బాబు కోసమే నిరాహారదీక్షలు
సాక్షి, సంగారెడ్డి: టీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, దయాకర్‌రావు తదితరులు పిచ్చికూతలు కూయడం మానుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే టీడీపీ నేతలు నిరాహారదీక్షలు చేస్తున్నారని విమర్శించారు. వారికి ధైర్యం ఉంటే తెలంగాణను ఇబ్బందులు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడ, గుంటూరులో దీక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు దీటుగా ప్రభుత్వం నడుపుతున్న సీఎం కేసీఆర్‌ను చూసి ఓర్వలేకనే టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ సమస్యలను లేవనెత్తుతామని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్, మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ తదితర అంశాలను లేవనెత్తుతామన్నారు.
టీడీపీని పాతరవేయటం ఖాయం
పక్క రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆ పార్టీకి ప్రజలు పాతర వేయడం ఖాయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. చంద్రబాబు మెప్పుకోసం టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రయోజ నాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు. చంద్రబాబుకు రాజకీయ బిక్షపెట్టిన ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ పేరు ఎయిర్‌పోర్టుకు పెడితే తప్పేమిటన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఎన్టీఆర్ పేరుపెట్టడం సరికాదన్నారు. ఆంధ్ర పాలకులు తమ ప్రాంతంలోని ఎయిర్‌పోర్టులకు తెలంగాణ త్యాగధనుల పేర్లు పెట్టగలరా అని ప్రశ్నించారు.