
నీ వల్లే పార్టీ ఓడిపోయింది.....
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభ కమిటీ హాల్‌లో బుధవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశంలో కోమటిరెడ్డి ...పొన్నాలతో వాగ్వివాదానికి దిగారు. సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేగా ఓడిపోయిన పొన్నాల అధ్యక్షత వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
పొన్నాల వల్లే కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైందని కోమటిరెడ్డి విమర్శించారు. ఓటమికి బాధ్యత వహించి పార్టీ నుంచి తప్పుకోవాల్సిన పొన్నాల సమావేశానికి అధ్యక్షత ఎలా వహిస్తారని ప్రశ్నించారు. పదవికి పొన్నాల ఇంకా రాజీనామా చేయకపోవటం సరికాదని అన్నారు. ఓడిపోయిన వ్యక్తి సీఎల్పీ సమావేశానికి అధ్యక్షత వహించడమేంటని కోమటిరెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఓటమికి పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డిలదే బాధ్యత అని ఆరోపించారు. గెలిచే సత్తాలేని వారికి టికెట్లు ఇచ్చి పార్టీని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.