గోదారి ఎడారి
► కోల్‌బెల్ట్‌లో ఇక నీటి కటకటే
► గోదావరి నదిలో నిలిచిన ప్రవాహం
► ఎల్లంపల్లి నుంచి దిగువకు నీరు బంద్
► విద్యుత్ కేంద్రాలకూ తప్పని తిప్పలు
గోదావరిఖని : గోదావరి నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయింది. ఎండలు పూర్తిగా ముదరకముందే నదిలో నీటిఛాయలు కనిపించకుండా పోతున్నాయి. హైదరాబాద్‌కు నీటిని తరలించే ఉద్దేశంతో ఎల్లంపల్లి నుంచి దిగువకు నీటి విడుదల నిలిపివేయగా, ఇప్పుడు పాయ కూడా పారడం లేదు. గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీకాలనీల ప్రజలకు, సింగరేణి, తెలంగాణ జెన్‌కో విద్యుత్ కర్మాగారాలకు నీటి తిప్పలు ఏర్పడనున్నాయి. సాధారణంగా గోదావరి నదిలో నీటి ప్రవాహంతో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన 26 ఇన్‌ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా గోదావరిఖనిలోని 7,300 క్వార్టర్లు, యైటింక్లయిన్‌కాలనీలోని 4,500 క్వార్టర్లు, సెంటినరీకాలనీలోని 2,500 క్వార్టర్లకు నీటి సరఫరా జరుగుతుంది. పట్టణంలోని దాదాపు 25 వేల పైచిలుకు ప్రైవేటు గృహాలకు కూడా సింగరేణి నీరే అందుతుంది.
ఈ మూడు ప్రాంతాల్లో తాగునీటికోసం నిత్యం 70 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. తాజాగా నదిలో నీటి ప్రవాహం తగ్గిపోవడంతో సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మునిగిపోయింది. గతంలో 2010 నుంచి 2013 వరకు నదిలో నీటి ప్రవాహం పూర్తిగా తగ్గి నది ఎడారిని తలపించింది. దీంతో యాజమాన్యం రోజు విడిచి రోజు నీరు అందించేందుకు నదిలో 40 బోర్లు వేసి ప్రతీ బోరు ద్వారా రోజుకు వచ్చిన లక్ష గ్యాలన్ల నీటిని మూడు ప్రాంతాలకు అందించారు.
దీనికితోడు సింగరేణి భూగర్భగనుల్లో ఊటగా వచ్చిన నీటిని కూడా ఉపరితలానికి తరలించి ఫైవింక్లయిన్ వద్ద గల ఫిల్టర్‌బెడ్‌లో శుద్ధి చేసి కాలనీలకు సరఫరా చేశారు. ఈ ఏడాది కూడా నీటికి ఇబ్బంది ఏర్పడనుండడంతో ఇప్పటికే బోర్లను గోదావరి నది ఒడ్డున గల ఇంటెక్‌వెల్ వద్దకు అధికారులు చేర్చారు. రామగుండం కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లకు గాను 16 వేల నల్లా కనెక్షన్లుండగా రోజు విడిచి రోజు 10 మిలియన్ గ్యాలన్ల నీటిని అందిస్తున్నారు. నది ఒడ్డున గల కార్పొరేషన్ ఇంటెక్‌వెల్ వద్ద ఇప్పటికే నీటి కోసం కాలువ తీయగా... రాబోయే రోజుల్లో అవసరమైన చర్యలకోసం నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
హైదరాబాద్‌కు నీటిని తరలించాకే...
ఎల్లంపల్లి బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 836.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ 835 మీటర్ల దిగువకు పడిపోతే హైదరాబాద్‌కు నీటిని తరలించే అవకాశం ఉండదు. అందువల్ల నీటి పారుదలశాఖ అధికారుల ఆదేశం మేరకు ఎల్లంపల్లి నుంచి దిగువకు నీటిని వదలకుండా బంద్ చేసి ప్రస్తుతం హైదరాబాద్‌కే తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో దిగువన నీటి ప్రవాహం లేకుండా పోయింది.
విద్యుత్ పరిశ్రమలకు ఇబ్బందే
తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో రామగుండం వద్ద 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నడుస్తుండగా ఇందుకు అవసరమైన నీటిని గోదావరి నది నుంచి తీసుకుంటున్నారు. ప్రస్తుతం నదిలో నీటిలభ్యత లేకపోవడంతో ప్లాంట్ నిర్వహణ కష్టసాధ్యమయ్యేలా ఉంది. సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖనిలో నడుస్తున్న పవర్‌హౌస్‌కు నది నుంచి ‘రా వాటర్’ సరఫరా చేస్తారు. నదిలో నీరు లేకపోవడంతో ఇంటెక్‌వెల్ వద్ద 22 మీటర్ల లోతులో ఉన్న పంప్‌లకు కూడా నీరు అందక ఈ నెల 3 నుంచి పవర్‌హౌస్‌కు నీటి సరఫరా కావడం లేదు.
దీంతో కాలనీల ప్రజలకు తాగునీటి కోసం సరఫరా చేసే నీటిలో నుంచి 3 లక్షల గ్యాలన్ల నీరు, జీడీకే 1వ గనిలో ఊటగా వచ్చిన మరో లక్ష గ్యాలన్ల నీటిని అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద ఇటీవల 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌కు సింక్రనైజేషన్ చేయగా... మరో మూడు నెలల వరకు ఇక్కడ మెయింటనెన్స్ పనులు చేస్తారు. ప్రాణహిత నుంచి ఇంకా లైన్ వేయకపోవడంతో ప్రస్తుతం సమీపంలో ఉన్న చెట్‌పల్లి-సుందిళ్ల సరిహద్దులోని గోదావరి నది నుంచి నీటిని వినియోగిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం లేని కారణంగా ఈ విద్యుత్ కేంద్రానికి కూడా ఇబ్బందులు త ప్పేలా లేవు.