పిల్లరే పడదాయె..!      | Khammam New Bus Stand Works Are Not Started | Sakshi
Sakshi News home page

పిల్లరే పడదాయె..!     

Published Sat, Aug 4 2018 10:49 AM | Last Updated on Sat, Aug 4 2018 10:49 AM

Khammam New Bus Stand Works Are Not Started - Sakshi

ఖమ్మం బస్‌స్టేషన్‌ ప్రారంభించే స్థలం

ఖమ్మంమామిళ్లగూడెం : దినదినాభివృద్ధి చెందుతున్న నగరం.. చుట్టుపక్కల మండలాలు, గ్రామాల ప్రజలు, రైతులు నిత్యం పనుల కోసం బస్సుల్లో జిల్లా కేంద్రానికి వస్తుండటంతో రద్దీ పెరిగిపోయింది. ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుండటం.. పాత బస్టాండ్‌ ప్రాంతం బస్సులు తిరిగేంత వీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనిని గుర్తించి కొత్త బస్టాండ్‌ నిర్మాణం కోసం ఎన్నెస్పీ స్థలాన్ని ఎంపిక చేసి.. అక్కడ ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం రూ.25కోట్లు మంజూరు చేసింది.

2018, జనవరి 18వ తేదీన నిర్మాణ పనులు ప్రారంభించినా.. ముందుకెళ్లడం లేదు. గుంతలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని ఎన్నెస్టీ రోడ్‌లో 7 ఎకరాల 13 కుంటల స్థలంలో రూ.25కోట్ల వ్యయంతో హైటెక్‌ హంగులతో కొత్త బస్టాండ్‌ నిర్మాణం చేపడతామని సీఎం కేసీఆర్, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు బస్టాండ్‌ స్థల పరిశీలనకు వచ్చిన సందర్భంలో పేర్కొన్నారు.

అనుకున్న మేరకు స్థలం కేటాయించిన తర్వాత చాలా రోజులకు బస్టాండ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేసి...నిర్మాణ పనులు చేపట్టారు. ఏడాది గడిచినప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దీంతో నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని నగర ప్రజలు ఎదురుచూస్తున్నారు.  

నిధులు విడుదలైనా..  

ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంలో నిర్మించిన బస్టాండ్‌ ప్రస్తుతం వస్తున్న బస్సులకు సరిపోవడం లేదు. దీంతో కొత్త బస్టాండ్‌ నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. స్థలం కేటాయించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతోపాటు నిధులు సైతం విడుదల చేసింది. గత ఏడాది జూన్‌లో పనులు ప్రారంభించినా.. ఇప్పటివరకు కనీసం పిల్లర్ల స్థాయికి కూడా చేరలేదు. నిర్మాణ పనులు చూసిన వారంతా.. ఇలా అయితే ఇంకా పదేళ్లకు పనులు కావొచ్చని చర్చించుకుంటున్నారు.

పని ప్రదేశంలో కనీసం నిర్మాణానికి అవసరమైన మిషన్లు, సామగ్రి, కూలీలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఆలస్యంగా పనులు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. పనులు ప్రారంభమైనప్పటికీ కనీసం సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు కూడా లేవనే విమర్శలొస్తున్నాయి.  

పాత బస్టాండ్‌లో ఇక్కట్లు.. 

కొత్త బస్టాండ్‌ నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని భావిస్తే.. అది కాస్తా జాప్యం కావడంతో పాత బస్టాండ్‌కు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌కు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి రోజూ దాదాపు 1,250 బస్సులు వస్తూ.. పోతుంటాయి. వేలాది మంది ప్రయాణికులు ఖమ్మం బస్టాండ్‌ నుంచి వారివారి గమ్యస్థానాలకు చేరుకుంటారు.

అలాగే రైళ్ల ద్వారా వచ్చి బస్సుల్లో ప్రయాణించే వారు కూడా అధికమే. ప్రయాణికులు, బస్సుల సంఖ్యకు అనుగుణంగా బస్టాండ్‌ ప్రాంగణం లేకపోవడంతో బస్సులు తిరిగేందుకు ఇబ్బందికరంగా మారింది. ఇక వర్షాకాలంలో ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బస్టాండ్‌ చుట్టూ నిత్యం ట్రాఫిక్‌ రద్దీ ఉండడంతో బస్సులు బస్టాండ్‌లోకి రావాలన్నా.. వెళ్లాలన్నా నరకమే కనపిస్తోంది. ఆటోలు, తోపుడు బండ్ల వల్ల బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతోందని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు.  

త్వరగానే పూర్తి చేస్తాం.. 

జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్‌ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. పాత బస్టాండ్‌ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్న మాట వాస్తవమే. 2019, మార్చి 18 వరకు కొత్త బస్టాండ్‌ నిర్మాణం పూర్తవుతుంది. ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. చీఫ్‌ ఇంజనీర్‌ పర్యవేక్షణలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  

– ఎస్‌వీజీ.కృష్ణమూర్తి, ఆర్టీసీ ఆర్‌ఎం 

అందుబాటులోకి తేవాలి.. 

పాత బస్టాండ్‌ వల్ల ట్రాఫిక్‌కు తరచూ అంతరాయం కలుగుతోంది. దీనివల్ల వాహనాలతోపాటు బస్సులకు ఇబ్బందికరంగా మారింది. కొత్త బస్టాండ్‌  నిర్మాణం త్వరగా పూర్తిచేసి అందుబాటులో తేవాలి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన బస్టాండ్‌ నిర్మాణం పూర్తయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది.  

– బ్రహ్మానందరెడ్డి, స్థానికుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement