ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే | KCR, Harish rao Worshiped At Konaipally God With Complaining | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే

Published Thu, Nov 15 2018 8:45 AM | Last Updated on Thu, Nov 15 2018 11:08 AM

KCR, Harish rao Worshiped At Konaipally God With Complaining - Sakshi

సాక్షి, సిద్దిపేట: ‘ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే..’ మీరు పెంచిన కేసీఆర్‌నే. మీ ఆశీస్సులతో.. మీ బిడ్డగా ఎదిగి అసాధ్యం అనుకున్న ప్రత్యేక రాష్ట్ర యుద్ధంలో గెలిచాం.. రాష్ట్రం సాధించుకున్నాం.. నాకు ఇచ్చిన సహకారమే హరీశ్‌కు కూడా అందించండి.. లక్ష మెజార్టీతో గెలిపించండి అని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. బుధవారం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం కేసీఆర్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం, తర్వాత సాధించుకున్న తెలంగాణను బంగారు తెలం గాణ చేయడం కోసం పని ఒత్తిడిలో మీకు దూరంగా ఉన్నానని అన్నారు. అనుబంధం, ఆత్మీయతగల మీకు దూరంగా ఉండడంలో బాధ ఉందని చెప్పారు. ఏ కార్యక్రమంచేపట్టినా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి, స్వామి వారి, ఇక్కడి ప్రజల దీవెలనతో పని మొదలు పెడతామని అన్నారు. ఇక్కడి నుండి ప్రారంభించిన ఏ యుద్ధంలో కూడా ఓటమి ఎరుగమని కేసీఆర్‌ వివరించారు. ఇప్పుడు కూడా ఎన్నికలకు వెళ్తూ స్వామి వారి దీవెనలు తీసుకునేందుకు వచ్చి మీ అందరిని కలవడం సంతోషంగా ఉందన్నారు. మీరే నా బలమని, మీ ఆశీస్సులు నన్ను విజయం వైపు నడిపిస్తాయని చెప్పారు.

రాష్ట్రం ఏర్పాటు తర్వాత సిద్దిపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. సిద్దిపేటను జిల్లాగా ఏర్పాటు చేసుకొని ప్రజల ఇబ్బందులు తొలిగించామని చెప్పారు. మనోహరాబాద్‌ – కొత్తపల్లి రైల్వే మార్గం పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మార్గం గజ్వేల్, సిద్దిపేట మీదుగా సిరిసిల్ల, కరీంనగర్‌ లైన్‌కు కలుపుతామని అన్నారు. ఒకటి రెండు సంవత్సరాల్లో సిద్దిపేటకు రైలు వస్తుందని కేసీఆర్‌ చెప్పారు. ఒక్క విమానం తప్ప అన్ని సౌకర్యాలు సిద్దిపేట నియోజకవర్గంలో కల్పించామని చెప్పారు. 
 



లక్ష మెజార్టీతో హరీశ్‌ను గెలిపించాలి
కోనాయిపల్లి నుండి ప్రారంభించిన ప్రతీ పనిలో విజయం సాధించామని కేసీఆర్‌ అన్నారు. మీరు నాపై చూపించిన అభిమానమే నన్ను ముఖ్యమంత్రి పదవి వరకు తీసుకెళ్లిందని చెప్పారు. ఇప్పటి మాదిరిగానే స్వామి వారి దీవెనలు తీసుకొని ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. నాపై చూపించిన ప్రేమ, అభిమానం మీ నియోజకవర్గం అభ్యర్థి హరీశ్‌రావుపై కూడా చూపించాలని కోరారు. లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో హరీశ్‌రావును గెలిపించాలని కేసీఆర్‌ పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో కేసీర్‌ వెంట మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌ బాబు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ కడవరుగు రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ కోర్డినేటర్‌ బూర విజయ, సిద్దిపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, సిద్దిపేట ఎంపీపీ  శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సోమిరెడ్డి, కొమరవెల్లి మల్లన్న దేవాలయం చైర్మన్‌ పంపత్, పూజారులు కలకుంట్ల నర్సింహాచారి, కలకుంట్ల కృష్ణమాచారి, వైద్యం కృష్ణమాచారి, పోడిశెట్టి రామకృష్ణమాచారి, చిలకమర్రి హరినాథాచారి, జిల్లా పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవీస్‌ తదితరులు ఉన్నారు.

ఆలయం బాగుంది హరీశ్‌
నంగునూరు(సిద్దిపేట):  కోనాయిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న వేంకటేశ్వరాలయం బాగుందని సీఎం కేసీఆర్‌ మంత్రి హరీశ్‌రావును అభినందించారు. బుధవారం వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేసీఆర్‌ పాత ఆలయం వెనుక భాగంలో రూ. 1 కోటి 50 లక్షలతో నిర్మిస్తున్న నూతన ఆలయాన్ని పరిశీలించారు. పక్కనే ఉన్న హరీశ్‌రావుతో మాట్లాడుతూ దేవాలయం బాగుంది.. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారన్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి సమాధానం ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

 

కేసీఆర్‌ నామినేషన్‌కు విరాళం
సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ ఖర్చుల కోసం గ్రామ మాజీ సర్పంచ్‌ నిమ్మ బాల్‌రెడ్డి  కేసీఆర్‌కు రూ. 11, 111 విరాళంగా అందజేశారు. సీఎం ప్రసంగం ముగియగానే వాహనంపై ఉన్న బాల్‌రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి భారీ మెజార్టీతో గెలిచి మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని జేబులో నుంచి డబ్బులు తీసి కేసీఆర్‌కు అందజేశారు. 

భారీ బందోబస్తు
గజ్వేల్‌: ముందుగా ప్రకటించినట్లుగానే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం గజ్వేల్‌లో నామినేషన్‌ను దాఖలు చేసేందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌ నుంచి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి మధ్యాహ్నం 2:26గంటలకు చేరుకున్నారు. ముహూర్తం కోసం కొద్దిసేపు కార్యాలయంలో నిరీక్షించారు. నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అ«ధికారి విజయేందర్‌రెడ్డికి అందజేశారు. ఈనెల 11న తన ఫామ్‌హౌస్‌లో భారీ ఎత్తున కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన నామినేషన్‌కు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేసిన సంగతి కూడా విదితమే. అయినా పార్టీ ముఖ్య నేతలు, పలువురు కార్యకర్తలు కేసీఆర్‌ నామినేషన్‌ ప్రక్రియను చూడడానికి వచ్చారు.

వంద మీటర్ల దూరం అవతల ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించడంతో అంతా బారికేడ్ల ఇవతలి భాగంలోనే ఉండి దూరం నుంచి తిలకించారు. కేసీఆర్‌ వెంట మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, కేసీఆర్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డిలు ఉన్నారు. కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే కాన్వాయ్‌ ఆగి ఉండగా... మూడు ప్రత్యేక వాహనాల్లో వెళ్లి నామినేషన్‌ వేశారు. కేసీఆర్‌ నామినేషన్‌ వేస్తున్న సందర్భంలో బయట ఉన్న కార్యకర్తలు, నాయకులు జై తెలంగాణ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

కేసీఆర్‌ నామినేషన్‌ వేసే సందర్భంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి, తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ ఎలక్షన్‌రెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి మెదక్‌ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్‌ తదితరులు వంద మీటర్ల అవతల నిలబడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

వేంకటేశ్వర స్వామికి మొక్కుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement