తొలిసారి దేశం దాటుతున్న కేసీఆర్!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారి దేశం దాటుతున్నారు. మంగళవారం రాత్రి 11 గంటలకు బయల్దేరి ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినా కూడా కేసీఆర్ ఇంతవరకు ఒక్కసారి కూడా దేశం దాటలేదు. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే పాస్పోర్టుకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అది వారం రోజుల క్రితమే వచ్చింది.
కేసీఆర్ ఇంతకుముందు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగాను, డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేశారు. ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత ఇద్దరూ తెలంగాణ ఉద్యమంలోకి, రాజకీయాల్లోకి వచ్చేముందు వరకు అమెరికాలో ఉండేవారు. అయినా వాళ్ల తండ్రిగా కూడా కేసీఆర్ ఎప్పుడూ అమెరికా గానీ, మరే ఇతర దేశానికి గానీ వెళ్లలేదు.
ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు కేసీఆర్ మంగళవారం రాత్రి బయల్దేరి సింగపూర్ వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, సీనియర్ అధికారులు కూడా పర్యటనలో ఉండబోతున్నారు. ఈ బృందం ఈనెల 24వ తేదీన తిరిగి హైదరాబాద్కు చేరుకుంటుంది. 22, 23 తేదీలలో జరగబోయే సదస్సులో పాల్గొనాల్సిందిగా ఐఐఎం పూర్వ విద్యార్థుల సంఘం కేసీఆర్ను ఆహ్వానించింది. ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ ఇలాంటి ఆహ్వానం అందలేదని అంటున్నారు. తెలంగాణను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని కేసీఆర్ చెబుతున్నారు. సింగపూర్ పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ పరిశీలిస్తారని అధికారులు అన్నారు. అక్కడ పర్యటన ముగిసిన అనంతరం ఆయన మలేసియాకు వెళ్తారు.