సభలో మాట్లాడుతున మంత్రి ఈటల రాజేందర్
కరీంనగర్: శాసనసభలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్నెళ్ల కాలానికి ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది. 2019–20 సంవత్సరానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశాలకు కేటాయింపుల్లో దక్కిన సింహభాగం మినహా ప్రత్యేకించి ఏమి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు మినహా ఇతరరంగాలకు అంతగా నిధుల కేటాయింపు జరగలేదన్న చర్చ జరుగుతోంది.
ప్రధానంగా సాగుతున్న ఐదు ప్రాజెక్టుల పనులను సత్వరమే పూర్తి చేసేందుకు నిధులలో వాటా పెంచినట్లు కనిపించినా.. అనుకున్న మేరకు నిధుల కేటాయింపు లేదనే విమర్శలు వినవస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలు వేములవాడ, ధర్మపురి, కొండగట్టు పుణ్యక్షేత్రాలకు నిధుల కేటాయింపు జరగలేదు. ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న కరీంనగర్ మెడికల్ కళాశాల మంజూరుకు ఈసారి నిరాశే మిగిలింది. మత్స్య కళాశాల ముచ్చట కూడా లేదు.
బడ్జెట్‌లో జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు, సమస్య ల పరిష్కారానికి కేటాయింపులు దక్కలేదని, కేవలం అంకెల గారడీగానే బడ్జెట్ ఉందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రస్తావిస్తుండగా.. అత్యుత్తమ బడ్జెట్ అని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ బడ్జెట్‌పై వివిధ రాజకీయ పక్షాలు, వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతంలో ఆర్థికమంత్రిగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవం ఉండడంతోపాటు సీనియర్ మంత్రి కావడంతో ఈసారి శాసనమండలిలో ఈటల రాజేందర్‌కు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. రాష్ట్ర బడ్జెట్‌లో సింహాభాగం నిధులు, నీటిపారుదల, వ్యవసాయం, సంక్షేమం, రోడ్ల భవనాల శాఖకు కేటాయింపులు జరిగాయి.
సంక్షేమానికి పెద్దపీట
ప్రభుత్వం సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేసిం ది. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మి కులు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మి కులు, ఎయిడ్స్‌బాధితులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని వెయ్యి నుంచి రూ.2016కు పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 1.60లక్షల మంది పింఛన్ అందుకోనున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.రెండువేల నుంచి రూ.3116కు పింఛన్ పెంచడంతో 32 వేల మందికి లబ్ధి జరగనుంది. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.12,067 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.1,450 కోట్లు కేటాయించడంతో జిల్లాకు సగటున రూ.50కోట్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగ భృతి కింద రూ.1810 కోట్లు, ఎస్సీల ప్రగతికి రూ.16,581 కోట్లు, ఎస్టీల అభ్యున్నతికి రూ.9.827 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. రాష్ట్రం యూనిట్‌గా జిల్లాకు సగటున రూ.150 కోట్ల మేర ఒక్కో సంక్షేమ పథకానికి అందే అవకాశం ఉన్న పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
డబుల్‌బెడ్‌రూం...
డబుల్‌బెడ్‌రూం ఇల్లు కలగానే మారేలా ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 25,503 డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికి పూర్తయింది 413 ఇళ్లు మాత్రమే. నిర్మాణం ఎంత నత్తనడక సాగుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలో మినహా ఏ గ్రామంలోనూ రెండంకెల సంఖ్యకు మించలేదు. వీటికీ అరకొర నిధులు కేటాయించడంతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం కలగానే మిగిలే అవకాశం ఉంది.
కలగానే కరీంనగర్‌లో మెడికల్ కళాశాల...
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వివిధ వ్యాధులతో బాధపడే వారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నట్లు తేలింది. ఈ సర్వే తర్వాత సీఎం హోదాలో మొదటిసారి కరీంనగర్ వచ్చిన కేసీఆర్ కరీంనగర్‌కు ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరు చేస్తామని ప్రకటించారు. అంతకుముందు రెండు బడ్జెట్‌లో తొమ్మిది వైద్యకళాశాలలను వివిధ జిల్లాలకు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్‌లో కరీంనగర్‌కు మొండిచేయ్యి చూపిం ది. ఆరు పర్యాయాల బడ్జెట్‌లు పూర్తయినా రూ. వెయ్యి కోట్లతో కరీంనగర్‌కు సూపర్ స్పెషాలిటీ వైద్య కళాశాల కలగానే మిగిలింది. ఉమ్మడిజిల్లాతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతా ల ప్రజలకు కరీంనగర్ ఆసుపత్రి పెద్ద దిక్కుగా ఉంది. వైద్య కళాశాల మంజూరు చేయకపోవడం.. గత బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపి నిమ్స్‌స్థాయికి పెంచుతామని ప్రకటించినా ఇప్పటికీ ఆ హోదా దక్కలేదు.
ఊసేలేని మత్స్య కళాశాల
కరీంనగర్‌లోని ఉజ్వల పార్కు వద్ద మత్య్స పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా కళాశాల మంజూరు చేస్తున్నామని రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు బడ్జెట్‌లో మత్స్య కళాశాలకు మొండిచేయి చూపించింది. తాజా బడ్జెట్‌లో సైతం నిధుల ఊసే లేకపోవడం గమనార్హం. దీంతో మత్స్య కళాశాల ఏర్పాటు అనుమానమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment