
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ‘గులాబీ’ దళపతి కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తలపెట్టిన బహిరంగ సభ అనూహ్యంగా వాయిద పడినట్లు తెలిసింది. జిల్లా టీఆర్‌ఎస్ పార్టీలో నెలకొన్న వివాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఈనెల 3 నుంచి మొదటి విడత ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఏడో తేదీన వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించాల్సి ఉంది.
అయితే ఏడు నియోజకవర్గాల్లో అసమ్మతి తీవ్రంగా ఉందని, వీటిని నిలువరించడంలో స్థానిక నాయకత్వం విఫలమైందని నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ జన సభను వాయిదా వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొండా దంపతులు పార్టీ నుంచి వెళ్తూ చేసిన ఆరోపణలను టీఆర్‌ఎస్ జిల్లా నాయకత్వం దీటుగా తిప్పికొట్టలేకపోయిందనే ఆగ్రహంతో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఇటువంటి విభేదాల నేపథ్యంలో సభకు ప్రజలను ఎలా తీసుకొస్తారని, వాయిదా వేయడమే మంచిదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment