సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ క్రమంలో వారు కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఇవన్నీ తప్పుడు ప్రచారం అంటూ వారు ఖండించారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాం. ప్రజా సమస్యలపై చర్చించేందుకే రేవంత్‌ను కలిశాం. సెక్యూరిటీ, ప్రొటోకాల్ సమస్యలపై కలిసి మాట్లాడాం. మేము శ్రమశిక్షణతో పనిచేసే నాయకులం. మా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
మాకు పార్టీ మారే ప్రసక్తే లేదు. అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. మాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. మేము కేసీఆర్ వెంటే ఉంటాం. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం. మా నాయకుడు ఎప్పుడూ కేసీఆరే. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుంది. బీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తాం. ఆమ నియోజకవర్గాల్లో సమస్యలు, అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎం రేవంత్‌ను కోరాం. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని రాజకీయం చేశారు. రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు.. తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో ఉంటే సీఎంను, మంత్రులను కలవకూడదా?. సీఎం రేవంత్.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడం లేదా?.
ఈ అంశంపై మేము వివరణ ఇవ్వడం లేదు.. మా కార్యకర్తలకు క్లారిటీ ఇస్తున్నాం. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసినా ఇబ్బందులు పడుతున్నాం. కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలు కాకుండా కాంగ్రెస్ నాయకులు పంచుతున్నారు. ప్రజల ఓట్లతో మేము ఎమ్మెల్యేలుగా గెలిచాం. నిన్నటి నుంచి వస్తున్న వార్తలను చూస్తే బాధ వేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకా? రాష్ట్రానికా?. మాకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది?. సీఎంను మాత్రమే కాదు, ప్రజా సమస్యల కోసం మంత్రులను సైతం కలిశాము. కలుస్తూనే ఉంటాం. సమస్యల పరిష్కారం కోసం ఇంకా వందసార్లు అయినా ముఖ్యమంత్రిని కలుస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి 15 రోజులు అవుతున్నా మాకు నీళ్ళు ఇవ్వలేదు. నేడు కొండా సురేఖ మాజిల్లా పర్యటనకు వస్తున్నారు.. ఎమ్మెల్యేలు లేకుండా ఓడిపోయిన అభ్యర్థికి ప్రోటోకాల్ ఇస్తున్నారు.
ఆరు గ్యారెంటీ పథకాలు కాదు.. 13 గ్యారెంటీ పథకాలు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే మేమే సన్మానం చేస్తాం. దుబ్బాకలో మొన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉంటే ఆయనకు ప్రోటోకాల్ మేము ఇచ్చాము. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది గులాబీ జెండానే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తాం. మేమున్నంత వరకు కేసీఆర్, గులాబీ జెండాను వదులం’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment