
అటార్నీ జనరల్ సూచనల్ని అమలు చేయలేను
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని వివాదాస్పద సెక్షన్-8 ఆధారంగా... భారత అటార్నీ జనరల్ సూచన మేరకు ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షించడం సాధ్యం కాదని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తేల్చారు.
తనను కలసిన కేసీఆర్, అధికారులతో గవర్నర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం
కేంద్ర హోంశాఖ, కేంద్ర కేబినెట్ ఆదేశాలు వస్తేనే..
ఆలోగా ‘ఓటుకు కోట్లు’ కేసు పర్యవేక్షణ చేయలేను
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని వివాదాస్పద సెక్షన్-8 ఆధారంగా... భారత అటార్నీ జనరల్ సూచన మేరకు ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షించడం సాధ్యం కాదని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తేల్చారు. ఇదే విషయాన్ని మంగళవారం తనను కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గవర్నర్ స్పష్టం చేసినట్లు అత్యున్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సెక్షన్-8 ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలను గవర్నర్ పర్యవేక్షించవచ్చునని, ‘ఓటుకు కోట్లు’ కేసును ఉభయ రాష్ట్రాల డీజీపీలను పిలిచి పర్యవేక్షించవచ్చునని భారత అటార్నీ జనరల్ శుక్రవారం సూచించారు. అయితే ఈ సలహా అమలు సాధ్యం కాదని గవర్నర్ తనంతటతానే పక్కనపెట్టారు. అయితే అటార్నీ జనరల్ సూచన వ్యవహారం సోమవారం మీడియాకు ఎక్కడంతో మంగళవారం ఆ అంశానికి ప్రాధాన్యమేర్పడింది. కాగా తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు సోమవారమే గవర్నర్‌ను కలసి మీడియాలో వస్తున్న వార్తలపై అడిగి తెలుసుకున్నారు.
భారత అటార్నీ జనరల్ సలహా ఇచ్చారని, అయితే దానిని పక్కనపెట్టానని గవర్నర్ వారికి స్పష్టం చేశారు. ఇదే అంశంపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి నరసింహన్‌తో గంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఇచ్చిన సలహా గురించి గవర్నర్ పేర్కొనడంతోపాటు ఆ సలహాను అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశంతోపాటు ‘ఓటుకు కోట్లు’ కేసును గవర్నర్ పర్యవేక్షణ చేయాలంటే కేంద్ర హోంశాఖ తొలుత కేంద్ర కేబినెట్‌కు నివేదిక సమర్పించాలని, దాని ఆధారంగా కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తేతప్ప తాను ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షించడం సాధ్యం కాదని నరసింహన్ పేర్కొన్నట్లు సమాచారం.
ఉభయ రాష్ట్రాల డీజీపీలను పిలిచి ‘ఓటుకు కోట్లు’ కేసును పర్యవేక్షించాలంటే.. కేంద్ర హోంశాఖ లేదా కేంద్ర కేబినెట్ ఆదేశాలుండాలని, అవి లేకుండా పర్యవేక్షించడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందనే అభిప్రాయాన్ని గవర్నర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం బయటపడగానే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి, ప్రధానమంత్రిని కలసి తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఫిర్యాదు చేయడం తెలిసిందే. అనంతరం గవర్నర్ నరసింహన్ కూడా కేంద్రహోంమంత్రి, ప్రధానిని కలసి.. ఈ వ్యవహారంలో టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంతరెడ్డి అరెస్టు కావడం. అనంతరం సీఎం చంద్రబాబు ఫోనులో మాట్లాడిన అంశాలు మీడియాలో రావడం గురించి తెలియజేయడమూ విదితమే. ఈ నేపథ్యంలోనే ‘ఓటుకు కోట్లు’ కేసు పర్యవేక్షణపై కేంద్రప్రభుత్వం అటార్నీ జనరల్ సలహా కోరింది. అటార్నీ జనరల్ ఇచ్చిన సలహాను గవర్నర్‌కు పంపించారు.