కొలువుదీరిన సభ | Telangana Assembly session begins | Sakshi
Sakshi News home page

కొలువుదీరిన సభ

Published Tue, Jun 10 2014 1:56 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

కొలువుదీరిన సభ - Sakshi

కొలువుదీరిన సభ

సమావేశమైన తెలంగాణ తొలి అసెంబ్లీ
చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం
‘తెలంగాణ శాసనసభ్యుడినైన నేను..’ అంటూ సభ్యుల ప్రమాణం
11 గంటలకు సీఎం హోదాలో సభలో అడుగుపెట్టిన కేసీఆర్
ప్రొటెం స్పీకర్‌గా సభ్యులతో ప్రమాణం చేయించిన జానారెడ్డి
 119 మందిలో 117 మంది హాజరు.. అక్బరుద్దీన్, ముంతాజ్ గైర్హాజరు
 తొలుత కేసీఆర్.. తర్వాత మంత్రులు, మహిళా సభ్యులు
 జూబ్లీహాలులో మండలి భేటీ.. 31 మంది సభ్యుల హాజరు
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చట్టసభల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ తొలి అసెంబ్లీ కొలువుదీరింది. ఆరు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైన వేళ సభ్యులంతా ‘తెలంగాణ శాసన సభ్యుడినైన నేను...’ అంటూ ఉత్సాహంగా ప్రమాణం చేశారు. సభలో మొత్తం 119 మంది సభ్యులకుగాను 117 మందితో ప్రొటెం స్పీకర్ జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. మజ్లిస్ పార్టీకి చెందిన అక్బరుద్దీన్ ఒవైసీ, ముంతాజ్‌ఖాన్‌లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాలేదు. సోమవారం తొలి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సభలోకి అడుగుపెట్టారు. ఆ వెంటనే సభ ప్రారంభమైంది. అంతకుముందే రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన జానారెడ్డి స్పీకర్ స్థానంలో కూర్చున్నారు.
 
 సభ్యులను ప్రమాణం చేయాలని కోరడంతో అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఒక్కొక్కరిని పిలిచారు. ముందుగా సీఎం కేసీఆర్, ఆ తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. మంత్రుల అనంతరం మహిళా సభ్యులు ప్రమాణం చేశారు. తర్వాత అక్షర క్రమంలో సభ్యులను పిలిచారు. సభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో ఎంఐఎం సభ్యులు ఉర్దూలో, బీజేపీ సభ్యుడు రాజాసింగ్ హిందీలో, మహిళా ఎమ్మెల్యేలు అజ్మీరారేఖ, గీతారెడ్డి, పద్మావతిరెడ్డితోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఆంగ్లంలో, మిగిలిన వారంతా తెలుగులో ప్రమాణం చేశారు. రెండు గంటలపాటు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడింది.
 
 గులాబీ గుభాళింపు..
 
 సభ ప్రారంభానికి అరగంట ముందే అన్ని పార్టీల సభ్యులు తమ తమ పార్టీ గుర్తులున్న కండువాలతో అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. టీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సభలో గులాబీ గుభాళించింది. సభలో సగానికిపైగా సీట్లలో వారే ఆసీనులయ్యారు. నిన్నటి వరకు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి రివర్స్ అయింది. 21 మంది సభ్యుల్లో సీఎల్పీ నేత జానారె డ్డి ప్రొటెం స్పీకర్ కుర్చీలో ఆసీనులవగా, మిగిలిన 20 మంది సభ్యులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. శాసనసభాపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన మంత్రివర్గ సభ్యులు స్పీకర్‌కు కుడివైపున మొదటి వరుసలో ఆసీనులవగా, కేటీఆర్, మహేందర్‌రెడ్డి వెనుక బెంచీల్లో కూర్చున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మొత్తం 8 వరుసలతో 295 మంది సభ్యులకు సరిపడా సీట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూడా అవే సీట్లు ఉండటంతో మంత్రులు, ఎమ్మెల్యేలంతా మొదటి నాలుగు వరుసలకే పరిమితం కావడంతో వెనుక నాలుగు లైన్లు సభ్యులు లేఖ ఖాళీగా కనిపించాయి. ఇక అసెంబ్లీ లాబీల రూపురేఖలు కూడా మారిపోయాయి. గతంలో ఏర్పాటైన ఎమ్మెల్యే లాంజ్‌ను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సభ్యులకు కేటాయించారు. అదే వరుసలో ఉన్న మంత్రుల చాంబర్లనూ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. గతంలో డిప్యూటీ స్పీకర్ చాంబర్ ఎదురుగా ఉన్న క్యాంటీన్ వైపు నుంచి సీఎం చాంబర్‌కు అనుసంధానిస్తూ కొత్తగా ఏర్పాటు చేసిన లాబీని తెలంగాణ మంత్రులకు కేటాయించారు. అక్కడే తెలంగాణ ఎమ్మెల్యేల లాంజ్ ఏర్పాటు చేశారు. లోగడ ప్రతిపక్షనేత చంద్రబాబుకు కేటాయించిన చాంబర్‌ను ఇప్పుడు సీఎల్పీ నేత జానారెడ్డికి కేటాయించారు.
 
 శాసన మండలిలో ఇలా..
 
 నిన్నటి వరకు ఉన్న మండలిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో జూబ్లీహాలు వేదికగా సోమవారం తెలంగాణ శాసన మండలి కొలువైంది. మొత్తం 40 మంది సభ్యుల సామర్థ్యం కలిగిన సభకు తొలిరోజు మండలి చైర్మన్ విద్యాసాగర్‌రావుతో కలిపి 31 మంది హాజరయ్యారు. తక్కువ మంది సభ్యులుండటంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం గంటసేపటిలోపే ముగిసింది.
 
 తాత్కాలిక చైర్మన్, ప్రొటెం స్పీకర్‌ల ప్రమాణం..
 
 తెలంగాణ శాసన మండలి తాత్కాలిక చైర్మన్‌గా నేతి విద్యాసాగర్, శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాలులో గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, టి.రాజయ్య, మంత్రులు టి.హరీష్‌రావు, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, బీజేపీ శాసనసభా పక్షనేత డాక్టర్ కె.లక్ష్మణ్, వైఎస్సార్‌సీపీ పక్షనేత తాటి వెంకటేశ్వర్లు, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, డి.రాజేశ్వర్ పాల్గొన్నారు.
 
 
 దశాబ్దం తర్వాత అసెంబ్లీకి కేసీఆర్


 దాదాపు పదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999 దాకా మంత్రిగా, శాసనసభ్యుడిగా ఉన్న కేసీఆర్.. 2001లో డిప్యూటీ స్పీకరుగా పనిచేశారు. ఆ సమయంలోనే పదవితో పాటు శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. ఉప ఎన్నికల్లో గెలిచి 2004 దాకా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో ఎమ్మెల్యేగా, ఎంపీగా కూడా కేసీఆర్ గెలిచినా వెంటనే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2009లోనూ ఎంపీగానే ఉన్నారు. 2004 తర్వాత శాసనసభలో కేసీఆర్ సోమవారం అడుగుపెట్టారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement