
నిందితుడు ఓబులేసే: కేసీఆర్ ధ్రువీకరణ
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల దృష్ట్యా నగరం అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేబీఆర్ పార్కు కాల్పుల ఘటనపై శుక్రవారం ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాల్పుల సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు గుర్తించారన్నారు. నిందితుడిని కర్నూలులో పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుడు పోలీసు కానిస్టేబుల్ పి.ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురంగా తెలిపారు.
1998లో ఓబులేసు కర్నూలు రెండో బెటాలియన్లో కానిస్టేబుల్గా నియకం జరిగిందని, 2014 మార్చి వరకూ ఓబులేసు గ్రేహౌండ్స్లో పనిచేశారన్నారు. గ్రేహౌండ్స్లోనే పనిచేస్తున్న సమయంలోనే ఏకే-47 చోరీ చేసినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితుడ్ని గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కొన్ని కెమెరాల కారణంగా చాలా కేసులను ఛేదిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణకు రూ.150 కోట్లతో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై బుధవారం కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే.