ప్రభుత్వం ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తోంది: ఎర్రబెల్లి
సభలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమ పార్టీ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తోందని టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో స్పీకర్ మధుసూదనాచారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఏసీ సమావేశానికి టీడీపీ తరఫున ఒక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వడం దురదృష్టకరమన్నారు. సభలో అధికారపక్షం తమ గొంతు నొక్కుతోందని, విద్యుత్, డీఎల్ఎఫ్ భూముల అంశంపై చర్చలో పాల్గొనకుండా తమను అడ్డుకోవడం అధికార పార్టీకి సరికాదన్నారు.
సంబంధిత ఫైళ్లను సభ ముందు ఉంచుతామని చెప్పిన సీఎం కేసీఆర్ తన హామీని నిలబెట్టుకోలేదని ఎర్రబెల్లి అన్నారు. మంత్రి కేటీఆర్పై ప్రివిలేజ్ మోషన్ను సభలో ప్రవేశపెట్టకుండా తమను అడ్డుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. సిమెంటు ధరల విషయంలో కూడా సీఎం కేసీఆర్ సభను తప్పుదోవ పట్టించారన్నారు. అధికారపక్ష సభ్యులే పోడియం వద్దకు వచ్చి సభను అడ్డుకోవడం శోచనీయమని మండిపడ్డారు.