డీఆర్‌డీఓ జగత్‌కుమార్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ
అశ్వారావుపేటరూరల్: డీఆర్‌డీఓపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనకబడ్డ పంచాయతీ వివరాలు అడగ్గా.. సరైన సమాధానం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ ద్వారా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు శుక్రవారం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆకస్మికంగా అశ్వారావుపేట మండలంలో పర్యటించారు. డీఆర్‌డీఓ జగత్‌కుమార్ రెడ్డి సూచన ప్రకారం మండలంలోని వేదాంతపురం గ్రామ పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి తెలుసుకునేందుకు గ్రామంలో పర్యటించారు. పంచాయతీకి ఎన్ని మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఎన్ని నిర్మించారని ప్రశ్నించారు. పంచాయతీకి 29 మరుగుదొడ్లు మంజూరు కాగా, వాటిలో 23 పూర్తి చేశామని, మరో 6 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని డీఆర్‌డీఓ జగత్‌కుమార్‌రెడ్డి వివరించారు. ఈ క్రమంలో కలెక్టర్ జోక్యం చేసుకుని ‘నిర్మాణాల్లో ప్రగతి ఉన్న చోటకు తనను దేనికి తీసుకొచ్చారు..? నిర్మాణాల్లో వెనుకబడిన చోటకు తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చి ప్రయోజనం ఏమిటీ..? నా టైమ్ వేస్ట్ చేశావ్..? మీ వల్ల ఒక రోజు డిలే అయిపోయంది కదా.? ఇదేనా మీ పనితీరు.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనుకబడిన పంచాయతీకి తీసుకెళ్లమని అడగ్గా.. సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు.
గుమ్మడిపల్లి పంచాయతీ కార్యదర్శిపై మండిపాటు
అనంతరం మండలంలోని గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ నిర్మాణాల్లో వెనుకబడినట్లు తెలుసుకొని ఆ పంచాయతీలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడుతుండగా గ్రామ కార్యదర్శి దొడ్డా ప్రసాద్ అక్కడికి వచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీనికితోడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన కలెక్టర్ శైనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తహసీల్దార్ రాఘవరెడ్డిని పిలిచి కార్యదర్శిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని పంపించారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కార్యదర్శిని సస్పెండ్ చేస్తానని కలెక్టర్ అన్నారు. గ్రామ పంచాయతీకి 231 మరుగుదొడ్లు మంజూరు కాగా, కేవలం 50 మాత్రమే పూర్తై, 181 మరుగుదొడ్లు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి గల కారణాలను గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన బిల్లులు రావడం లేదని, అందుకే చాలా మంది మంజూరైన నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదని స్థానికులు చెప్పారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ..బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదని, మీ గ్రామ పంచాయతీ ఖాతాలోనే రూ.10లక్షల నిధులు ఉన్నాయని, నిర్మాణాలను నిబంధనల ప్రకారం చేసుకుంటే మంజూరు అవుతాయన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో దేశంలోనే జిల్లా వెనుకబడిందని, వచ్చే జూలై 31 నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు వంద శాతం పూర్తి చేసుకొని ఓడీఎఫ్ ప్రకటించుకోవాలన్నారు. అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.రాఘవరెడ్డి, ఎంపీడీఓ కె పాపారాణి, ఈవోపీఆర్డీ ఓంటేరు దేవరాజ్, సర్పంచ్‌లు శివశంకర ప్రసాద్, కొడిమి సీత, తాజా ఎంపీటీసీ సభ్యులు వల్లెపు తిరుపతిరావు, ఏపీఓ శ్రీను, ఈజీఎస్ జేఈ స్వామి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment