మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సమావేశమైన కేసీఆర్
‘సెక్షన్-8’పై గవర్నర్‌కు స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
తీవ్రంగా ప్రతిఘటించేందుకు వెనుకాడం.. మరో ఆత్మగౌరవ పోరు చేపడతాం
ఇతర రాష్ట్రాలతో కలసి కేంద్రాన్ని నిలదీస్తాం
తప్పించుకునేందుకు చంద్రబాబు,ఏపీ సర్కారు కుట్రలు.. తప్పుదోవ పట్టించేందుకే తెరపైకి సెక్షన్-8
‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ తన పని తాను చేసుకుపోతోంది.. ప్రభుత్వ ప్రమేయం లేదు
కావాలనే తెలంగాణ సర్కారుపై దుష్ర్పచారం చేస్తున్నారని వ్యాఖ్య
ఢిల్లీలో ఆమరణ దీక్షకైనా సిద్ధమన్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలుకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని గవర్నర్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కుట్రలను ప్రతిఘటించేందుకు వెనుకాడేది లేదని తేల్చిచెప్పారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వారు సమావేశమయ్యారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తనకున్న అధికారాల ప్రకారం గవర్నర్ జోక్యం చేసుకోవచ్చని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సూచించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ గవర్నర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుత పరిణామాలు, జరుగుతున్న కుట్రలను సీఎం ఈ సందర్భంగా గవర్నర్‌కు పూసగుచ్చినట్లు వివరించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు, ఏపీ సర్కారు చేస్తున్న కుట్రలు, లోపాయకారీగా జరుగుతున్న దుష్ర్పచారాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.
రేవంత్‌ను ఏసీబీ అరెస్టు చేసింది మొదలు బేరసారాల కుట్రలో స్వయంగా చంద్రబాబు పాల్గొన్న విషయాలను ఎప్పటికప్పుడు నివేదించామని.. అవన్నీ మీకు తెలియనవి కావని గవర్నర్‌కు కేసీఆర్ మరోసారి గుర్తుచేశారు. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు, వారి తప్పును కప్పి పుచ్చుకునేందుకు రాజకీయ దురుద్దేశంతోనే సెక్షన్-8కు పట్టుపడుతున్నారని వివరించారు. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని గవర్నర్‌కు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ తన పని తాను చేసుకుంటోందని, ప్రభుత్వ ప్రమేయం ఉండబోదని మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఏడాది కాలంలో హైదరాబాద్‌లో ఎలాంటి ఇబ్బందికర ఘటనలు జరగలేదని, ప్రాంతీయ విద్వేషాలు, ఘర్షణలకు సంబంధించిన కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. శాంతిభద్రతల సమస్య లేనప్పుడు సెక్షన్-8 ప్రస్తావన తీసుకురావడం కుట్రలో భాగమేనని ఫిర్యాదు చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి హైదరాబాద్‌లో అకారణంగా సెక్షన్-8ను అమలు చేయాలని కేంద్రం తలపిస్తే తిప్పికొట్టడానికి వెనుకాడబోమని పేర్కొన్నారు.
నిరుడే కేంద్రానికి లేఖ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలోనే హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాలనే కేంద్ర హోంశాఖ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిపై గత ఏడాది ఆగస్టు 9న సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. గవర్నర్‌కు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలన్న సూచనలను అమలుచేసే ప్రసక్తే లేదని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి మండలి సూచనల ప్రకారమే గవర్నర్ విధులు నిర్వహించాలని సెక్షన్-8(3)లో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. ఈ లేఖ ప్రతిని మంగళవారం నాటి భేటీలో గవర్నర్‌కు సీఎం కేసీఆర్ అందించినట్లు సమాచారం.
ఆమరణ దీక్ష చేస్తాం..
సెక్షన్-8ను అమలు చేస్తే ఢిల్లీకి వెళ్లి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి వెనుకాడేది లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులు, పార్టీ సన్నిహితులతో జరిగిన సమావేశాల్లో సీఎం ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు సమాచారం. కుట్రలను తిప్పికొట్టేందుకు, సెక్షన్-8ను ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలను కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటించాలన్నారు. అవసరమైతే జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల సీఎంల మద్దతు సమీకరించి కేంద్రంపై ఉద్యమించేందుకు కూడా వెనుకాడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం పలువురు నేతలు సీఎంకు ఫోన్లు చేసి ఇదే అంశంపై మాట్లాడినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ చర్యలకు పాల్పడితే తాము కలిసి వస్తామని తెలిపినట్లు సమాచారం.