
డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు కేసీఆర్ కానుక
హైదరాబాద్ : మేడే సందర్భంగా డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బొనాంజా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పిస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శుక్రవారం జరిగిన మేడే వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా డ్రైవర్లున్నారని, వారందరికీ ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. హోంగార్డులు, జర్నలిస్ట్‌లకు సర్కారే ప్రమాదబీమా కల్పిస్తుందని కేసీఆర్ చెప్పారు. మేడే సందర్భంగా కార్మికులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆటోలపై పన్ను రద్దు చేశామని, బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల జీవనభృతి ఇస్తున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. పరిశ్రమలు కార్మికుల శ్రమదోపిడీ చేయకూడదని, వారి సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు.
అలాగే తెలంగాణలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండవని కేసీఆర్ తెలిపారు. తర్వలో పారిశ్రామిక విధానాన్ని అమలు చేయబోతున్నామని, వేలాది పరిశ్రమలు తెలంగాణకు రాబోతున్నాయన్నారు. యువతలో స్కిల్ డెవలప్ కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని కేసీఆర్ అన్నారు. ప్రయివేట్ రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.