ప్రతీకాత్మక చిత్రం
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : ‘మీ నియోజకవర్గాల్లో మీకు విపత్కర పరిస్థితులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఇలాగే ఉంటే మిమ్మల్సి ఎవరూ రక్షించలేరు’ అంటూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన చేసిన ఎమ్మెల్యేలు ఎవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 మందిలో కొందరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారన్న ఆ ఐదుగురు ఎవరు? మూడు విడతల సర్వేలో వారి పనితీరును కళ్లకు కట్టిన అధినేత ఈసారి గట్టిగానే మందలించారా? ఒక సందర్భంలో ‘సిట్టింగ్’లకే మళ్లీ అవకాశం ఇస్తామన్న ఆయన తాజా సర్వేలతో వైఖరి మార్చుకోనున్నారా? ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ‘డేంజర్ జోన్’ ఎమ్మెల్యేలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొనక తప్పదా? అనే అంశాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చర్చగా మారాయి. తాజాగా గులాబీ దళపతి కేసీఆర్ 39 నియోజకవర్గాల్లో అక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు విపత్కర పరిస్థితులు ఉన్నాయం టూ హెచ్చరించిన ట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలకుగాను జగిత్యాల మినహా 12 స్థానాల నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతి నిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఐదుగురి పేర్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు వినిపిస్తుండగా.. కొంద రు ఎమ్మెల్యేలతో నేరుగా మాట్లాడిన కేసీఆర్.. మరికొందరు ఎమ్మెల్యేలకు మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్‌తో చెప్పించినట్లు సమాచారం. దీంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడున్న స్థానాలన్నింటినీ కైవసం చేసుకోవాలన్న వ్యూహంతో ఉన్న కేసీఆర్ ‘డేంజర్ జోన్’ ఎమ్మెల్యేలకు క్లాస్ ఇస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తాజా పరిణామాలు ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, అటు కేడర్‌లో హాట్‌టాఫిక్‌గా మారాయి.
ప్రామాణికంగా మూడు విడతల సర్వేలు
టీఆర్‌ఎస్ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ మొదట సర్వే జరిపించారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి వరకూ మరో రెండు విడతల సర్వే నిర్వహించారు. మొదటి, రెండో విడతల ఫలితా లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఆ సమావేశంలోనే ర్యాంకులు, మార్కులను ప్రకటించారు. తొలి సర్వేలో మంచి మార్కులు కొట్టేసిన వారు కూడా రెండో, మూడో సర్వే నాటికి వెనుకబడిపోగా.. మరికొందరు మెరుగుపర్చుకున్నట్లు తేల్చారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన ఈ సర్వేలో హుజూరా బాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఫస్ట్ ర్యాంకు ఇచ్చారు.
తొలి సర్వేలో మంత్రి 73.50 శాతంగా ఉంటే... రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30కి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ 70.60 శాతం నుంచి 60.40కు పడిపోయింది. తొలి, రెండో సర్వేలతో పోలిస్తే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నాలుగు శాతం పెరగగా.. మిగతా ఎమ్మెల్యేల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు మార్కులు తగ్గాయి. అదే వరుసలో రామగుండం ఎమ్మె ల్యే సోమారపు సత్యనారాయణ, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఉన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే శోభ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి భారీగా తగ్గారు. మూడో విడత సర్వే కూడా జరిగినప్పటికీ గోప్యంగా వ్యవహరించిన అధినేత... సర్వే ఫలితాలను ఒక్కొక్కరికీ వ్యక్తిగతంగా వివరించినట్లు అప్పట్లో పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది.
‘రైతుబంధు’ తర్వాత జరిగిన కీలక సర్వే
రైతుబంధు పథకం అమలు తర్వాత జరిగిన సర్వేలు, వివిధ మార్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికల్లో వచ్చిన సమాచారం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సర్వేలలో వచ్చిన ఫలితాలతో ఒక దశలో సీఎం కేసీఆర్ షాక్‌కు గురయినట్టు కూడా ప్రచారం జరిగింది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని, ప్రత్యర్థి పార్టీలకు కనీసం పోలింగ్ ఏజెంట్లు కూడా లేరని కేసీఆర్ చుట్టున్న నాయకులు చెప్పుకుంటున్న తరుణంలో సర్వేలు భిన్నంగా రావడంపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు ఉన్న 90 మందిలో 39 మంది డేంజర్ జోన్‌లో ఉన్నారంటూ నివేదికలు అందడం.. ఉమ్మడి జిల్లాలో ఐదుగురి పేర్లు ప్రచారంలోకి రావడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. మొదటి విడత సర్వేకు.. రెండు, మూడు సర్వేలకు తేడా పోలిస్తే మెరుగ్గా ఉన్నవారితోపాటు గ్రాఫ్ తగ్గిన పలువురి పరిస్థితి కూడా మెరుగైనట్లు తేలింది.
ఈ నేపథ్యంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించిన కేసీఆర్ ఒకటి, అర మినహాయిస్తే ‘సిట్టింగ్’లు అందరికీ టిక్కెట్లు ఇస్తామనే చెప్పారు. మూడేళ్ల కాలంలో నిర్వహించిన మూడు సర్వేలతోపాటు, రైతుబంధు తర్వాత తెప్పించుకున్న నివేదికల వరకు పరిస్థితి మెరుగుపడని వారిని అధినేత ‘డేంజర్ జోన్’లో చేర్చినట్లు చెప్తున్నారు. ఈ కేటగిరి కింద ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారని, ఆ ఐదుగురిలో కొందరితో నేరుగా మాట్లాడిన ముఖ్యమంత్రి, మరికొందరితో మంత్రులు రాజేందర్, కేటీఆర్ మాట్లాడాలని సూచించినట్లు సమాచారం. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ ఇటూ పార్టీ వర్గాల్లో, అటు రాజకీయ విశ్లేషకుల్లో కలకలం రేపుతోంది. ఇంత జరిగినా వారి పరిస్థితి మారకపోతే త్వరలోనే ఆ వివరాలు కూడా వెల్లడి కావచ్చన్న చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment