జగిత్యాలను అతి త్వరలోనే జిల్లా కేంద్రంగా మారుస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ‘నేను గతంలో జగిత్యాలను జిల్లా కేంద్రంగా మారుస్తానని చెప్పిన. నేను మాట ఇస్తే తలతెగిపడ్డా సరే మాట తప్పను. రాబోయే కొద్దిరోజుల్లోనే జిల్లాగా ప్రకటిస్తా. వాస్తవానికి ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని ప్రధాని, హోంమంత్రి దృష్టికి తీసుకుపోయిన.
రాష్ట్రానికి అదనంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను కేటాయిస్తామని చెప్పిండ్రు. రెండు మూడు నెలల్లో ఇది జరిగే అవకాశముంది. ఆ మరుక్షణమే జగిత్యాలను జిల్లాగా మారుస్తా. జిల్లా కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే అంశంపై స్వయంగా నేనే రెండు, మూడు గంటలపాటు పాదయాత్ర చేస్తా. మాస్టార్‌ప్లాన్ రూపొందిస్తా. ప్రస్తుతం పట్టణంగా ఉన్న జగిత్యాల త్వరలోనే సిటీగా రూపుదిద్దుకోవడం తథ్యం’ అని స్పష్టం చేశారు. -రాయికల్
సోమవారం కేసీఆర్ మహారాష్ర్ట గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోయల్ ఓరాం, త్రిదండి చిన్నజీయర్‌స్వామితో కలిసి రాయికల్‌లో పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. గిరిజన ఆడిటోరియం, కళ్యాణమండపాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో విద్యాసాగర్‌రావు స్థాపించిన విద్యాపరిశోధన, శిక్షణా సంస్థలను చినజీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు అప్పగించడంతోపాటు సంబంధిత పత్రాలను సీఎం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. జగిత్యాల తాను, ఎంపీ కవిత స్వయంగా జగిత్యాలకు వచ్చి రెండు గంటల పాటు పాదయాత్ర చేసి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం సర్వే చేస్తామన్నారు.
బీడీ కార్మికులూ.. ఆందోళన వద్దు
కరీంనగర్ జిల్లాలో బీడీ కార్మికులు అధికంగా ఉన్నారని వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎవరూ అడగకున్నా తానే స్వయంగా బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళిక రూపొందించానని తెలిపారు. బీడీ కార్మికులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జీవనభృతి ఇవ్వడం కోసమే పథకాన్ని ప్రారంభించామన్నారు. గతంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీడీ కార్మికులుగా పేరు నమోదు చేయించుకున్న వారికి మొదటిదశలో పింఛన్లు ఇస్తున్నామన్నారు.
భృతి రాని బీడీ కార్మికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే పది పదిహేనురోజుల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి గతంలో లబ్దిపొందుతున్న బీడీ కార్మికులతో సమానంగా జీవనభృతి అందజేస్తామని భరోసా ఇచ్చారు. దీనికోసం అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరించి బీడీ కార్మికులకు న్యాయం చేయాలని సీఎం ఆదేశించారు.
2017 నుంచి ఏకధాటిగా 12 గంటల కరెంటు
2017 సంవత్సరానికి తెలంగాణ రైతాంగానికి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు నిరంతర కరెంటు అందజేస్తామన్నారు. ప్రభుత్వంపై 1400కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ ఆహారభద్రత పథకం కింద పేదలకు కుటుంబంలో ఒక్కొక్కరికి 6కిలోల చొప్పున బియ్యాన్ని అందజేస్తున్నామని తెలిపారు. తాగునీటి సమస్యను నివారించడం కోసం వాటర్‌గ్రిడ్ వంటి బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఆదుకోవడం కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్నిప్రవేశపెట్టి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంటుందని గుర్తుచేశారు.
ప్రతి ఇంటిలో ఏదో ఒక రూపంలో ప్రభుత్వం నుంచి అర్హులైన వారు లబ్దిపొందేలా చూడడమే ధ్యేయమన్నారు. రాయికల్‌లోని చిన్నజీయర్‌స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వృత్తివిద్యా కళాశాలకు అన్ని రకాల సదుపాయాలను ప్రభుత్వం నుంచి అందజేస్తామన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన విద్యాలయాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
రాయికల్‌లో ఐటీడీఏ ఏర్పాటు :కేంద్రగిరిజన శాఖ మంత్రి జోలోరాం
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం కృషిచేస్తామని, త్వరలోనే రాయికల్‌లో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోయల్ ఓరాం అన్నారు. రాయికల్‌లో చిన్నజీయర్‌స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజనుల పోరాట యోధుడు కొమురం భీం విగ్రహాన్ని కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వం నుంచి గిరిజనులకు ఎన్నో రకాల రాయితీలను కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్‌లోని గిరిజనుల సౌకర్యార్థం వంతెన నిర్మాణం చేపట్టాలని కోరగా, దానికి అవసరమయ్యే నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ట్రస్టు కోసం కృషి చేసిన చిన్నజీయర్‌స్వామి, విద్యాసాగర్‌రావులకు రుణపడి ఉంటానన్నారు.
ఎడ్యుకేషనల్ ట్రస్టు అభివృద్ధి చేయడమే నా కల :గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు
రాయికల్‌లోని చిన్నజీయర్‌స్వామి ఎడ్యుకేషనల్ ట్రస్టును అభివృద్ధి చేయడమే తన కల అని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. పన్నెండు సంవత్సరాల క్రితం గిరిజనుల అభివృద్ధి కోసం రాయికల్‌లో చిన్నజీయర్‌స్వామి ఆధ్వర్యంలో ట్రస్టుకు భూమిపూజ చేశామని, దాని తర్వాత అప్పటి మంత్రులు రత్నాకర్‌రావు, జీవన్‌రెడ్డి దశలవారీగా అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. తాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చేయాల్సిన సమయంలో పదవి కోల్పోవడంతో ట్రస్ట్ మూలనపడిందన్నారు.
గవర్నర్ అరుున తర్వాత ఎడ్యుకేషనల్ ట్రస్టు ద్వారా గిరిజనుల విద్యార్థులకు ఉపయోగపడడంతో పాటు రాయికల్ మండల ప్రజలకు గుర్తుండిపోయేలా ఒక ఫంక్షన్‌హాల్‌ను నిర్మించాలని సంకల్పించానన్నారు. మై హోమ్స్ అధినేత జూపెల్లి రామేశ్వర్‌రావు కోటి రూపాయల వ్యయంతో కల్యాణమండపం నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి జోయల్ ఓరాంను ఆహ్వానించగా వీరి రాకతో కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. త్వరలోనే ట్రస్టులో వృత్తివిద్యా కళాశాలను ప్రారంభించి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తానన్నారు.
ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, గిరిజన శాఖ మంత్రి చందులాల్, ఎంపీ కవిత, చిన్నజీయర్‌స్వామి, సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, గంగుల కమలాకర్, బొడిగె శోభ, సతీష్‌బాబు, పుట్ట మధు, జెడ్పీ చైర్‌పర్సన్ ఉమ, కలెక్టర్ నీతూకుమారిప్రసాద్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, రాయికల్ సర్పంచ్ రాజరెడ్డి, ఎంపీపీ పడాల పూర్ణిమ, జెడ్పీటీసీ గోపిమాధవి పాల్గొన్నారు.
త్వరలోనే... జగిత్యాల జిల్లా
Published Tue, Mar 3 2015 3:51 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement