ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలుకుతున్న రేవంత్, తమిళి సై
కాన్హాశాంతివనంలో జరిగిన ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
సాక్షి, హైదరాబాద్/నందిగామ: ధ్యానంతోనే మనస్సు నియంత్రణలో ఉంటుందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతివనంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనానికి శుక్రవారం ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రపంచశాంతికి మొదటగా మనలో మనం మార్పు చెందాలని, అనంతరమే ఇతరుల్లో మార్పు వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు.
వ్యక్తులంతా నిస్వార్థంగా పనిచేస్తే మానవాళి సరైన మార్గంలో నడిచేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోని సర్వమతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలను ఒక చోటకు తీసుకురావడం, అందరూ శాంతికి పాటుపడటం గొప్ప విషయమన్నారు. అన్ని మతాల్లోని వారిని చైతన్యం చేయడమే ఆధ్యాత్మిక చైతన్యమని, ఎలాంటి వివక్షకు తావులేకుండా ‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’ అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని విశ్వశాంతికి ఈ సమ్మేళనం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. బుద్ధుడు, జగద్గురు శంకరాచార్య, కబీర్, సంత్ రవిదాస్, గురునానక్‌తోపాటు స్వామి వివేకానంద ప్రపంచానికి ఆధ్యాత్మిక సారం అందించారని రాష్ట్రపతి గుర్తుచేశారు.
మహాత్మగాంధీ రాజకీయాల్లో ఆధ్యాత్మిక విలువలను సమగ్రపరిచారని, అందుకే అయన్ను సబర్మతీ సంత్ అని పిలుస్తామన్నారు. మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన నైతిక ఆదర్శాలు, ఆధ్యాత్మిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని íపిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన ఆధ్యాత్మికవేత్తలు ఒకే వేదికపైకి రావడం హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ గురూజీ దాజీ గొప్పదనం అని ఆమె కొనియాడారు. కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ మాట్లాడుతూ ప్రపంచానికి 21వ శతాబ్దంలో ఆర్థికపరంగా, ఆధ్యాత్మికంగా మన దేశం మార్గదర్శకంగా నిలుస్తుందని వందేళ్లకు పూర్వమే స్వామి వివేకానంద జోస్యం చెప్పారన్నారు.
రామచంద్రమిషన్ అధ్యక్షుడు కమలేశ్ డీ పటేల్ (దాజి) మాట్లాడుతూ మతాలకతీతంగా మానవజాతి దృఢంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. ఈ సదస్సులో అపోలో ఆస్పత్రుల సీఎస్‌ఆర్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని ప్రసంగం ప్రత్యేకంగా నిలిచింది. ప్రజలు నిరంతరం జీవితంతో పోరాడే ఒత్తిడిలో ఉన్నారని, వారి జీవితం మారాలంటే సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగాలని సూచించారు.చినజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రతి మనసు ప్రేమమయం కావాలని, ప్రతి పువ్వు మధురమైన మకరందాన్ని నింపుకున్నట్టు ప్రతి మనిషి ప్రేమ తత్వాన్ని మనసులో నింపుకోవాలన్నారు. అంతకు ముందు ద్రౌపది ముర్ముకు కాన్హా శాంతివనం గురుజీ కమ్లేష్ పటేల్ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడే ఓ మొక్క నాటారు. ఆధ్యాత్మికవేత్తలు స్వామీగౌరంగదాస్, స్వామీ చిదానందసరస్వతి, స్వామి ముకుందానంద, యోగి నిరంజన్‌దాస్, నమ్రముని మహరాజ్ దాస్, దాజీ, దేవి చిత్రలేఖ, తారాచంద్ కంటాలే, డాక్టర్ భవానీరావు, దిల్షాద్, టోనీలాడర్, అభ్యాసీలు పాల్గొన్నారు.
ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
శంషాబాద్: రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment