ఆర్టీసీ సిబ్బందికీ టీ ఇంక్రిమెంట్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వోద్యోగులకు ప్రకటించిన తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ను ఆర్టీసీ కార్మికులకు వర్తింపజేయనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనివల్ల ఆర్టీసీపై రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు భారం పడుతుందని, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఆర్టీసీకి సమకూరుస్తుందని చెప్పారు. ఇటీవల నిర్వహించిన సమగ్ర సర్వే రోజున అందరికీ సెలవు ప్రకటించినప్పటికీ ఆర్టీసీ సిబ్బంది మాత్రం విధి నిర్వహణలో ఉన్నారని గుర్తుచేస్తూ.. ఆ రోజును సెలవుగా పరిగణించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన 80 మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను శనివారం సీఎం కేసీఆర్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ప్రజలకు రవాణా వసతి కల్పించటం ఖర్చు, నష్టాలతో కూడుకున్న కార్యక్రమం అయినప్పటికీ... దాన్ని నిర్వహించటం ప్రభుత్వాల సామాజిక బాధ్యత అని చెప్పారు. కార్మికుల చెమట చుక్కల ఫలితంగా రాష్ట్రంలో ప్రజలకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులో ఉందన్నారు. అలాంటి ఆర్టీసీని ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. ‘‘గతంలో నేను రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ రూ.11 కోట్ల నష్టాల్లో ఉండేది. ఆర్టీసీ, రవాణా అధికారులతో కలిసి అక్రమ రవాణాను అరికట్టి రూ.12.50 కోట్ల లాభాల్లోకి తెచ్చాం. ఇప్పుడు కూడా అదే చేయాల్సి ఉంది. రెండు విభాగాల అధికారులు, కార్మికులతో సమావేశమై చర్చిద్దాం. పట్టుపడితే... జట్టు కడితే కచ్చితంగా లాభాలొస్తాయి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
తలుచుకుంటే ఒళ్లు పులకరిస్తుంది..
‘‘ఉద్యమ సమయంలో ఎప్పుడు పిలిస్తే అప్పు డు, ఎక్కడికి పడితే అక్కడికి కేసీఆర్ వచ్చిండు.. ఇప్పుడు దొరుక్తలేడు అని మీరు అనుకుంటున్నరు కదా... అందుకే అనుకుంటా.. ఈ బస్సు ల ప్రారంభానికి మంత్రి మహేందర్‌రెడ్డి పట్టుబట్టి నన్ను పట్టుకొచ్చిండు. నేను కార్మికులను ఎన్నటికీ మర్వ. తెలంగాణ ఉద్యమంలో 57,200 మంది ఆర్టీసీ కార్మికులు ముందుండి చేసిన పోరాటాన్ని తలుచుకుంటే ఒళ్లు పులకరిస్తది’’ అని కేసీఆర్ అన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలని, వారికి అన్ని వసతులు కల్పించిననాడు అవసరమైతే మరో అరగంట పాటు అదనంగా పనిచేసేందుకు సంతోషంగా ముందుకొస్తారని అధికారులనుద్దేశించి పేర్కొన్నారు. మహిళా కార్మికులకు ప్రత్యేక భోజన, విశ్రాంతి గదులుండాలని, వారికి ఆరోగ్యకర పరిస్థితి కల్పించాలని, టాయిలెట్లు మెరుగ్గా ఉండేలా చూడాలని సూచించారు. దేశంలో అతి తక్కువ ప్రమాదాలు జరిగే సంస్థగా మన ఆర్టీసీకి పేరుందని, ఇదే స్ఫూర్తితో 10,300 బస్సులతో దేశంలో మూడో అతిపెద్ద రవాణా సంస్థగా ఉన్న తెలంగాణ ఆర్టీసీకి మరింత మంచి పేరు తేవాలని సూచించారు. సిబ్బంది నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు హకీంపేటలోని శిక్షణ సంస్థ చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. బస్సులు సౌకర్యంగా తిరిగేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను బాగు చేస్తున్నామన్నారు. కొత్తగా 10 వేల కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మిస్తామని, 20 వేల కిలోమీటర్ల మేర మట్టి రోడ్లను మెరుగుపర్చేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
కార్మికుల సంక్షేమానికి చర్యలు: దత్తాత్రేయ
టీఎస్ ఆర్టీసీ దేశంలో ఉత్తమంగా ఉండేందుకు కేంద్రం తరఫున సాయం కోసం చొరవ చూపుతానని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి దత్తాత్రేయ చెప్పారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు మహేందర్‌రెడ్డి, నాయిని, పద్మారావు, ఎంపీలు నర్సయ్య గౌడ్, వి.హన్మంతరావు, ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, కనకారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, యాదయ్య, సంజీవరావు, మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, జేఎండీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక సంఘాల హర్షం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమం త్రి కేసీఆర్ తెలంగాణ ఇంక్రిమెంట్ ప్రకటించడంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి, తెలంగాణ ఎంప్లాయీస్ యూని యన్ నేతలు రాజిరెడ్డి, బాబు, భాస్కర్‌రావు, తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నేతలు రాంచందర్, వీఎస్‌రావు తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.