
కేసీఆర్ హామీ.. చంద్రబాబు కమిటీ: కొప్పుల
హైదరాబాద్: రైతు పంట రుణాల మాఫీపై తమ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన హామీ ఇస్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. రుణమాఫీపై ఎవరి చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టే అర్ధమవుతోందని అన్నారు. ఈ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ టీడీపీ నేతలు సీఎం కేసీఆర్‌పై చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
పోలవరం ఆర్డినెన్స్ పాపం చంద్రబాబుదేనని అన్నారు. టీటీడీపీ నేతలు ఈ అంశంపై చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. ఆయనకు యేడాది గడువిస్తే ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలుచేస్తారని కొప్పుల ఈశ్వర్ విశ్వాసం వ్యక్తం చేశారు.