హంతకుడు ఎవరు..?! | Karimnagar Inter Student Murder Case Is Challenging For Police | Sakshi
Sakshi News home page

పోలీసులకు సవాలుగా మారిన హత్య కేసు!

Published Thu, Feb 13 2020 8:29 AM | Last Updated on Thu, Feb 13 2020 8:30 AM

Karimnagar Inter Student Murder Case Is Challenging For Police - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఇంటర్‌ విద్యార్థిని రాధిక హత్యకేసును ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఓ పేద కుటుంబానికి చెందిన అమ్మాయిని ఇంట్లో కూరగాయల కత్తితో గొంతుకోసి హత్య చేసి 48 గంటలు దాటినా... హంతకుడు ఎవరనేది తేల్చలేక పోలీసులు సతమతం అవుతున్నారు. అనుమానితులుగా భావించిన వారిని ఎన్ని రకాలుగా విచారించినా.. హత్యకు సంబంధించిన సమాచారం దొరకలేదు. డాగ్‌ స్క్వాడ్, ఫోరెన్సిక్‌ రిపోర్టు, సీసీ కెమెరాల నివేదికలు కూడా పోలీసులకు ఉపయోగపడలేదని సమాచారం. అమ్మాయి తల్లిదండ్రుల ఫో¯Œన్లలోని కాల్‌డేటాతో కూడా ఉపయోగకర సమాచారం లేదని తెలిసింది. రాధికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్లు సమాచారం. హత్య జరిగిన సంఘటన తీరును బట్టి చూస్తే పథకం ప్రకారం కాకుండా అనుకోకుండా జరిగిన హత్యగా స్పష్టమవుతోంది. అదే సమయంలో ఇంటి గురించి, రాధిక ఇంట్లోని వ్యక్తులతో పరిచయం ఉన్న వ్యక్తి చేసిన హత్యగానే తెలుస్తోంది. ఇంత గందరగోళంగా ఉన్న కేసులో హంతకుడెవరనేది పోలీసులు, నగర వాసులను వేధిస్తున్న ప్రశ్న.

ప్రేమ వ్యవహారంలో లభించని క్లూ
రాధికకు వరుసకు బావ అయ్యే యువకుడు మానకొండూరు మండలం లక్ష్మీపూర్‌లో ఉంటాడు. రాధికకు సోకిన పోలియోకు తల్లిదండ్రులు చికిత్స చేయించిన తరువాత ఈ యువకుడు రాధికను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. పెళ్లి ప్రపోజల్‌ కూడా తీసుకొచ్చాడు. అయితే అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. తనకు చికిత్స కోసం తండ్రి రూ.20లక్షల వరకు ఖర్చు చేశాడని, ఆయన చూపించిన సంబంధమే చేసుకుంటానని చెప్పినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఈ యువకుడికి రాధిక కుటుంబంతో మంచి సంబంధాలే ఉండడం వల్ల తరచూ ఫోన్‌ కాల్స్‌ చేసేవాడని, ఇటీవల ఈ యువకుడి ఇంట్లో జరిగిన ఓ పూజ కార్యక్రమానికి కూడా రాధిక వెళ్లి వచ్చినట్లు పోలీసులు తేల్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా హత్య జరిగిన సోమవారం ఈ యువకుడు లక్ష్మీపూర్‌లోనే ఉన్నట్లు తేలింది. 

అనుమానితులంతా అమాయకులే?
రాధిక ఇంట్లో గతంలో అద్దెకు ఉండి పోయిన వ్యక్తిని విచారించగా, మద్యం అలవాటు అధికంగా ఉన్న అతను అమాయకుడేనని తేలింది. హత్యకు ముందు రెండు రోజుల కాల్‌డేటా ఆధారంగా ఆ కుటుంబంతో మాట్లాడిన వారిని విచారించినప్పటికీ ఎలాంటి వివరాలు తెలియరాలేదు. విద్యానగర్‌లో హత్య జరిగిన గుడి ప్రాంతంలో, ప్రధాన దారిలో ఉన్న పోలీసు, ప్రైవేటు వ్యక్తుల ఇళ్లు, దుకాణాల్లోని 36 సీసీ కెమెరాలను పరిశీలించారు. సుమారు 100 కాల్స్‌కు సంబంధించి విచారణ జరిపారు. కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారిని, ఇతరులను కలిపి సుమారు 30 మందికి పైగా విచారించారు. ఇంత చేసినా... హంతకుడు ఎవరో పోలీసులు కనిపెట్ట లేక పోతున్నారు. కాల్‌డేటా ఆధారంగా జరిపిన విచారణలో కొంతమంది విచారించినప్పుడు కేసు ఛేదనకు దగ్గరగా వచ్చినట్టే వచ్చి తిరిగిదారులు మూసుకు పోతున్నాయని తెలిసింది. హత్య ఘటనలో ఉన్న వాతవరణం చూస్తే కుటుంబం గురించి తెలిసిన వారు, వారికి పరిచయమున్నవారే చేశారనే పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఎవరు చేశారనే విషయం అంతుపట్టడం లేదు. 

మరికొంత సమయం పట్టే అవకాశం...
హత్య కేసు చేధించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు చుట్టు పక్కల వాళ్లను విచారించడంతోపాటు రాధిక ఇంట్లోకి వచ్చి, బయటకు వెళ్లే మార్గాలు విషయంలో దృష్టిపెట్టి నిశితంగా పరిశీలిస్తే ఏమైనా ఆధారాలు దొరుకుతాయోనని పోలీసులు భావిస్తున్నారు. అనుమానితులను విచారించడంతోపాటు రా«ధిక ఇంటి ప్రాంతంలో అక్కడ పనిచేసిన మున్సిపల్, విద్యుత్‌ వర్కర్ల వేలిముద్రలను కూడా పోల్చిచూసినట్లు తెలిసింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ హంతకుడెవరూ అన్న విషయాలు తెలియకపోవడంతో నమ్మలేని వ్యక్తులే హంతుకులా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

సమాచారం ఇస్తే నగదు రివార్డు
రాధిక హత్య కేసును చేధించేందుకు ఉపయోగపడే వివరాలు అందించిన వారికి తగిన పారితోషికాన్ని కూడా పోలీసులు ప్రకటించారు. కేసు గురించి ఏవైనా ఆధారాలు తెలిస్తే 2వ పట్టణ పోలీసు స్టేషన్‌ సీఐ, ఏసీపీలతోపాటు కమిషనరేట్‌లో డీసీపీలకు కూడా సమాచారం అందించవచ్చని సూచిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు తగిన రివార్డు అందజేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement