
నిర్దేశిత గడువులోగా పూర్తవ్వాలి
విద్యుత్ ప్రాజెక్టులపై అధికారులతో కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులన్నీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. మూడేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయాల్సిన బాధ్యత తెలంగాణ జెన్‌కో, భారత భారీ విద్యుత్ పరికరాల సంస్థ(భెల్)పై ఉందని ముఖ్యమంత్రి అన్నారు. విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి భెల్ సీఎండీ ప్రసాదరావుకు మొదటి విడతగా రూ. 350 కోట్ల చెక్‌ను ముఖ్యమంత్రి అందజేశారు.
విద్యుత్ ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని ఎప్పటికప్పుడు అందచేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వరంగంలోనే పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది తన అభిమతమని ఆయన పేర్కొన్నారు. కొత్తగూడెంలో రూ. 3,810 కోట్ల వ్యయంతో చేపట్టిన 800 మెగావాట్ల యూనిట్, మణుగూరులో రూ. 4,200 కోట్ల వ్యయంతో చేపడుతున్న 1,080 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల నిర్మాణ బాధ్యతలను భెల్‌కు అప్పగించిన విషయం విదితమే. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వరంగ సంస్థలకే అప్పగించడం ద్వారా పారదర్శకత ఉంటుందని తాను భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణను మూడేళ్లకాలంలో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా మారుస్తామని తాము ప్రజలకు హామీ ఇచ్చామని, దానిని నెరవేర్చాల్సిన బాధ్యత మీదే అని ఈ సందర్భంగా భెల్ సీఎండీ ప్రసాదరావు. జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావులకు సీఎం సూచించారు. కాగా కొత్తగూడెం, మణుగూరు విద్యుత్ ప్లాంట్ల డిజైన్‌లు, బాయిలర్లు, టర్బయిన్ల నిర్మాణ ప్రతిపాదనలు పూర్తయ్యాయని, సివిల్ పనులు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని భెల్ సీఎండీ వివరించారు. మణుగూరులో రెండేళ్లలో, కొత్తగూడెంలో మూడేళ్లలో ప్లాంట్లు సిద్ధం అవుతాయని వెల్లడించారు. వీటితోపాటు ఆదిలాబాద్‌లోని జైపూర్‌లో కూడా పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
నల్లగొండ జిల్లాలో 7,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల స్థాపనకు అవసరమయ్యే పర్యావరణ అనుమతులను కూడా త్వరలో సాధించగలమని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రులు తారక రామారావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.