తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు.నా గుండెల నిండా ఎంత సంతోష పడ్డానో జోనల్ విధానం ఆమోదం పొందినప్పడు అదే అనుభూతి పొందా. ఈ విషయంలో కేంద్రం ఊగిసలాటలో ఉంటే చేస్తవా చస్తవా అని ప్రధాని మోదీని బల్లగుద్ది అడిగినం. ఇది మా రాజ్యాంగ హక్కు అని తెచ్చుకున్నం. స్వరాష్ట్రం మనకు సాధించిన విజయమిది.
వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ మంచినీళ్లు ఇయ్యకపోతే ఓట్లు అడగం అని దేశంలో ఏ ముఖ్యమంత్రీ చెప్పలేదు. ఎన్నికలకు ఆరు నెలల ముందే నీళ్లు సరఫరా చేస్తాం. ఆడపిల్లల పాదాలు కడిగి చూపిస్తం.
సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీకి గులాములుగా ఉండాలో లేక తెలంగాణ గులాబీలుగా స్వతంత్ర జీవనం గడపాలో ప్రజలే తేల్చుకోవాలని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఢిల్లీ చక్రవర్తుల కింద సామంతులుగా ఉన్న వాళ్లు, అసెంబ్లీ టికెట్ల కోసం ఢిల్లీ గుమ్మం దగ్గర కాపలా కాసే వాళ్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. అధికారం మన చేతిలో ఉంటేనే ఆత్మగౌరవంతో నిర్ణయాలు తీసుకోగలమని, ఇందుకు 50–60 ఏళ్ల క్రితమే తమిళ సోదరులు తీసుకున్న నిర్ణయం మాదిరిగా ముందుకెళ్దామన్నారు. శాసనసభకు ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోందని, తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర భవిష్యత్తుకు, టీఆర్‌ఎస్ పార్టీకి ఏది మంచిదైతే రాజకీయంగా ఆ నిర్ణయం తీసుకుంటామని, తీసుకున్నప్పుడు ప్రజలకు చెప్తామని వివరించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో జరిగిన ‘ప్రగతి నివేదన సభ’కు హాజరైన లక్షలాది మంది ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభానికి ముందు కేసీఆర్ తెలంగాణ తల్లికి నమస్కరించి తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.
కేసీఆర్ రాజకీయ ప్రసంగం ఆయన మాటల్లోనే
ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. జనమా, ప్రభంజనమా అనుకునే విధంగా తెలంగాణలోని గిరిజన గూడాలు, లంబాడీ తండాలు, మారుమూల పల్లె ప్రాంతాల నుంచి, రాష్ట్రం నలుచెరగుల నుంచి వచ్చిన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు వందనం.. శుభాభివందనం. ఈ సభను చూస్తుంటే 18–19 సంవత్సరాల నాటి జ్ఞాపకాల దొంతరలు కళ్ల ముందు తిరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో ఆనాటి సీఎం ఎడాపెడా ఇష్టం వచ్చిన రీతిలో కరెంటు చార్జీలు పెంచితే తెలంగాణ రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. ఆ రోజున ఉన్న సీఎంను తెలంగాణ బిడ్డగా ఒక బహిరంగ లేఖ ద్వారా కరెంటు చార్జీలు తగ్గించమని కోరా. అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రైతులకు పెంచిన కరెంటు చార్జీలు ఉరితాళ్లలాంటివని, ఆ ప్రతి పాదనలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశా. మీరు వాపస్ తీసుకోకపోతే సమైక్య రాష్ట్రంలో మా కష్టాలు తీరవని, స్వరాష్ట్రం కోసం, తెలంగాణ కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పా.
అప్పటికే తెలంగాణ అంటే అలుసైపోయింది. ఏం చేయగలుగుతారులే తెలంగాణ అమాయక ప్రజలనే స్థాయికి అప్పటి పాలకులు వెళ్లిపోయారు. ఏదైనా చేస్తే కేసులు పెట్టి, లాఠీచార్జీలు చేసి అవసరమైతే కాల్చి పారేస్తాం అనే అహంకారంలో ఉన్నారు. ఎందుకంటే అప్పడు ఎన్డీయే ప్రభుత్వంలో వాళ్ల హవానే నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రం వాళ్ల చేతుల్లో ఉన్నాయి. 20 ఏళ్లు మేమే ఉంటామనే అధికార మదంతో విర్రవీగిన వాళ్ల కళ్లు మూసుకుపోయి ఉన్నాయి. అందరూ అనుకున్నట్టు తెలంగాణ ఉద్యమం 2001 ఏప్రిల్ 27న ప్రారంభం కాలేదు. అసలు ఉద్యమానికి బీజం పడింది ఆనాడు నేను రాసిన లేఖతోనే. 9–10 నెలలపాటు విపరీత మేధోమథనం చేశాం. ఏం చేయాలి... ఏం చేయగలం... ప్రత్యామ్నాయమే లేదా .. కళ్లలో నీళ్లు దిగమింగుకోవడమేనా? అని ఆలోచించాం. ఇందుకోసం ఎక్కని కొండ లేదు.. మొక్కని బండ లేదు. చుట్టూ పిడికెడు మందితో చిమ్మచీకటిలో ప్రయాణం ప్రారంభించాం.
ఆరేడు నెలలపాటు మేధోమథనం తర్వాత తెలంగాణ రావాల్సిందే... పోరాడాల్సిందే.. గత్యంతరం లేదనే స్థిర నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం కోసం మార్గం ఏమిటి? కారుచీకట్లో గుండె దిటవు చేసుకుని భగవంతుని స్మరించుకుని ధర్మం, న్యాయం ఉంటే తెలంగాణ సమాజం విజయం సాధిస్తుందనే నమ్మకంతో హింస లేకుండా కొనసాగే ప్రశాంత ఉద్యమం చేపట్టాం. రాజకీయ పద్ధతిలోనే తెలంగాణ సాధించాలని సంకల్పించి ఆ బాట పట్టాం.
ఎన్నో కుట్రలు, అవమానాలు చేసినా ధైర్యం చెదరలేదు...
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు, రాజీనామాలు, ఉప ఎన్నికలు, ఢిల్లీ యాత్రలు చేశాం. పక్షి తిరిగినట్టు తెలంగాణ అంతా తిరిగా. ఎక్కడికి పోయినా ప్రజలు జేజేలు పలికారు. యావత్ మహిళలు, విద్యార్థులు, యువకులు.. ఇలా అన్ని వర్గాల వారు భాగస్వాములై ఉప్పెన సృష్టించారు. తెలంగాణ ఇస్తామని మొదట వాగ్దానం చేసిన ఢిల్లీ పెద్దలు అహంకారంతో వ్యవహరించారు. ఈ సమయంలో ఎన్నో కుట్రలు జరిగాయి. గులాబీ జెండా అయిపోయింది.. దీని పని ఖతం అని ప్రచారం చేశారు. ఆనాటి అధికార పార్టీ పెద్దలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు ఎన్నోసార్లు అవమానపర్చారు. అవహేళన చేశారు. అయినా ఏనాడూ ధైర్యం చెదరలేదు. ఓ రోజున కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, నేను... దివంగత దేశిని చినమల్లయ్య గారి ఇంట్లో కూర్చున్నం. రాత్రి 3 అవుతోంది. వినోద్ అమాయకంగా అడిగాడు. సార్.. ఏమైతది.... ఎక్కడి దాకా పోతం అని అడిగాడు. చిత్తశుద్ది, నిబద్ధత, మొండి పట్టుదల, ధైర్యం మీద ఆధారపడి ఉద్యమం కొనసాగిస్తే... తెలంగాణ సమాజం ఒక్క దిక్కే నిలబడి బరి గీసి ఇవ్వరా మా తెలంగాణ అని నినదించి అడుగుతుందని చెప్పిన.
