్నికల అజెండాగా మార్చుకుంటున్న రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మరిచిపోయి శ్రమజీవుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయి. సింగరేణిలో కొలువుదీరిన స్థానికేతర అధికారులు, ఉన్నతాధికారులు స్థానిక కార్మికుల పట్ల తీవ్రమైన వివక్షతను ప్రదర్శిస్తున్నారనే అపవాదు ఉంది. ఆ అవమానాలు, అణిచివేతల కారణంగా ఆక్రోశంతో రగిలిపోతున్న కార్మికులు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు. ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైన తరుణంలో వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్కు పట్టం కట్టారు. కరీంనగర్ జిల్లాలో రామగుండం, మంథని నియోజకవర్గాల పరిధిలో సింగరేణి సంస్థ విస్తరించి ఉండగా, రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపించారు. ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ఉన్న గనికార్మికులు అక్కడ సైతం గులాబీ జెండానే ఎగురవేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకున్నారు. అలాగే వరంగల్ జిల్లా భూపాలపల్లిలో, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో కారుకు పట్టం కట్టారు. దీంతోపాటు పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, మహబూబాద్‌లలో టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ తమ సమస్యలకు విముక్తి కలుగుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఇక కార్మికులు తమపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపైనే ఉంది. ఎంపీల గురుతర బాధ్యత ఇది... తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్పై సింగరేణి ప్రాంత అభివృద్ధితో పాటు కార్మికుల సమస్యల పరిష్కారం చేయడాన్ని గురుతర బాధ్యత. లోక్‌సభకు పోటీ చేసిన టీఆర్ఎస్ సభ్యులు కోల్‌బెల్ట్ ప్రాంతాలలో ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలకు ఫనంగా పెట్టి పనిచేస్తున్న గని కార్మికులకు కూడా ఆదాయపు పన్ను మినహారుుంపు ఇచ్చేలా కేంద్రంతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 1998లో 1,09,000 మంది కార్మికులు పనిచేస్తే నేడు 64 వేలకు వారి సంఖ్య తగ్గింది. కార్మికుల నియూమక ప్రక్రియ చేపట్టాలి. కొత్తగా భూగర్భ గనులను ప్రారంభించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చాలి. పనిఒత్తిడి కారణంగా విధులకు గైర్హాజరైన దాదాపు 10 వేల మంది కార్మికులను యాజమాన్యం డిస్మిస్ చేసింది. వీరిలో ఇటీవల కొంత మందిని విధులకు తీసుకున్నా వేలాది మంది రోడ్లపైనే బతుకీడుస్తున్నారు. డిస్మిస్ కార్మికులను కూడా బేషరతుగా ఉద్యోగాల్లోకి తీసుకునేలా యాజమాన్యంతో చర్చించి చర్యలు తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 35 రోజుల పాటు కార్మికులు సకల జనుల సమ్మె చేపట్టి బొగ్గు ఉత్పత్తిని స్తంభింపచేసి వేలాది రూపాయలు వేతనాలను కోల్పోయారు. ఈ సందర్భంగా రూ. 25 వేలను సమ్మె అడ్వాన్స్ చెల్లించి తిరిగి వేతనాల నుంచి కోత విధించారు. ఆ సొమ్మును తిరిగి కార్మికులకు చెల్లించాలనే డిమాండ్‌ను ఎంపీలు తమ భూజాలపై వేసుకోవాలి.