
కేసీఆర్...ఆలోచనా విధానం మార్చుకో
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆలోచనా తీరులో బలహీనతలున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం హితవు
పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆలోచనా తీరులో బలహీనతలున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సచివాలయం, హైకోర్టు కోసం అవసరం లేకున్నా కొత్త భవనాలను నిర్మించి, పాత భవనాల్లోని భూములను వేలంలో అమ్ముకోవాలనే దుర్బుద్ధితో కేసీఆర్ ఆలోచిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు కావాల్సింది బంగారు తెలంగాణ కాదని... ప్రజా తెలంగాణ అని, చేసిన కష్టానికి ఫలితం తప్ప భిక్షం కోరుకోవడం లేదన్నారు.
ఇప్పటికైనా కేసీఆర్ ఆలోచన ధోరణిని మార్చుకుని ఎన్నికల హామీలను అమలు చేయాలని, లేకుంటే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఇక్కడి మఖ్దూం భవన్‌లో జాతీయ పతాకాన్ని సురవరం ఆవిష్కరించగా, సీనియర్ నాయకుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ దళితులకు భూపంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్ల వంటి ప్రధాన హామీలలో ఒక్కదాన్ని కూడా కేసీఆర్ తన ఏడాది పాలనలో అమలు చేయలేకపోయారని ఆరోపించారు.
కేసీఆర్‌కు రామోజీ దైవం: నారాయణ
ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమ సమయంలో ఎన్నో హామీలిచ్చి మోసపూరితంగా మాట్లాడిన వారే అధికారంలోకి వచ్చారని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డా. కె.నారాయణ విమర్శించారు. ప్రభుత్వ భూములను కబ్జాచేసి కట్టిన రామోజీ ఫిల్మ్ సిటీ (ఆర్‌ఎఫ్‌సీ)ని లక్షనాగళ్లతో దున్నిస్తానని ఆనాడు చెప్పిన కేసీఆర్‌కు ఇప్పుడు ఆదే రామోజీరావు దైవంగా మారాడని, ఆర్‌ఎఫ్‌సీలో సెంటు భూమి కూడా అక్రమంగా లేదని కితాబిచ్చారని గుర్తుచేశారు.