అదే ధైర్యంతో 2001 ఏప్రిల్ 27 మీ అందరి దీవెనలతో పిడికెడు మందితో జలదృశ్యంలో ప్రతిజ్ఞ చేసిన. మడమ తిప్పను.. మాట తప్పను.. ఉద్యమ బాట వీడను, ఎత్తిన జెండా దింపను.. దించితే రాళ్లతో కొట్టండని చెప్పా. విశ్వసించిన ప్రజలు కలసి వచ్చి, కదిలి వచ్చి అద్భుతం చేసి చూపించారు. నేను కేంద్ర మంత్రిగా ఉన్న కొద్ది సమయంలో దేశంలోని 36 రాజకీయ పార్టీలను ఒకటి కాదు పది కాదు.. ఒక్కో పార్టీని 20 సార్లు కలిసినం. కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బర్దన్ గారయితే నన్ను పిచ్చోడివా అని అడిగారు. ఒక్క సీపీఐ ఆఫీసుకే 38 సార్లు వెళ్లిన. అవును.. నేను తెలంగాణ పిచ్చోడినని చెప్పిన. ఓకే నేను మద్దతిస్తా అని చెప్పారు. జయశంకర్ సార్, విద్యాసాగర్‌రావుగారు... అందరం కలసి అనేక శ్రమ, ప్రయాసలు పడి ఒక్కో పార్టీని ఒప్పించి, అనేక పోరాటాలు చేశాం. 14 ఏళ్ల కఠోర పరిశ్రమ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
కొత్త రాష్ట్రంలో భయంకర సమస్యలు...
తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే ఎన్నికలకు పోవాలె. విచిత్ర పరిస్థితి. ప్రజలు ఏం చేస్తారు.. ఎలా చేస్తారు? ఈనెకాచి నక్కల పాలు చేయకుండా.. రాష్ట్రాన్ని ఇతర పార్టీలకు అప్పగించకుండా ప్రజలను నమ్ముకొని ఒంటరి పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాం. ప్రజలు మద్దతిచ్చారు.. దీవించారు... టీఆర్‌ఎస్ బిడ్డలే శ్రీరామరక్షగా సంపూర్ణ మెజారిటీని సింగిల్ పార్టీకి ఇచ్చారు. అప్పుడు రాష్ట్రంలో భయంకర సమస్యలున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి ఏమిటో.. అసలు బడ్జెట్ ఎంతో అర్థం కాదు. మిగులు బడ్జెట్ ఉందా... రెవెన్యూ లోటు ఉందా తెలియని పరిస్థితి. అదో విపత్కర పరిస్థితి. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా నుంచే 15 లక్షల మంది ప్రజలు గూడు చెదిరిన పక్షుల్లా వలస వెళ్లారు. కులవృత్తులు ధ్వంసమై ఉన్నాయి. చెరువులు తాంబాళాలుగా మారాయి. పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు.. కరిగిపోయే వైర్లు.. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రస్థానం ప్రారంభించాం. ఎక్కడ ప్రారంభించాలో గుండె లోతుల్లోంచి నిజాయితీగా ఆలోచించాం. ఏది తెలంగాణ ప్రజలకు మొదట అవసరమో.. ఏది మొదట చేయాల్నో ఆలోచించాం.
ప్రజలకు ఏది మంచిదైతే అదే...
కేసీఆర్ ఈ సభలో ఏం చెప్తడు.. శాసనసభను రద్దు చేస్తడా... అని ఆలోచన చేస్తున్నరు. నేను ఒకమాట చెబుతున్నా. తెలంగాణ రాష్ట్రానికి, టీఆర్‌ఎస్‌కు, ప్రజల భవిష్యత్తుకు రాజకీయంగా ఏది మంచిదైతే ఆ నిర్ణయం తీసుకోవాలని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు నాకు అధికారం అప్పజెప్పారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఏం చేయాలో భవిష్యత్తులో తీసుకుంటాం. తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తా. పత్రికలు, మీడియాలో కేసీఆర్ ఏదో వరాలు ప్రకటిస్తడని రాశారు. అధి ధర్మం కాదు. ప్రభుత్వంలో ఉన్నం కాబట్టి మేం ఒకమాట చెప్పామంటే అమలు జరగాలె. అందుకోసం పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తం. ఎన్నికలలొచ్చిన తర్వాత చిత్తశుద్ధితో ఏం చేయాలో నిర్ణయిస్తం. ప్రభుత్వంలో ఉండి సీఎం హోదాలో అది చేస్తం.. ఇది చేస్తం అని చెప్పడం అనైతికం. మేనిఫెస్టోలో అన్ని అంశాలను వివరంగా తీసుకొస్తాం.
ప్రజలంతా మమ్మల్నే కోరుకుంటున్నరు...
ప్రజలంతా మళ్లీ టీఆర్‌ఎస్సే (అధికారంలోకి) రావాలని, కేసీఆరే (సీఎం) కావాలని కోరుకుంటున్నరు. నేను టీవీల్లో చూస్తున్నప్పుడు మీలో చాలా మంది మాట్లాడిండ్రు... ఫేస్‌బుక్‌లో, మీడియాలో మీరు చెప్తున్నరు మాకు టీఆర్‌ఎస్, కేసీఆరే కావాల్నని. మాకు చేపలు వచ్చినయ్, గొర్రెలొచ్చినయ్.. కరెంటు ఇచ్చిండ్రు. రోడ్లు వేసిండ్రు... చెరువులు తవ్విండ్రు..అని చెప్తున్నరు. ఇది ప్రజావాణి. ప్రజలు ఆ విధంగా చెప్తున్నరు.
ఢిల్లీకి బానిసలు కావొద్దు...
కొన్ని మూకలు, కొన్ని ప్రతీప శక్తులు ప్రాజెక్టులు ముందుకు పోకుండా కేసులు వేశాయి. ఇంకొకాయన కేసీఆర్‌ను గద్దె దింపుడే తన రాజకీయ లక్ష్యమని చెప్తడు. ఇదేం దిక్కుమాలిన లక్ష్యం. కేసీఆర్‌ను గద్దెదింపుడు ఒక లక్ష్యమా? ప్రగతి నిరోధక శక్తులు, ప్రతీపశక్తులు అవాకులు, చెవాకులు పేలుతున్నయ్. అలవిగాని మాటలు మాట్లాడుతుయ్. మోసపోతే గోసపడతం.. ఇబ్బంది పడతం. జరిగిన ప్రగతి మీ కళ్ల ముందే ఉంది. ఆత్మగౌరవంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాములుగా ఉన్నాయి. ఢిల్లీ చక్రవర్తులకు సామంతులు వాళ్లంతా... తెలంగాణ మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు ఆలోచించాలె.
అధికారం తెలంగాణలో ఉండాల్నా? ఢిల్లీ దొరల కింద ఉండాల్నా? అధికారం మన దగ్గర ఉంటే ఆత్మగౌరవంతో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ పార్టీ వాళ్లు అసెంబ్లీ టికెట్ల కోసం కూడా ఢిల్లీ గుమ్మం ముందు కాపలా కాయాలె. చెంచాగిరీ చేయాలె. ఢిల్లీకి గులాములవుదామా.. తెలంగాణ గులాబులవుదామా అనేది ప్రజలే ఆలోచించాలి. 50–60 ఏళ్ల క్రితం నుంచే తమిళ రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు ఆత్మగౌరవంతో ఎలా పాలించుకుంటున్నారో అదే మాదిరిగా మనం కావాలె. తమిళ సోదరుల్లా ఆత్మగౌరవంతో అభివృద్ధి సాధించాలె. ఢిల్లీకి బానిసలు కావద్దు. ఇది భవిష్యత్ తరాలకు మంచిది కాదు. నిర్ణయాధికారం మన చేతుల్లోనే ఉండాలె. మళ్లీ ప్రజలు దీవిస్తే ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటవుతుంది. సమూల పేదరిక నిర్మూలన జరుగుతుంది. యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలె. నా మాట విశ్వసించాలి. మరోమారు మీ ఆశీర్వచనం ఉండాలి. రాజకీయ నిర్ణయాలు త్వరలోనే మీ ముందుంటాయి. అందరికీ ధన్యవాదాలు... జై తెలంగాణ... (ఏమయింది సవ్వబడ్డరు.. గట్టిగ చెప్పాలె..) జై తెలంగాణ.. జై తెలంగాణ... జై తెలంగాణ... జై భారత్’ అని నినదిస్తూ కేసీఆర్ ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment