
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రధాని మోదీ చెప్పినట్టు జనతా కర్ఫ్యూ అందరూ పాటించారు. కరోనాను కట్టడి చేయగలమన్న నమ్మకం ఏర్పడింది. అయితే ఒక్కరోజుతో ఇది సాధ్యం కాదు. ఒక్క కేసు కూడా నమోదు కాని రోజు వరకు రోజూ జనతా కర్ఫ్యూలాగే పాటించాలి. వచ్చే 15 రోజులు చాలా ముఖ్యం. కేంద్రం, అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏదో పండుగలాగా షాపింగ్ చేస్తున్నారు. కరోనా వేగవంతంగా విస్తరిస్తున్న మహమ్మారి. కలసికట్టుగా అడ్డుకోకపోతే కష్టం. అందుకే వైరస్ తన శరీరంలోకి రాకుండా ప్రతి ఒక్కరూ యుద్ధం చేయాలి. కరోనా ఇటలీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలనే గజగజ వణికిస్తోంది. ఆ దేశాలే కరోనాను తట్టుకోలేకపోతున్నాయి. అటువంటిది అభివృద్ధి చెందుతున్న, మురికివాడలు, బస్తీలున్న మనలాంటి దేశంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నష్టం తప్పదు. ప్రభుత్వ అధికారుల సూచనలను తెలుగు ప్రజలు పాటించాలి..’అని కోరారు.
ప్రభుత్వం సమాయత్తం: ‘ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 15,24,266 మంది ప్రయాణికులకు, భూభాగ సరిహద్దుల్లో 19 లక్షల మందికి స్క్రీనింగ్ చేశాం. 27,700 నమూనాలు పరీక్షించాం. 118 ల్యాబ్‌లు, 94,963 క్వారంటైన్ బెడ్స్ సిద్ధంచేశాం. 48 దేశాల నుంచి 2,040 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చాం. 107 ఇమిగ్రేషన్ సెంటర్లను క్లోజ్ చేశాం. కార్గో మినహా దేశీయ విమాన సర్వీసుల్ని మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేశాం. 5 లక్షల ప్రొటెక్టివ్ కిట్స్, 10 లక్షల మాస్కులు సిద్ధం చేశాం. ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రులనూ కరోనాపై యుద్ధానికి సిద్ధం చేశాం. వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని ఆదేశాలిచ్చాం..’అని తెలిపారు.
ధరలు పెంచితే చర్యలు తప్పవు
మాస్కులు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, దాచిపెట్టినా కఠినచర్యలు తప్పవని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. ‘కరోనా కట్టడిలో భాగంగా రిలయన్స్ సంస్థ వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసింది. వెంటిలేటర్ల తయారీకి, పాజిటివ్ కేసుల చికిత్సకు తన రిసార్ట్స్‌ను ఇచ్చేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ముందుకొచ్చింది. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తెలుగు మీడియాకు కేంద్ర ప్రభుత్వం తరపున అభినందనలు. ఈ పరిస్థితిని మార్చి 31 తరువాత సమీక్షించుకోవాల్సి ఉంటుంది’ అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment