
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన విషయంలో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల అంచనాలకు అందకుండా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటూనే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ఆలోపే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని టీఆర్‌ఎస్‌లోని ఎంపీ టికెట్ ఆశావహులు, ఎమ్మెల్యేలు భావించారు. అయితే, అభ్యర్థుల ప్రకటనతో సంబంధం లేకుండానే కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అనంతరం ఈ నెల 19న నిజామాబాద్‌లో నిర్వహించే బహిరంగసభలో పాల్గొననున్నారు. నిజామాబాద్ బహిరంగసభకు ముందు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు చెబుతున్నారు. అయితే, దీనిపై మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదని అంటున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారులో సీఎం కేసీఆర్ తనదైన శైలితో వ్యవహరిస్తున్నారని పార్టీ ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. 16 లోక్‌సభ స్థానాల్లో విజయానికి అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు.
సిట్టింగ్‌లతో భేటీ డౌటే
టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ సమావేశం సైతం ఉండబోదని తెలిసింది. సీఎం కేసీఆర్ ప్రస్తుతం సొంత నియోజకవర్గంలోనే ఉన్నారు. అక్కడి నుంచే కరీంనగర్ బహిరంగసభకు వెళ్తారని తెలుస్తోంది. ఆ తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన ముందస్తుగానే ఉంటుందని భావించిన సిట్టింగ్ ఎంపీలు, ఆశావహులలో ప్రస్తుత జాప్యం వల్ల వారిలో ఆందోళన పెరుగుతోంది. నియోజకవర్గంలో ప్రచార ఏర్పాట్లను పక్కనబెట్టి హైదరాబాద్‌లో కేసీఆర్ పిలుపు కోసం వీరంతా వేచి చూస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మార్చి 18న మొదలుకానుంది.
అరోజు వరకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైతే టీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన సైతం మరింత ఆలస్యం కానుంది. సిట్టింగ్ ఎంపీల్లో గరిష్టంగా ముగ్గురికి మళ్లీ అవకాశం ఉండబోదని తెలుస్తోంది. ఖమ్మం, మహబూబ్‌నగర్ సిట్టింగ్‌లకు తిరిగి అవకాశం ఇచ్చే విషయంపై కేసీఆర్ ఇంకా తుది నిర్ణయానికి రాలేదని సమాచారం. ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీ స్థానంలో మరో సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. మిగిలిన రెండు స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు.