
24 వేల మంది రెగ్యులరైజ్
విద్యుత్ శాఖ ‘ఔట్ సోర్సింగ్’పై కేసీఆర్
- ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు.. వద్దే వద్దు
- మన పాలసీ ఒక్కటే.. చేతినిండా పని.. కడుపునిండా అన్నం
- 15–20 రోజుల్లో పదోన్నతులు పూర్తి చేయాలి.. జూన్‌లో ప్రమోటెడ్ జీతం పొందాలి
- 75 వేల మంది ఉద్యోగులతో దేశంలోనే పెద్ద కరెంట్ సంస్థగా నిలవబోతున్నాం
- కరెంట్‌లాగా పనిచేయాలి.. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘‘ఔట్ సోర్సింగ్ అంటే ఎట్లుండాలె. రెండు నెల్లకో మూడు నెల్లకో పని చేయించుకోవాలి. అంతేకానీ సంవత్సరాల తరబడి ఔట్‌సోర్సింగ్ ఏంది? కాంట్రాక్ట్ ఏంది? తలకాయ లేని ముచ్చట కాకపోతే.. గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడే చెప్పిన. కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఉన్నట్టే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని, కాంట్రాక్ట్ మంత్రిని కూడా పెట్టరాదయ్యా అని! బెహతరీన్ మనుషులు దొరుకుతరని చెప్పిన. అందుకే ఇప్పుడా పద్ధతి అవసరం లేదని చెప్తున్నా..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ‘‘మనం పెట్టుకున్న పాలసీ ఒక్కటే. చేతినిండా పనిజెప్పాలె. కడుపునిండా అన్నం పెట్టాలె. ఈ ఔట్ సోర్సిం గ్, కాంట్రాక్టు, తోక తొండెం ఉండొద్దు. ఔట్ సోర్సింగాయన రెగ్యులర్ ఉద్యోగికన్నా ఎక్కువ పనిచేస్తాడు. భయానికో భక్తికో. అందుకే మన పాలసీ ఏందంటే.. ఎంతమంది అవసరమో అంతమందినే తీసుకో. అంతమందమే జీతం ఇవ్వు.
ఆయనకు రావాల్సిన హక్కులన్నీ ఇవ్వు. పనిచేయించుకో. అదే మంచి పద్ధతి..’’అని అన్నారు. విద్యుత్ సంస్థల్లో పెద్ద ఎత్తున నియామకాలు, పదోన్నతులు చేపట్టాలని నిర్ణయించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలపడానికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డిస్కంల సీఎండీ లు జి.రఘుమారెడ్డి, గోపాలరావుల నేతృత్వంలో భారీ సంఖ్యలో విద్యుత్ ఉద్యోగులు గురువారం ప్రగతి భవన్‌కు తరలివచ్చారు. వీరిని ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ‘‘కాంట్రాక్ట్ లెక్చరర్స్‌ను రెగ్యులరైజ్ చేద్దామంటే కోర్టుకు పోయారు. సరే.. పోతే పోయిందని జీతం తక్కువనో ఎక్కువనో అని చెప్పేసి ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేశాం. విద్యుత్ సంస్థలో ఉన్న కాజువల్ లేబర్‌కు కూడా న్యాయం చేయాలి. వాళ్లను పిలుచుకుని మాట్లాడండి’’అని సీఎం అధికారులకు సూచించారు.
కరెంటులా పనిచేయాలి..
‘‘ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు, డిస్కంల చైర్మన్లకు నాదొక్కటే మనవి. రాబోయే 15–20 రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయండి. ప్రమోటైన ఉద్యోగి జూన్ నెల జీతం ప్రమోటెడ్ జీతంగా పొందాలి. కరెంటు ఎట్ల పనిచేస్తదో మీరట్ల పనిచేయాలి. అగో అంటే ఆర్నెల్లు కావొద్దు. నెల కాకుంటే రెండు నెలలు. అంతకంటే ఎక్కువ కావొద్దు. జూన్‌లో కాకుంటే జూలైలో ఇవ్వండి’’అని సీఎం విద్యుత్ సంస్థల సీఎండీలకు ఆదేశాలు జారీ చేశారు.
పాత డీపీసీ పద్ధతి ఉంటే తీసి పడేయాలని, కొత్త పద్ధతితో ఇస్తున్నాం కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. పదోన్నతుల తర్వాత ఏర్పడే ఖాళీ పోస్టులకు నియామక ప్రకటన జారీ చేసి భర్తీ చేయాలని సూచించారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 24 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా త్వరగా రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించారు.
75 వేల మంది ఉద్యోగులతో..
‘‘రెండు వేల మందిని కొత్తగా నియమించుకున్నాం. ఇప్పుడు 13,500 మంది తీసుకుంటున్నాం. అంటే దాదాపు 16 వేల మంది అవుతున్నారు. 27 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నరు. మొత్తం 43 వేల మంది అవుతారు. ఇంకో 24 వేల మంది ఔట్ సోర్సింగ్ వాళ్లను రెగ్యులరైజ్ చేస్తున్నాం. అంటే 75 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద కరెంటు సంస్థగా నిలవబోతున్నాం..’’అని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో 3 లక్షల మంది ఉద్యోగులుంటే.. ఆ తర్వాత అంత స్థాయిలో ఉద్యోగులున్నది విద్యుత్ సంస్థే అని పేర్కొన్నారు.
ఆ తర్వాత స్థానాల్లో ఆర్టీసీ, సింగరేణి ఉంటాయన్నారు. ప్రస్తుతం వ్యవసాయానికి తప్ప అందరికీ 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు. రైతులకు కూడా 24 గంటల కరెంటు ఇవ్వాలని తాను అడిగితే కచ్చితంగా ఇస్తామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావు అన్నారని పేర్కొన్నారు. అయితే 2012 నుంచి ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సీఎండీ కోరారన్నారు. 13,500 ఉద్యోగాలు భర్తీ చేసుకుంటామని, దీంతో 10 వేల మందికి ప్రమోషన్లు కూడా వస్తాయని, ప్రభుత్వ ఆశయాన్ని నెరవేస్తామని తెలిపినట్లు వివరించారు. దానికి తాను సరేనన్నానని సీఎం చెప్పారు.
ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలి
‘‘అందరూ కష్టపడి పనిచేయాలి. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలి. దయచేసి ఆ అవతారం ఎత్తాలే. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పని చేయాలి. మీరు చేస్తరనే విశ్వాసం నాకుంది’’అని ముఖ్యమంత్రి అన్నారు. అంధకారం అవుతుందన్న తెలంగాణ బ్రహ్మాండమైన రాష్ట్రంగా తయారుకావడానికి లైన్‌మెన్లు, జూనియర్ లైన్‌మెన్లు, ఇంజనీర్లే కారణమన్నారు. లైఫ్ రిస్క్ తీసుకుని వారు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.
ఎత్తిపోతల భారం డిస్కంలపై పడదు..
‘‘2018 జూన్ తర్వాత దాదాపు 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తీసుకుంటం. అంటే ఉచితంగా కాదు. హరీశ్‌రావు ఇప్పట్నుంచే లెక్కలు చూసుకోవాలి. లిఫ్ట్ ఇరిగేషన్ కరెంటు చార్జీల భారం రూపాయి కూడా విద్యుత్ సంస్థలపై పడదు. ఇరిగేషన్ డిపార్టుమెంటే బడ్జెట్‌లో కేటాయిస్తుంది’’అని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు, కాళేశ్వరం, భక్తరామదాసు, సీతారామ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, డిండి తదితర ప్రాజెక్టులకు వచ్చే ఏడాది చివర నుంచి విద్యుత్ అవసరముంటుందని, దీనికి సిద్ధం కావాలని సూచించారు.
ఓపెన్ యాక్సెస్ రద్దు చేస్తాం...
ఓపెన్ యాక్సెస్ విధానంలో పారిశ్రామికవేత్తలు కొంత విద్యుత్ బయట్నుంచి కొంటున్నారని, త్వరతో దీన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఓపెన్ యాక్సెస్‌కు వెళ్లే పరిశ్రమలకు సర్‌చార్జి విధిస్తామని, రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని, దీంతో విద్యుత్ సంస్థలు మనుగడ సాధిస్తాయన్నారు.