సాక్షి, జనగామ : ఉద్యమనేత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా అత్యున్నతమైన గౌరవం లభిస్తుందని పోలీసుశాఖ హౌజింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయ ఆవరణలో రూ.కోటి నిధులతో నూతనంగా నిర్మాణం చేస్తున్న డీసీపీ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. అక్కడే మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వినోద్‌కుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటగా పోలీసు శాఖలో కనీస మౌలిక వసతుల కల్పన కోసం రూ.375 కోట్లు కేటాయించారన్నారు. రెండో విడతలో రూ.500 కోట్లు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేసి అందించినట్లు చెప్పారు. పోలీసు శాఖలో పారదర్శకత పెంచేందుకు ప్రతీనెలా జనరల్ ఖర్చుల కోసం ఎస్‌హెచ్‌ఓకు రూ.50 వేలు, పోలీస్‌స్టేషన్లకు రూ.25 వేలు, మేజర్ పోలీస్‌స్టేషన్లకు రూ.75వేలు విడుదల చేస్తున్నారన్నారు.
ఎస్పీ కార్యాలయాలకు నూతన భవనం
రాష్ట్రవ్యాప్తంగా కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలకు నూతన భవనాల నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని నిర్మల్ మినహా 13 ఎస్పీ, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్ పరిధిలో నూతన భవన నిర్మాణాల కోసం ఒక్కోదానికి రూ.55 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో రూ.25 కోట్లు విడుదల చేసి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ ఆఫీసులకు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు స్పష్టంచేశారు. నిర్మాణాల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్న పోలీసు శాఖ హౌజింగ్ బోర్డు విద్య, వైద్య, అటవీశాఖ, క్రిస్టియన్, మైనార్టీ ఇలా అనేక శాఖల పరిధిలో తాము టెండర్లు దక్కించుకుని పనులు చేస్తున్నామన్నారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడా కూడా రాజీలేకుండా పనిచేస్తుండడంతో అన్ని శాఖలు ఇటువైపు చూస్తున్నాయన్నారు. జనగామ డీసీపీ కార్యాలయంలో పై అంతస్తులో పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు చేసేందుకు మరిన్ని నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్ యాదవ్, ఎస్సై శ్రీనివాస్, రాజేష్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment