‘ముందస్తు’ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాపతినిధులు ఏం చేస్తున్నారు? అభ్యర్థులుగా వచ్చే ఎన్నికల్లో బరిలో నిలవాల్సిన నేతలు కార్యక్రమాలేమిటి? పార్టీలో కీలకంగా వ్యవహరించాల్సిన ముఖ్య నేతలు ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలేమిటి? అన్న కోణంలో టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీస్తున్నారు. వచ్చే నెల 3 నుంచి 8 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ఐదు జిల్లాల్లో ప్రజా ఆశీర్వాద సభల నిర్వహణకు ముహూర్తం ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి సభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించారు. అక్టోబర్ రెండో వారంలోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో భారీ సభ నిర్వహించేందుకు కూడా అధినేత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ సభను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై పార్టీ నేతలు çసమాలోచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో ‘ముందస్తు’గా ప్రకటించిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న రోజువారి కార్యక్రమాలపై కేసీఆర్ ఆరా తీస్తుండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ముందస్తు ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల జాబితాను ప్రకటించినా, అభ్యర్థుల గెలుపు ఓటములపై జరుగుతున్న సర్వేలు హడలెత్తిస్తున్నాయి. సొంత పార్టీల సర్వేలు ఒకవైపు.. ఇతర సంస్థల సర్వేలు మరోవైపు అభ్యర్థులను బేజారెత్తిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం నాయకుల ఎవరూ బహిరంగంగా ముందుకు రావడం లేదు. వీటన్నింటిపై సమగ్రంగా నివేదికలు తెప్పించుకున్న కేసీఆర్ ఎక్కడెక్కడ అసంతృప్తులున్నారు..? వారి వెనుక వ్యక్తులు ఎవరు..? ఆ నియోజకవర్గంలో ప్రకటించిన అభ్యర్థిపై అసంతృప్తుల ప్రభావం ఎంత..? అనే కోణంలో ఆరా తీస్తుండటం పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
దీంతో వారి కదలికలపై నిఘా పెట్టారు. ముందుగా బుజ్జగించాలని, వినకుంటే కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రకటించిన సిట్టింగ్ అభ్యర్థుల స్థానాల్లో వారు నిర్వహిస్తున్న పార్టీ కార్యకలాపాలు, ప్రచారం, సమావేశాలపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం సేకరించి నివేదికలు ప్రభుత్వానికి అందిస్తున్నట్లు తెలిసింది. నివేదికల ఆధారంగా రెబల్స్ ప్రభావం ఎంత ఉంటుందనేది అంచనా వేస్తున్నారు. జిల్లాలో సిట్టింగ్‌ల పనితీరుపై పరిశీలన జరుపుతున్నాయి.
అసంతృప్తులపై ఇంటెలిజెన్స్ ఆరా.. రంగంలోకి దిగిన అధికారులు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పరిస్థితులనూ అంచనా వేసేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఓ వైపు అభ్యర్థుల గెలుపు ఓటములు, అనుకూల, ప్రతికూల పరిస్థితులు సొంత పార్టీ నుంచి సర్వేలు చేయిస్తున్న కేసీఆర్.. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా రంగంలోకి దింపినట్లు పార్టీ నేతలే చెప్తున్నారు. ఇందులో భాగంగా ఐదు బృందాలుగా ఏర్పడిన ఇంటెలిజెన్స్ వర్గాలు మంగళవారం, బుధవారం రెండు రోజుల్లో పెద్దపల్లి, రామగుండం, వేములవాడ, జగిత్యాల, మానకొండూరు నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఆరా తీసినట్లు సమాచారం. రామగుండంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు టికెట్ ఇవ్వడంపై అక్కడి నుంచి కోరుకంటి చందర్, ఇతర నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.
వేములవాడ తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబుపైనా అసమ్మతి రోజురోజుకూ పెరుగుతుండగా, ఆయన అభ్యర్థిత్వాన్నే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాలలో డాక్టర్ సంజయ్‌కుమార్ అభ్యర్థిత్వంపై నిరసనలు పెల్లుబికగా నిజామాబాద్ ఎంపీ కవిత ప్రమేయంతో ఓరుగంటి రమణారావు తగ్గినట్లు కనిపించినా మిగతా ముఖ్య నేతలు మంగళవారం కూడా నిరసన గళం వినిపించారు. వీటితోపాటు చాపకింది నీరులా అసంతృప్తి ఉన్న పలు నియోజకవర్గాల్లోనూ నిఘావర్గాలు పర్యటించడం, పలువురిని కలిసి అభిప్రాయాలను సేకరించడం చర్చనీయాంశం అవుతోంది. అసంతృప్త నేతలపై పకడ్బందీ నిఘా వేసి వారి పర్యటనలు ఎలా సాగుతున్నవి ఆరా తీయడంతోపాటు, ఉమ్మడి జిల్లాలో సిట్టింగ్‌లు, అభ్యర్థుల పనితీరుపై నిఘావర్గాలు పరిశీలన జరుపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment