కొత్తగూడెం: రాష్ట్రంలో విద్యుత్ కొరత తీర్చే బాధ్యత సింగరేణిపైనే ఉందని సీఎండీ నడిమట్ల శ్రీధర్ అన్నారు. కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేసే విద్యుత్ ప్లాంట్‌లకూ బొగ్గు సరఫరా చేయాల్సిన బాధ్యత కూడా సంస్థదే అని సూచించారు. విద్యుత్ ప్లాంట్ల అవసరాలకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు కొత్త గనులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొత్తగా కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్న 204 బొగ్గు బ్లాక్‌లలో కొన్నింటిని సింగరేణికి కేటాయించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ విన్నవించారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రధాని మోడీతో ఈ విషయంపై చర్చించారని తెలిపారు. వేలం పద్ధతిలో మూడు బ్లాక్‌లను దక్కించుకునేందుకు ప్రణాళికలు చేసినట్లు వివరించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని తారా కోల్ బ్లాక్, ఒడిశా రాష్ట్రంలోని మందాకిని కోల్‌బ్లాక్, ఉక్కల్ కోల్‌బ్లాక్‌లను దక్కించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మరో 30, 40 ఏళ్లలో సింగరేణిలో ఉన్న రిజర్వ్‌లు కూడా తగ్గే అవకాశం ఉందన్నారు. ఇతర ప్రాంతాల్లో బొగ్గు బ్లాక్‌లను దక్కించుకోవడం ద్వారా ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.
విద్యుత్ కొరత తీర్చాల్సిన బాధ్యత సింగరేణిదే
Published Fri, Feb 6 2015 4:08 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement