సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ తనకు కలిసొచ్చిన కరీంనగర్ పూర్వ జిల్లానే తొలి టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఈ జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులతోపాటు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడి రెండు సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్‌లో భారీ మెజార్టీని లక్ష్యంగా నిర్ధేశించిన ఆయన పెద్దపల్లిలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా అభ్యర్థిని గెలిపించే బాధ్యతను స్థానిక మంత్రి, ఇతర ఎమ్మెల్యేలపై ఉంచారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండు నియోజకవరాల్లో పార్టీ యంత్రాంగం పాదయాత్రలు, ప్రచారంతో ఇతర పార్టీల కన్నా ముందంజలో ఉన్నారు. కేటీఆర్, కేసీఆర్ పర్యటనలతో పరిస్థితి పూర్తిగా తమకు అనుకూలంగా మారుతుందనే నమ్మకంతో ఉన్నారు.
పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం పేరుతో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ఈనెల 6న కరీంనగర్‌లో తొలి సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఎన్నికల ప్రచార సభలా సాగడంతో ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయింది. అదే ఊపుతో మరుసటి రోజు నుంచే గ్రామాల్లో ప్రచారానికి తెరలేపిన వినోద్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే పూర్తిగా రంగంలోకి దిగారు. ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి రాగా, అప్పటికే అభ్యర్థిత్వం ఖరారైన వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సీఎం సభకు భారీగా జనం రావడంతో అభ్యర్థి వినోద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. నామినేషన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఆయన పూర్తిగా జనం మధ్యలోనే ఉంటున్నారు. మంత్రి ఈటల రాజేందర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ అన్నీ తానై చూసుకుంటున్నారు. కరీంనగర్ పట్టణంలో శనివారం నిర్వహించిన కేటీఆర్ రోడ్‌షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో వినోద్‌కుమార్, ఇతర టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ మెజారిటీ అంచనాలతో రెట్టించిన ఉత్సాహంలో పనిచేస్తుండడం గమనార్హం.
కేసీఆర్ సభతో మోగనున్న పెద్దపల్లి ప్రచార భేరి
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర సహచరులతో కలిసి ఆడిన గేమ్‌లో మాజీ ఎంపీ వివేకానంద పోటీలో లేకుండా పోయారు. వెన్నుపోటు ఆరోపణలతో వివేక్‌ను పెద్దపల్లి అభ్యర్థిత్వం నుంచే కాకుండా ఏకంగా పార్టీ నుంచే పంపించడంలో వీరంతా సక్సెస్ అయ్యారు. అయితే వివేక్ స్థానంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 28వేల ఓట్ల తేడాతో సుమన్ చేతిలో ఓడిపోయిన బొర్లకుంట వెంకటేశ్ నేతకు టికెట్ ఇప్పించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి, టీఆర్‌ఎస్‌లో చేరిన రోజే పార్టీ టికెట్ సాధించుకున్న వెంకటేశ్ నేత పట్ల పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు ముందుండి నడిపిస్తుండడంతో పరిస్థితి మారుతోంది.
మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వెంకటేశ్ నేత పర్యటిస్తూ ప్రచారం జరుపుతున్నారు. కాగా, ఈనెల 1న ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపైనే వెంకటేశ్ నేత ఆశలు పెట్టుకున్నారు. సీఎం ప్రచారంతో పరిస్థితి పూర్తిగా తమ వైపుకు తిరుగుతుందని భావిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎ.చంద్రశేఖర్ స్థానికేతరుడు కావడాన్ని వెంకటేశ్‌నేత తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు. కాగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లిలో టీఆర్‌ఎస్ విజయాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్ అన్నీ తామై సహకరిస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వెళ్లకుండా తమ వంతు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment