
కేసీఆర్ పాలనకు జీరో మార్కులే: నాగం
కేసీఆర్ ఆరు నెలల పాలనకు జీరో మార్కులే వచ్చాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్: కేసీఆర్ ఆరు నెలల పాలనకు జీరో మార్కులే వచ్చాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ ఒక్క వర్గం ప్రభుత్వ చర్యల పట్ల విశ్వాసంగా లేదని, ప్రభుత్వం అండగా నిలుస్తుందన్న ఆశలు కూడా కోల్పోతున్నారని అన్నారు.
సోమవారం నాగర్‌కర్నూల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు, అద్భుతమైన మాటల గారడీతో కాలం నెట్టుకొస్తున్న కేసీఆర్ ప్రతిదానికీ తెలంగాణ సెంటిమెంట్ జోడించి వాస్తవ పరిస్థితుల నుంచి తప్పుకునేందుకు చూస్తున్నారని విమర్శించారు.
రూ. లక్ష రుణమాఫీ చేయకపోవడంతోనే రైతుల్లో అసంతృప్తి, అభద్రతాభావం పెరిగి ఆత్మహత్యలకు దారి తీస్తోందని మండిపడ్డారు. వాటర్‌గ్రిడ్ పథకం వెనక ఏదో మతలబు ఉందని నాగం ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా.. ఎంజీఎల్‌ఐ పథకం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల గురించి ఎందుకు ఆలోచించడం లేదని నాగం ప్రశ్నించారు.