సజల.. సుజల.. సస్యశ్యామల తెలంగాణ | KCR Speech On Monetary Exchange Bill At Telangana Assembly | Sakshi
Sakshi News home page

సజల.. సుజల.. సస్యశ్యామల తెలంగాణ

Published Tue, Mar 17 2020 2:53 AM | Last Updated on Tue, Mar 17 2020 5:32 AM

KCR Speech On Monetary Exchange Bill At Telangana Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు, ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం వాటిల్లనివ్వబోమని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తెచ్చేవరకు విశ్రమించబోమని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో మిగిలిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, రైతును రాజును చేసే వరకు ఖర్చుకు వెనుకాడకుండా పని చేస్తామని, రైతు సంక్షేమమే ధ్యేయంగా సజల సుజల సస్యశ్యామల తెలంగాణను సాకారం చేసే వరకు నిబద్ధతతో పనిచేస్తామని వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇచ్చారు. కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 

గోదావరి నుంచి 950 టీఎంసీలు బాజాప్తాగా తెస్తాం... 
తెలంగాణకు గోదావరిలో కేటాయించిన 950 టీఎంసీల నీటిని బాజాప్తాగా తీసుకొస్తాం. ప్రతి నీటి బొట్టును సద్వినియోగ పరచుకుంటాం. ఉమ్మడి రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోకుండానే ప్రాజెక్టులు ప్రారంభించారు. కాంగ్రెస్‌ నేతలంత అనుభవం మాకు లేకున్నా ఎగువ, దిగువ రాష్ట్రాలను ఒప్పించి ప్రాజెక్టులను కడుతున్నాం. కాంగ్రెస్‌ చెబుతున్నట్లుగా ప్రాణహిత ప్రాజెక్టులోని తమ్మిడిహెట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు సంబంధించి అగ్రిమెంట్‌ ఉన్నట్లు చూపిస్తే రాజీనామా చేస్తా. 

కాంగ్రెస్‌ దాన్ని నిరూపిస్తుందా? వాళ్లు అసమర్థతను అంగీకరించరు. ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తే అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసి ఇప్పుడు సభను, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కాళేశ్వరం ద్వారా 530 టీఎంసీల నీటిని గోదావరి నుంచి ఢంకా భజాయించి తెస్తాం. దేవాదుల నుంచి 75 టీఎంసీలు, సీతమ్మసాగర్‌ ద్వారా 175 టీఎంసీల నీటిని తీసుకొస్తాం. మిషన్‌ కాకతీయ చాలా వరకు పూర్తయింది. రెండేళ్లలో 1,200 చెక్‌ డ్యామ్‌లను పూర్తిచేస్తాం. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, తద్వారా రాష్ట్ర జీఎస్‌డీపీని పెంచుతాం. 

కాంగ్రెస్‌ పంథా మార్చుకోవాలి...
కాంగ్రెస్‌ నేతలు పంథా మార్చుకోకపోతే వారికే మంచిది కాదు. మంచిని మంచి అనే సంస్కారం నేర్చుకోవాలి. సమైక్యాంధ్రుల శాపాలు, పనికిరారని చెప్పిన వారి అంచనాలను తలకిందులు చేస్తూ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోంది. అవన్నీ ‘కాగ్‌’ లెక్కలే. కేంద్ర మంత్రులు రాష్ట్ర పథకాలను పొగిడారు. రైతు బంధును ఐరాస అభినందించింది. అయినా ప్రభుత్వ మంచిని కాంగ్రెస్‌ ఒప్పుకోవట్లేదు.  

సమైక్య పాలనలో రూ. 200 పెన్షన్‌... 
సమైక్య రాష్ట్రంలో ప్రజలకు పెన్షన్‌ ముష్టి రూ. 200 ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక పెన్షన్‌ను రూ. వెయ్యి చేశాం. వారి కడుపు నిండాలని, మంచిగా బతకాలని దాన్ని రూ. 2,016కు పెంచాం. ఏ రాష్ట్రంలో లేనివిధంగా బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇస్తున్నాం. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జీఎస్‌డీపీ రూ. 4 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడది రూ. 9.69 లక్షల కోట్లకు చేరుకుంది. టీడీపీ, కాంగ్రెస్‌ హయాంలో విజయ డెయిరీని నాశనం చేశా రు. రూ. 30 కోట్ల అప్పుల్లో ఉన్న దాన్ని మేం రూ. 25 కోట్ల లాభాల్లోకి తెచ్చాం. పాల రైతులకు రూ. 4 ప్రోత్సాహం ఇస్తున్నాం. కామారెడ్డిలో ప్రాసెసింగ్‌ యూనిట్‌ పెట్టబోతున్నాం.  

మైనింగ్‌ పాలసీ మారుస్తాం.. 
ఉమ్మడి రాష్ట్రంలో ఇసుక ద్వారా పదేళ్లలో రూ. 50 కోట్లు వస్తే తెలంగాణ వచ్చాక రూ. 2 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇప్పుడు రూ. 5–6 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నాం. గతంలో పెట్టిన మైనింగ్‌ పాలసీ బాలేదు. దాన్ని మారుస్తాం. త్వరలో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచబోతున్నాం. ఆరేళ్లలో పైసా పెంచలేదు. ఈసారి రూ. 1.63 లక్షల కోట్ల ఆదాయం సాధిస్తాం. మైన్స్, ఇసుక, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల ద్వారా మరో రూ. 20 వేల కోట్లు సాధిస్తాం.

అవసరమైతే మద్యం ధరల పెంపు
కాంగ్రెస్‌ ఎప్పుడైనా మద్యనిషేధం అమలు చేసిందా? కాంగ్రెస్‌ హయాంలో బెల్టు షాపులే లేనట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో వీధివీధికీ సారా తయారీ ఉండేది. మద్యపానాన్ని తగ్గించేందుకే రేట్లు పెంచాం. అవసరమైతే మళ్లీ మద్యం ధరలు పెంచుతాం. 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నాం కాబట్టి విద్యుత్‌ చార్జీలూ పెంచక తప్పదు. ప్రజలను మోసం చేయం. నిజాలు చెబుతాం. 

నిరుద్యోగులను మోసగించొద్దు.. 
తెలంగాణ ఏర్పడితే లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పా. ఇంటికో ఉద్యోగం వస్తుందని చెప్పలేదు. మేం చెప్పినట్లు ఉద్యోగాలు ఇస్తున్నాం. 70 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి? నిరుద్యోగ యువతను మోసం చేయడం విపక్షాలు మానుకోవాలి. వాస్తవాలు చెబితే ప్రజలు గౌరవిస్తారు. డ్రామాలు ఆడుతూ వారిని జులాయిలుగా తయారు చేయొద్దు. 50 లక్షల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తానని నేను చెప్పలేదు. అది సాధ్యమా?

దేశాన్ని తెలంగాణ సైతం సాకనుంది..
తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 2,72,926 కోట్లు వెళ్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 1,12,854 కోట్లే వచ్చాయి. ఇంకా రూ. 1,62,070 కోట్లను కేంద్రమే వాడుకుంటోంది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాల్లో కోత పెట్టారు. భవిష్యత్తులో దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉండబోతోంది. కేంద్రానికి మనం భిక్ష వేస్తున్నామా? కేంద్రం మనకు భిక్ష వేస్తుందా? నేడు అత్యధికంగా అప్పులున్న దేశం అమెరికా. వాళ్లేం తెలివి తక్కువ వాళ్లా? తెచ్చిన అప్పు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. తెచ్చిన అప్పుల్లో సాగునీటి ప్రాజెక్టులపై రూ. లక్ష కోట్లు పెట్టాం. రైతులు పంటలు పండిస్తే రెండేళ్లలోనే సగం అప్పులు తీరిపోతాయి. రాష్ట్రంలో 2 లక్షల టన్నులకుపైగా సన్న బియ్యం పంట పండబోతోంది. 

కేంద్రం తరహాలో కనీస వేతనాలు... 
చేనేత కార్మికులకు నూలు, రంగులను 50% సబ్సిడీపై ఇప్పిస్తున్నాం. కాలిపోయిన ఇళ్లకు పరిహారం ఇస్తాం. కార్మికులకు కనీస వేతనాలను కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రంలో అంత చేస్తాం. ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఉద్యోగులు కాదు. వారికి కాంగ్రెస్‌ మద్దతు సరికాదు. వారి విష యంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.

ఇది ప్రగతి కాదా..? 
సాగునీటి ప్రాజెక్టుల్లో ఏం అపోహలున్నాయి. పంట పండుతుందా లేదా? అన్న ఆందోళనకర పరిస్థితి నుంచి భరోసాతో దర్జాగా పంటలు వేసుకునేలా రాష్ట్రంలో అభివృద్ధి చేశాం. 124 రోజులు కాకతీయ కాలువ సజీవంగా పారుతోంది. అది కాంగ్రెస్‌ నాయకులకు కనిపించట్లేదా? గతంలో ఎప్పుడైనా ఇలా ఉందా? యాసంగిలో 38 లక్షల ఎకరాలకుపైగా వరి నాట్లు వేశారు. తెలంగాణ సోనాను పెద్ద ఎత్తున పండించబోతున్నాం. సీడ్స్‌ అభివృద్ధి చేయాలని వ్యవసాయ యూనివర్సిటీకి చెప్పాం. వ్యవసాయ రంగంలో రాష్ట్రం 34 శాతం వృద్ధి సాధించింది. ఇది ప్రగతి కాదా?’అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. 

చదవండి:
దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది
మరొకరికి కరోనా

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement