
కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 22న ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని నాలుగు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు. ఖానాపూర్, ఇచ్చోడ, నిర్మల్, ముథోల్‌లలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు జరుగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాష్ట్ర మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డికి ఫోన్ చేసి ప్రచార సభల షెడ్యూల్ వివరించారు. నాలుగు చోట్ల బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు సమాచారం.
రెండు జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాల ప్రజలకు అనువుగా ఉండేలా నాలుగు చోట్ల ప్రచార సభలను ఏర్పాటు చేయడం విశేషం. మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లో మలివిడతలో కేసీఆర్ ప్రచార సభలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 19వ తేదీతో నామినేషన్ల ఘట్టం ముగుస్తుండగా, 22వ తేదీ నాటికి ఉపసంహరణల గడువు కూడా పూర్తికానుంది. పోలింగ్‌కు సరిగ్గా 15 రోజుల ముందు కేసీఆర్ ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలతో నియోజకవర్గాల్లో కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ అభ్యర్థులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment