సమ్మెకెళితే వేటే.! | KCR Warning To RTC Employees | Sakshi
Sakshi News home page

సమ్మెకెళితే వేటే.!

Published Fri, Jun 8 2018 1:10 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

KCR Warning To RTC Employees - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్టీసీలో సమ్మెలను నిషేధించినా కొందరు స్వలాభం కోసం సమ్మె నోటీసు ఇచ్చారని, యూనియన్‌ నాయకుల మాటలు విని కార్మికులు మోసపోవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. సమ్మెలో పాల్గొంటే తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగాలు పోగొట్టుకోదలచిన కార్మికులు మాత్రమే సమ్మెకు దిగాలన్నారు. సమ్మెకు వెళితే తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఇదే చివరి సమ్మెగా మిగిలిపోతుందని.. ఆర్టీసీని మూసివేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అంటే నాలుగు కోట్ల మంది ప్రజలని, కేవలం 53 వేల ఆర్టీసీ కార్మికులు మాత్రమే కాదని వ్యాఖ్యానించారు. యావత్‌ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, సమ్మె అన్న ఆలోచనే ఆత్మహత్య సదృశమని పేర్కొన్నారు.

ఈ విషయాలన్నీ ఆర్టీసీ ఉద్యోగులు ఆలోచించుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని అర్థం చేసుకుని సమ్మెలో పాల్గొనదలుచుకోనివారు.. తమ నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యానికి తెలియచేయాలని సూచించారు. ఈ నెల 11వ తేదీ నుంచి సమ్మె చేపడతామని ఆర్టీసీ యూనియన్లు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వపరంగా చేయాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, డిమాండ్లు నెరవేర్చే విషయంలో సాధ్యాసాధ్యాలపై సీఎం కేసీఆర్‌ గురువారం రాత్రి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్టీసీ సమ్మెతో పూర్తిగా మునిగిపోతుందని పేర్కొన్నారు. 

సమ్మె అసమంజసం 
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఇలాంటి సమయంలో ఆర్టీసీ యూనియన్‌ నాయకులు సమ్మె నోటీసు ఇవ్వడం అసమంజసమని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘రూ.3,000 కోట్ల అప్పు, ఏటా రూ.250 కోట్ల వడ్డీ భారం, ఏటా రూ.700 కోట్ల నష్టంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మనుగడ సాగిస్తోంది. కానీ యూనియన్‌ నాయకులు సంస్థపై మరో రూ.1,400 కోట్ల భారం పడేలా డిమాండ్లతో సమ్మెకు నోటీసివ్వడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తక్షణమే సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలి. ఒకసారి సమ్మెకు పోవడమంటూ జరిగితే.. ఇప్పుడున్న నష్టాలకు తోడు అదనంగా రోజుకు నాలుగు కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. యూనియన్‌ నాయకుల అసంబద్ధమైన కోరికలైన 25 శాతం ఐఆర్, 50 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే ఇప్పుడున్న నష్టాలకు ఏటా మరో రూ.1,400 కోట్లు అదనపు భారం ఆర్టీసీపై పడుతుంది. సమ్మెకు వెళ్లి కార్మికుల గొంతు కోసేదానికంటే సంస్థను ఎలా బలోపేతం చేసుకోవాలనే దానిపై యూనియన్‌ నాయకులు దృష్టి పెట్టాలి..’’అని సీఎం హితవు పలికారు. 

ఆర్టీసీని ముక్కలు చేయాల్సి రావచ్చు.. 
దేశచరిత్రలో ఏ రాష్ట్రంలోనూ పెంచని విధంగా ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను 44 శాతం మేరకు పెంచామని.. భవిష్యత్తులో సంస్థను లాభాల బాటలో నడిపించాలని కేసీఆర్‌ చెప్పారు. కానీ ఇప్పటికీ ఫలితం కనిపించలేదని స్పష్టం చేశారు. ‘‘రెండేళ్ల కింద ఆర్టీసీ ఉద్యోగులతో విస్తృత స్థాయి సమావేశం జరిపినపుడు మొత్తం 96 డిపోల్లో 9 మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయని స్పష్టమైంది. రెండేళ్లయినా ఏ మార్పూ రాలేదు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్పొరేషన్లను ఎత్తివేయడమో, నామమాత్రంగా నడపడమో, లేదా పునర్వవస్థీకరించడమో జరిగింది. తమిళనాడులో 10 ఆర్టీసీలు, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 7.. ఇలా ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీని విభజించారు. ఇదే పద్ధతిని తెలంగాణలోనూ అవలంబించాల్సిన పరిస్థితులు రావచ్చు..’’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎన్నో ప్రైవేట్‌ సంస్థలు బ్యాంకు రుణాతో బస్సులు కొని, నడుపుతూ.. లాభాలతో రుణాలు కూడా తీర్చేస్తున్నాయన్నారు. అలాంటప్పుడు యూనియన్ల అలసత్వం వలన ఆర్టీసీ నష్టాల్లో పోవడం సమంజసం కాదని, ఆర్టీసీని ఎలా లాభాల బాట పట్టించాలనే దానిపై వారు ఆలోచన చేయాలని సూచించారు. అంతేతప్ప యూనియన్‌ ఎన్నికల్లో గెలవాలనో, స్వార్థ పూరిత ఆలోచనలతోనో ప్రభుత్వాన్ని, కార్మికుల కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం సరికాదని పేర్కొన్నారు. 

ఆర్టీసీ మనుగడ ఎట్లా? 
యూనియన్‌ నాయకుల డిమాండ్లను అంగీకరిస్తే ప్రభుత్వంపై ఏటా రూ.1,400 కోట్ల అదనపు భారం పడుతుందని.. ఇప్పటికే ఉన్న అప్పులు, నష్టాలు కలసి ఆర్టీసీ మనుగడ ఎలాగని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. నష్టాలను పూడ్చుకోవడం కోసం బస్సు చార్జీలు పెంచాలని యానియన్‌ నాయకులు అడగటం అసమంజసమని పేర్కొన్నారు. ప్రజలపై భారం పడేలా చార్జీలు పెంచాలని కోరడం దారుణమన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చడం కోసం ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలని అంటున్నారని.. దీనికి ఐదారు వేల కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు. ఇప్పటికే రైతు బంధు, రైతు బీమా, ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి ఎన్నో సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వ్యయం చేస్తున్న నేపథ్యంలో.. ఆర్టీసీ భారాన్ని భరించటం కష్టమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆర్టీసీ మునిగిపోతే.. ఇప్పుడు సమ్మె చేపడుతున్న యూనియన్‌ నాయకులే బాధ్యులని వ్యాఖ్యానించారు. యూనియన్‌ ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, కార్మికులంతా దీనిని గుర్తించాలని సూచించారు. 

ఇప్పటికే జీతాలు ఎక్కువ! 
ఇతర రాష్ట్రాల ఆర్టీసీలతో పోల్చి చూస్తే.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగుల జీతాలు ఎక్కువగా ఉన్నట్టుగా అధికారులు లెక్కతేల్చారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘‘డ్రైవర్ల వేతనం అన్ని రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. కండక్టర్, మెకానిక్, శ్రామిక్‌ల జీతాలు కూడా టీఎస్‌ఆర్టీసీలో ఎక్కువే. కర్ణాటకలో సగటున ప్రతి 4.6 మంది కార్మికులకు ఒక బస్సు చొప్పున నడుపుతుండగా.. టీఎస్‌ ఆర్టీసీలో సగటున ప్రతి 5.6 మంది కార్మికులకు ఒక బస్సు నడుస్తున్నాయి. కర్ణాటక ఆర్టీసీ విధానాలను ఇక్కడ అవలంబిస్తే (ఆ మేర ఉద్యోగులను తగ్గిస్తే) నష్టాలు రూ.600 కోట్లు తగ్గుతాయి. ఆర్టీసీ నష్టాల్లో ముఖ్యమైన కారణం అధిక జీతభత్యాలు, అధిక సిబ్బంది. కార్మికులు, యాజమాన్యం కలసి ఈ విషయాలు చర్చించుకోవాల్సి ఉంది. కర్ణాటకలో 226 డిపోలతో విజయవంతంగా నడపగలుగుతున్నా.. అందులో మూడోవంతు అంటే 97 డిపోలే ఉన్నా లాభాల్లో ఉండలేకపోతున్నాం. గతంలో ఆర్టీసీ లాభాల్లో నడిపినప్పుడు కూడా ఇంత తెలివి తక్కువ, అసంజమైన డిమాండ్లు ఎప్పుడూ తేలేదు..’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి.. 
ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న 2,200 అద్దె బస్సులతోపాటు అదనంగా బస్సులు నడిపే ఇతర సంస్థల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సాయం తీసుకోవాలని సూచించారు. ప్రైవేటు డ్రైవర్లు, పదవీ విరమణ చేసిన డ్రైవర్ల సేవలను తీసుకోవాలన్నారు. ఒకసారి సమ్మె మొదలై బస్సులు నడవకపోతే ప్రజలు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారని.. ప్రైవేటు వాహనాలు మార్కెట్లోకి వస్తాయని చెప్పారు. ఇలా మార్కెట్లోకి వచ్చిన ప్రైవేటు వాహనాలు తిరిగి వెనక్కి వెళ్లడం కష్టమని, ఒక విధంగా ప్రైవేటు వాహనాలు పెరగడానికి ఆర్టీసీ యానియన్‌ చర్యలే కారణమవుతాయని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, భూపాల్‌రెడ్డి, శాంతి కుమారి, రాజశేఖర్‌రెడ్డి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, ఆర్టీసీ ఎండీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement