వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం | Komuravelli seriously rich kalyanam | Sakshi
Sakshi News home page

వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

Published Mon, Dec 22 2014 12:56 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM

వైభవంగా కొమురవెల్లి  మల్లన్న కల్యాణం - Sakshi

వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

 హాజరైన సీఎం కేసీఆర్
 
కొమురవెల్లి భక్తజన సంద్రమైంది.. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య మల్లన్న కల్యాణం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.. ఈ వేడుకలను తిలకించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.. స్వామి వారికి ప్రభుత్వం తరఫున సీఎం కె.చంద్రశేఖరరావు హాజరై పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.. అనంతరం కురుమ సంఘ సభలో కొమురవెల్లిని అభివృద్ధి చేస్తానని, రాజీవ్ రహదారి వద్ద వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు..
 
వరంగల్ : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయానికి భూమి లేదని.. దేవాదాయ శాఖ, కలెక్టర్‌తో చర్చించి ఆలయానికి స్థలాన్ని సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదివారం చేర్యాల మండలం కొమురవెళ్లికి వచ్చారు. మల్లికార్జునస్వామి కల్యాణంలో పాల్గొన్నారు. కురుమ సంఘం కొత్తగా నిర్మించిన వసతి గృహాన్ని ప్రారంభించారు. కురుమ సంఘం అక్కడ నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ‘మల్లన్న ఆలయానికి ప్రస్తుతం ఎకరం స్థలం లేదు. అవసరాలకు తగినట్లుగా భూమిని సమకూర్చే విషయంపై కలెక్టరుతో, దేవాదాయ శాఖ వారితో చర్చిస్తా. కొంత భూమిని ఆలయ పరిధిలోకి తెచ్చి భక్తులకు అవసరమైన నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకుంటా.

రాజీవ్ రహదారి మార్గంలో ఉండే స్వాగత తోరణం దగ్గర నాలుగైదు ఎకరాల్లో భక్తులకు వసతులు కలిగించేలా అంశాన్ని పరిశీలిస్తాం. మల్లికార్జునస్వామి కల్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. చదువుతోనే ఏ కులానికైనా గౌరవం వస్తుంది.. కురుమలందరూ తమ పిల్లలను బాగా చదవించాలని సూచించారు. రాజకీయంగా కురుమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ కులం నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీ పదువులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.
 
కల్యాణంలో..
 
కొమురవెల్లి శ్రీ భ్రమరాంభ మల్లికార్జునస్వామి కల్యాణానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారి ఆలయానికి సమర్పించారు. వేద పండితులు సంప్రదాయబద్ధంగా 12.40 గంటలకు మంగళసూత్ర ధారణ నిర్వహించారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడే ఉన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ మంత్రి ఎ.చందూలాల్, జెడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మ, ఎంపీలు బి.నర్సయ్యగౌడ్, ఎ.సీతారాంనాయక్, కె.శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎం.యాదగిరిరెడ్డి, డిఎస్ రెడ్యానాయక్, అరూరి రమేశ్, కొండా సురేఖ, బి.శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, రాజలింగం, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కురుమ సంఘం ప్రతినిధి యెగ్గె మల్లేషం, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, కర్ణాటక మాజీ మంత్రి రేవన్న, జిల్లా కలెక్టర్ జి.కిషన్ వేదికపై ఉండి కల్యాణాన్ని వీక్షించారు. కల్యాణం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆలయంలోని మల్లికార్జునస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.

ఐనవోలుకు ఆహ్వానం

వర్ధన్నపేట మండలం ఐనవోలులో జనవరిలో వైభవంగా జరిగే మల్లికార్జునస్వామి దేవస్థానం కల్యాణోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కోరారు. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి కూడా ఐనవోలు స్వామివారి కల్యాణానికి సీఎంను ఆహ్వానించారు. వీరి విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వీరిద్దరు వేర్వేరు ప్రకటనలో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement