ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పుతున్న నేతలు ఇంకా కారెక్కడం లేదు. అభ్యర్థులను ప్రకటించి నెలరోజులు గడిచినా నాలుగు స్థానాల్లో గులాబీ గూటిలో అసంతృప్తి జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. అధికార టీఆర్‌ఎస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి దక్కని నేతలు అసంతృప్తి చర్యలు సాగిస్తూనే ఉన్నారు. టికెట్ ఆశించి భంగపడిన నేతలు ‘అసమ్మతి వర్గం’గా జట్లు కట్టి తమ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతుండగా.. అధిష్టానం ఆపేందుకు చేసే ప్రయత్నం ఫలించడం లేదు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి నేతలుగా ఆందోళన బాట పట్టిన నేతలపై ఉమ్మడి కరీంనగర్‌కు వచ్చే వరకు ఎలాంటి చర్యలు లేవు. దీంతో ‘రెబెల్స్’గా పోటీ చేస్తామంటున్న వారు, ఇప్పుడు అధిష్టానం పిలిచినా ససేమిరా అంటున్నట్లు తెలిసింది. రామగుండం, వేములవాడలలో పోటాపోటీగా టీఆర్‌ఎస్ అభ్యర్థులపై తిరుగుబాటు దారులు ఆందోళనబాటలోనే ఉన్నారు. పెద్దపల్లి, జగిత్యాలలోనూ అసంతృప్తి చల్లారడం లేదు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ఎవరూ ఊహించని విధంగా టీఆర్‌ఎస్ అధినే త కేసీఆర్ గత నెల 6న ప్రకటించిన 105 మందిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక్క చొప్పదండి మినహాయిస్తే 11 నియోజకవర్గాలలో పాతకాపులకే మళ్లీ అవకాశం కల్పించారు. కొత్తగా ఆశించిన వారు.. గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారు, ఈ సారి టికెట్ ఖాయమనుకున్న వారు తమ పేర్లు కానరాక పోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో అభ్యర్థుల ప్రకటన వెలువడిన రోజే రామగుండం, వేములవాడలలో అసంతృప్తి నేతలు నిరసన స్వరం వినిపించారు. ఆ తర్వాత మానకొండూరు, మంథని, పెద్దపల్లిలలో అభ్యర్థులను మార్చాలని, తమకే అవకాశం ఇవ్వాలంటూ ఆందోళనలు చేపట్టారు. మంథని, మానకొండూరులలో మంత్రి హరీష్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్ చొరవతో అసమ్మతి వాదులంతా చల్లబడ్డారు.
రామగుండంలో సోమారపు సత్యనారాయణకు టికెట్ ప్రకటించడంపై ఏకంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పార్టీలో తిరుగుబాటుకు తెరతీయగా, వేములవాడలో వెయ్యి మందికి పైగా సభను నిర్వహించి చెన్నమనేని రమేష్‌బాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై రామగుండం నుంచి రెబల్‌గా ప్రచారం చేస్తున్న కోరుకంటి చందర్, సంధ్యారాణితో సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ పది రోజుల క్రితం మాట్లాడినట్లు తెలిసింది. కోరుకంటి చందర్ హైదరాబాద్ రమ్మని పిలవడంతో టిక్కెట్ ఇస్తామంటేనే వస్తానని పేర్కొన్నట్లు కూడా ప్రచారం ఉంది. అదేవిధంగా వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతో పాటు పలువురు ముఖ్యనేతలతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయినట్లు సమాచారం.
పెద్దపల్లి, జగిత్యాలలో చాపకింది నీరులా.. అసమ్మతిపై కేసీఆర్ ఆరా..
రామగుండం, వేములవాడల తర్వాత ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, పెద్దపల్లిలోనూ దాదాపుగా అదే పరిస్థితి నెలకొంది. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అక్కడ పార్టీ శ్రేణుల్లో అయోమయం, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జగిత్యాలలో ఓరుగంటి రమణారావు నిజామాబాద్ ఎంపీ కవిత ప్రమేయంతో అలక మాని కారెక్కినా.. అక్కడ అసంతృప్తివాదుల జట్టుగా టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే రెండు దఫాలుగా నియోజకవర్గాన్ని చుట్టిముట్టి ప్రజ లను కలిసినా.. అక్కడ సారయ్యగౌడ్ అసంతృప్తిగా ఉండటం, ఇంకొందరు కీలక నేతలు చాపకింది నీరులా అసమ్మతితో రగులుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
ఈ నేపథ్యంలో ఎలాంటి చర్చలు,చర్యలు స్థానికంగా చేపట్టకపోవడంతో టీఆర్‌ఎస్ టికెట్ల ఆశావహులు చేస్తున్న అసమ్మతి ఆందోళనను, కార్యకలాపాలు ఇంకా సద్దుమణగడం లేదన్న చర్చ పార్టీ నేతలు, శ్రేణుల్లో జోరందుకుంది. ఇదిలా వుండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో తాజా పరిస్థితిపై గులాబీ దళపతి కేసీఆర్ సమగ్ర నివేదిక కోరినట్లు తెలిసింది. సిద్దిపేట జిల్లాలో కలిసిన హుస్నాబాద్ మినహాయించి ఉమ్మడి కరీంనగర్‌లో ఉన్న 12 నియోకవర్గాల్లో ఏం జరుగుతోంది? అంటూ ఇటు ఇం టలిజెన్స్.. అటు పార్టీ సీనియర్/ముఖ్య నేతలను ఆరా తీసినట్లు సమాచారం. ప్రధానంగా అసంతృప్తి ఎక్కడ ఉంది? రెబల్స్ ప్రచారం స్థానాలు ఎన్ని? తెరవెనుక ఎవరు? తదితర అంశాలపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది.
మంత్రి రాజేందర్, ఎంపీ వినోద్‌లకు ఇక బుజ్జగింపుల వంతు..
ఓ వైపు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. మరోవైపు మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌లో అసంతృప్తివాదులతో చర్చించే పనిని ఉధృతం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై నోటిఫికేషన్ సన్నద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్, కూటమి, బీజేపీలు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఇంకోవైపు అభ్యర్థుల తొలి, మలి జాబితాలను సైతం సిద్ధం చేసే కసరత్తులో ఉన్నాయి. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నెలరోజులైనా ఐదారు నియోజకవర్గాల్లో అసంతృప్తి, అసమ్మతివాదుల ఆందోళనలు, అభ్యర్థులకు పోటీగా రెబల్స్ ప్రచారంలోకి దిగడం టీఆర్‌ఎస్ అధిష్టానానికి తలనొప్పిలా మారింది.
దీంతో అసమ్మతివాదులు, రెబల్స్‌ను బుజ్జగించి దారిలోకి తెచ్చే బాధ్యతలను గులాబీ దళపతి కేసీఆర్ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం హుజూరాబాద్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఎంపీ వినోద్‌కుమార్ వెల్లడించారు. ‘ఉమ్మడి జిల్లాలో గులాబీ జెండా ఎగురుతుంది.. నాలుగైదు చోట్ల అసంతృప్తి, ఇబ్బందులున్న మాట వాస్తవమే.. అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే అన్ని సద్దుమణిగేలా మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కృషి చేస్తా’ అని వినోద్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికల పర్వంలో కీలకఘట్టం మొదలయ్యే తరుణంలో అసంతృప్తులను కారెక్కించే బాధ్యతలను మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్‌కు అప్పగించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment