* నేటితో కేసీఆర్ సర్కారుకు వంద రోజులు
* పాలనలో సరికొత్త పంథా.. విధాన నిర్ణయాలతో దూకుడు
* ఇప్పటికీ ప్రణాళికలపైనే ప్రధానంగా కసరత్తు
* తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేసే యత్నం
* ప్రభుత్వం ముందు వందల ఆలోచనలు.. నిర్ణయాల అమలులో పుంజుకోని వేగం.. అన్నీ తానై వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్
* అడుగడుగునా తెలంగాణ ముద్ర కోసం తపన
* మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించలేక పోతున్నారన్న విమర్శలు
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ర్టంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం మంగళవారంతో వంద రోజుల పాలనను పూర్తి చేసుకుంది. బంగారు తెలంగాణ లక్ష్యంగా సరికొత్త అడుగులతో ప్రయాణాన్ని మొదలుపెట్టిన టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఇంకా ప్రణాళికల దశలోనే ఉండిపోయింది. తెలంగాణ ప్రజల్లో రేకెత్తిన కోటి ఆశలను నెరవేర్చడానికి కొంగొత్త ఆలోచనలను తెరపైకి తెస్తూ.. తొలిసారి అధికారం చేపట్టిన ఉద్యమ పార్టీ ఇప్పటికే అనేక విధాన నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయంలో తెలంగాణ రథసారథిగా సీఎం కేసీఆర్ తనదైన పంథాను అనుసరిస్తున్నారు.
గడచిన మూణ్నెల్లలో సర్కారు ఆలోచనా విధానం, పాలనాశైలి, భవిష్యత్ ప్రణాళికలే తెలంగాణ పునర్నిర్మాణానికి పునాదిగా నిలువనున్నాయి. అయితే ఇప్పటివరకు కేసీఆర్ సర్కారు పూర్తిగా సన్నాహాలకే పరిమితమైంది. పాలనలో తనదైన ముద్ర వేయాలని పరితపిస్తున్నప్పటికీ ఆ దిశగా వేస్తున్న అడుగుల్లో వేగం మాత్రం పుంజుకోలేదు. సీఎం కేసీఆర్ నిర్దేశించుకున్న త్రీడీ(డిఫైన్, డిజైన్, డెలివర్) పాలనా విధానంలో మొదటి రెండు దశలపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. మొత్తంగా ఈ వంద రోజుల్లో విధాన నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడు ప్రదర్శించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. వాటి అమలులో మాత్రం ఆ తీరును కనబరచడం లేదు.
రాజకీయ సుస్థిరతకే తొలి ప్రాధాన్యం
ఇప్పటివరకు రాజకీయ సుస్థిరతకే ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి ప్రాధాన్యమిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పాస్ మార్కులే(63 సీట్లు) రావడంతో భవిష్యత్తులో ప్రభుత్వానికి ముప్పు లేకుండా ఉండేందుకు పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లారు. ఇతర పార్టీలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని రాజకీయ సుస్థిరతకు ఢోకా లేకుండా చేసుకున్నారు.
వలసలు, ఫిరాయింపులపై ఎన్ని విమర్శలొచ్చినా ఇతర పార్టీల స్థానిక ప్రజాప్రతినిధులనూ తనవైపునకు తిప్పుకొని స్థానిక పాలనలోనూ పట్టు సాధించడంలో కొంత వరకు కేసీఆర్ సఫలీకృతులయ్యారు. పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం వంటి జిల్లాల్లో టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావు లాంటి బలమైన నేతలను టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావడం ద్వారా భవిష్యత్తు భద్రత కోసం పరితపిస్తున్నట్టుగానే కనిపించింది.
ఇప్పటికీ ప్రణాళికలే!
తెలంగాణలో అర్హులైన వారికే సంక్షేమ పథకాలు అందిస్తామని, రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రకటించిన కేసీఆర్.. ఈ వంద రోజుల్లో ఆ దిశగా కసరత్తు చేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఆగస్టు 19న ఒకే రోజులో రాష్ర్టవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఇందుకు నిదర్శనం. ఇక ‘మన ఊరు - మన ప్రణాళిక ’ పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించారు.
అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడానికి దాదాపు 600 మంది రెవెన్యూ అధికారులతో ఇటీవల పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించారు. తన లక్ష్యసాధనలో భాగస్వాములను చేసేందుకు సర్పంచులు మొదలు మేయర్ దాకా త్వరలో 21 వేల మంది స్థానిక ప్రజాప్రతినిధులకు శిక్షణనిచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించారు. రుణమాఫీ సహా కీలకమైన అనేక అంశాలన్నింటిపైనా కమిటీల పేరుతో అధ్యయానికే ప్రాధాన్యతనిచ్చారు. వంద రోజుల్లో వివిధ అంశాలపై దాదాపు 35 వరకు కమిటీలను నియమించారంటే ఏ స్థాయిలో ముందస్తు కసరత్తు జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.
పాలనంతా కేంద్రీకృతం...
ఇక రాష్ర్టంలో పాలన మొత్తం సీఎం కేసీఆర్ చుట్టే కేంద్రీకృతమైంది. సమావేశాలు, సమీక్షలు అన్నీ తానై నిర్వహిస్తున్న కేసీఆర్... మంత్రులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లోనూ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సమావేశాలు, సమీక్షలు గంటల తరబడి కొనసాగుతున్నాయి. కేసీఆర్ తనకు తెలిసిన అంశాల విషయంలో అధికారులు ఎలాంటి సూచనలు, సలహాలు చేసినా పట్టించుకోకుండా.. తాను అనుకున్న విధంగా విధానాలను రూపొందించాలన్న పట్టుదల కనబరుస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.
బడ్జెట్ కసరత్తు మొత్తం పూర్తయ్యాక ముఖ్యమంత్రికి వచ్చిన కొత్త ఆలోచనతో దాన్ని పక్కనపెట్టి.. టాస్క్‌ఫోర్స్ కమిటీలంటూ సలహాదారులు, నిపుణులతో అధ్యయన బృందాలను ఏర్పాటు చేసి కొత్త విధానానికి తెరలేపారు. ఇక తమ శాఖల్లో మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించ లేని పరిస్థితి ఉందన్న వాదనలు వినవస్తున్నాయి.
అలాగే సీఎం వద్ద సమావేశం ఉందంటూ వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులకు ఆహ్వానం అందుతోంది. సమావేశం ఏమిటో, దేనిపైనో తెలియకుండా.. వెళ్తున్న అధికారులు సీఎం చెప్పింది వినడం మినహా పెద్దగా చెప్పడానికేమీ ఉండడం లేదన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వంద రోజుల్లో రాష్ర్ట ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికలు, తీసుకున్న విధాన నిర్ణయాల అమలుపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కత్తిరింపులపైనే దృష్టి..
సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఏరివేతపైనా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. సమగ్ర సర్వే ఉద్దేశం కూడా అదేనని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, భూ పంపిణీ, పక్కా ఇళ్లు వంటి పథకాలు అనర్హులకు చేరకుండా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం స్థానంలో ప్రవేశపెడుతున్న ఫాస్ట్(తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం) పథకం కూడా ఈ కోవలోనిదే. దాదాపు 174 ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపు రద్దు, పక్కా ఇళ్ల అక్రమాలపై సీఐడీ విచారణ కూడా ఆయా పథకాల భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తెలంగాణ ముద్ర
కేసీఆర్ తన పాలనలో అడుగడుగునా తెలంగాణ ముద్ర కనిపించేలా ప్రయత్నించారు. 1956కు ముందు నుంచి తెలంగాణలో ఉంటున్నవారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ మొదలు గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే వరకు అన్నిటా తనదైన శైలిని కొనసాగించారు. తెలంగాణ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పాఠ్యాంశాల్లో తెలంగాణ చరిత్ర కోసం కమిటీ, ప్రస్తుతమున్న బిజినెస్ రూల్స్‌లో తెలంగాణకు అనుగుణంగా సవరణలు వంటి ముఖ్యమైన నిర్ణయాలన్నింటిలోనూ తెలంగాణ ముద్రనే కనిపిస్తోంది.
ఇలాంటి వందలాది ఆలోచనలతో ముందుకు వెళుతున్న కేసీఆర్ వాస్తవంలో మాత్రం వాటినింకా పూర్తి స్థాయిలో అమలులోకి తేలేకపోయారు. ఎంసెట్ అడ్మిషన్లు, రవాణా పన్ను, నంబర్ ప్లేట్ల వ్యవహారం, కళాశాలల గుర్తింపు రద్దు వంటి వివాదాస్పద నిర్ణయాలకు న్యాయస్థానాల్లో బ్రేకులు పడటం కొంత ప్రతికూలంగా మారినప్పటికీ తనదైన తెలంగాణ ముద్ర వేసే విషయంలో కేసీఆర్ రాజీపడకుండా ముందుకు వెళుతున్నారు.
ఎన్నికల హామీల అమలుకే పరిమితం కాకుండా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, కళ్యాణ లక్ష్మి, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ వంటి సంక్షేమ పథకాలతో పాటు ఫార్మా, సినీ, వైద్య, విద్య వంటి ఆరు కీలక రంగాలకు సంబంధించి ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాలను హైదరాబాద్ చుట్టూ అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలను ప్రకటించారు. రెండు యూనివర్సిటీలకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, ప్రొఫెసర్ జయశంకర్ పేర్లను పెడుతూ తెలంగాణ సమాజం తనకు దూరం కాకుండా చూసుకున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోణంలో కృష్ణా, గోదావరి జలాల పునఃపంపకం కోరుతూ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి.
రంగుల కలలు.. సాకారమే మిగిలింది
Published Tue, Sep 9 2014 12:53 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement