
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగోరోజు ప్రారంభమయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సండ్ర వెంకటవీరయ్యతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. అనంతరం ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టారు. తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మట్లాడారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చుతామని చెప్పారు. ఐదేళ్ల కాలంలో పూర్తి చేయాల్సి హామీలపై ఇప్పటినుంచి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయొద్దని సూచించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ కాలంలో రూ.17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, ఈ ప్రభుత్వ హయాంలో రూ.24 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ విషయంపై విధివిధానాల రూపకల్ప జరుగుతోందని తెలిపారు. ఆర్థిక శాఖ కార్యదర్శి బ్యాంకర్స్‌తో మాట్లాడుతున్నారని తెలిపారు. రైతుల అభివృద్ధే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఐకేపీ ఉద్యోగులను రెగ్యులర్ చేసి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ బాధ్యత వారికే అప్పగిస్తామని చెప్పారు.
గత ప్రభుత్వ కాంలో మేనిఫెస్టోలో లేని 76 పథకాలను అమలు చేశామని చెప్పారు. కంటి వెలుగు పథకంలో కొందరికి కళ్లు పోయాయని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు కంటి వెలుగులో ఇంతవరకు ఆపరేషన్లే చేయలేదని వెల్లడించారు. 100 శాతం భూరికార్డుల ప్రక్షాళన చేస్తామని అన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో భూముల వివరాలు పొందుపరుస్తామని తెలిపారు. 54 లక్షల మంది రైతులకు పాస్ పుస్తకాలు అందించామన్నారు. రైతు బీమా పథకంతో ఇప్పటివరకు 6,062 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికలు పూర్తవగానే పంచాయతీ రాజ్ చట్టాన్ని వంద శాతం అమల్లోకి చేస్తామని అన్నారు. పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని, కలప స్మగ్లింగ్‌ను అరికడతామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment